పేదల నోట్లో మట్టి !
అందని అమ్మహస్తం
పామోలిన్, గోధుమల నిలిపివేత
మార్కెట్‌లో నింగినంటిన ధరలు
వినియోగదారులపై నెలకు *12.54 కోట్ల భారం
చిత్తూరు: అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారులకు పామోలిన్, గోధుమలు,కందిపప్పు తదితర వస్తువులను నిలిపేసింది. పేద ప్రజలు బయట దుకాణాల్లో సరుకులు కొనాల్సివస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇది పేదలకు భారంగా మారింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న అరకొర సరుకుల్లో కూడా అధిక భాగం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం రాకముందు జిల్లాలో 10 లక్షల 37 వేల రేషన్ కార్డులు ఉండగా, ఆధార్ సీడింగ్ అంటూ కోతలు పెట్టి 9.65 లక్షల కార్డులను తేల్చారు. 72 వేల కార్డులను తొలగించారు. అర్హులైన పేదలు సైతం కార్డులు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్న కార్డులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యం, చక్కెర, పామోలిన్, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు, చింతపండు అంటూ 9 రకాల వస్తువుల పేర్లు చెప్పి తొలుత ఆర్భాటం చేసినా ఆ తరువాత కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పుడు
చంద్రబాబు ప్రభుత్వం ఆ వస్తువులను కూడా పంపిణీ చేయడంలేదు. బియ్యం,కిరోసిన్, ఒక్కో కార్డుకు అర కిలో చక్కెర మాత్రమే అందిస్తోంది. గోధుమలు,పామోలిన్, కందిపప్పు, చింతపండు పంపిణీ నిలిపేసింది. కందిపప్పు, పామోలిన్‌ను ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించేది, వీటి ధరలు మార్కెట్‌లో ఆకాశాన్నంటాయి. పేదలు కొనలేని పరిస్థితి. మార్కెట్‌లో కిలో చక్కెర *34 ఉండగా,కందిపప్పు * 80,గోధుమలు *36,పామోలిన్ కిలో పాకెట్ ధర * 54 ఉంది. ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంటే పేదలకు కొంతైనా ఉపశమనం ఉంటుంది. గతంలో ఇస్తున్న మేర అయినా సరుకులు పంపిణీచేస్తే వినియోగదారులపైన కోట్లాది రూపాయల భారం తగ్గేది. పౌరసరఫరాల శాఖ గణాంకాల మేరకు 9.65 లక్షల కార్డుదారులు నెలకు కిలో గోధుమలు బయట మార్కెట్‌లో కొనడంవల్ల జిల్లా వ్యాప్తంగా * 3,47,40,000 భారం పడుతుంది. ఇక పామోలిన్ పాకెట్‌పై *5,21,10,000 భారం పడుతుండగా, అర కిలో కందిపప్పు బయట మార్కెట్లో కొనడం వల్ల *3,86,00.000 భారం పడుతోంది. ఈ లెక్కన చూసినా నెలకు * 12 కోట్ల, 54 లక్షల, 50 వేలు వినియోగ దారులపై భారం పడుతోంది.
ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సరుకులు సక్రమంగా వినియోగదారులకు అందడంలేదు. రేషన్‌షాపుల డీలర్లు, అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కందిపప్పు,గోధుమలు,పామోలిన్‌తో పాటు మరిన్ని సరుకులు పంపిణీచేసి పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.