
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టి, రాష్ట్రంలో రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సాంకేతికత అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తోంది. ఆర్బీకే వ్యవస్థను ఇప్పటికే పలు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్‌లో రాష్ట్రంలోని ఆర్బీకే సాంకేతికతను కేంద్రం సిఫారసు చేసింది, దీంతో ఆర్బీకే వ్యవస్థ దేశ ఎల్లలు దాటింది. ఈ సాంకేతికతపై విదేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఆఫ్రికన్ దేశమైన ఇథియోపియా ఆర్బీకే తరహా సేవలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది.
ఆ దేశం వచ్చే పదేళ్లలో ఏటా 6.2 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకోసం రైతుల్లో నైపుణ్యం పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, దిగుబడుల నాణ్యతపై దృష్టి పెట్టింది. ఆ దేశ అభ్యర్థన మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య నేతృత్వంలో జాతీయ స్థాయి బృందం ఇథియోపియా వెళ్తోంది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, భారత్‌లోని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వీసీ సభ్యులుగా ఉంటారు.
ఈ బృందం 25వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తుంది. అక్కడి వ్యవసాయ పరిస్థితులు, సాగు పద్ధతులు, రైతుల సమస్యలు, సాగుకు అనుకూలమైన భూముల విస్తీర్ణం, సాగవుతున్న పంటలు, పెట్టుబడి వ్యయం, ఉత్పత్తి, ఉత్పాదకత, సాగు ఉత్పాదకాలు రైతులకు అందుతున్న తీరును పరిశీలిస్తుంది. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అందించాల్సిన తోడ్పాటుపై అధ్యయనం చేస్తుంది. అక్కడ జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు గ్రామస్థాయిలో అందుతున్న తీరును పరిశీలిస్తుంది.
ఆర్బీకే తరహాలో అక్కడ గ్రామ స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు, అందుబాటులోకి తేవాల్సిన సేవలపై ఆ దేశ వ్యవసాయ ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేస్తుంది. ఆర్బీకే సాంకేతికత అనుసంధానంపై రూట్ మ్యాప్ తయారు చేస్తుంది. ఇందుకయ్యే వ్యయాన్ని వరల్డ్ బ్యాంక్ బృందం అంచనా వేసి, ఆర్థిక సాయం చేస్తుంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం ఇథియోపియాకు అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఇథియోపియా, ప్రపంచ బ్యాంకు మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు.
సెప్టెంబర్‌లో రాష్ట్రానికి ఇథియోపియా బృందం
ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించడానికి ఇథియోపియా వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధి బృందం సెప్టెంబర్‌లో రాష్ట్రానికి రానుంది. ఇథియోపియా అధికారులు, రైతుల బృందాలకు ఏపీ శాస్త్రవేత్తలు, అధికారులు శిక్షణనిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment