Distribution of essential commodities
-
ఆ హీరోలను చూస్తుంటే అబ్బో అనిపిస్తోంది
Happy Birthday Shivaji Raja: ‘‘కరోనా సమయంలో నా శక్తికి మించి చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడా దక్కలేదు. ‘శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి, పేద కళాకారులకు సేవ చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు శివాజీ రాజా అన్నారు. నేడు (శనివారం) ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు శివాజీ రాజు.. కానీ ఒకరోజు ఏచూరిగారు ‘శివాజీ రాజా’ పేరు బాగుంటుందని చెప్పడంతో అప్పటి నుంచి మీడియాలో నా పేరు మారిపోయింది. 1985 ఫిబ్రవరి 24న చెన్నైలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎం.వి. రఘు దర్శకత్వం వహించిన ‘కళ్ళు’ నా తొలి సినిమా. ఆ మూవీ ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన 37 ఏళ్లలో దాదాపు 500 సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది. పునీత్ రాజ్‌కుమార్‌గారు చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి.. అంతకంటే మంచితనం ఇంకేముంది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాను (అధ్యక్షుడిగా కూడా). నేను హీరోగా చేసిన ఏ సినిమా నాకు సక్సెస్ ఇవ్వలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన చిత్రాలకు, సీరియల్స్‌కు నంది అవార్డులు వచ్చాయి. నా ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులను ప్రోత్సహిస్తా. నేను మొదటి నుంచి చిరంజీవిగారి అభిమానినే. ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ప్రభాస్‌లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. నాకు వ్యవసాయం చేయడం ఇష్టం. మణికొండలో ఉన్న స్థలంలో, మొయినాబాద్‌లోని పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లో మా అబ్బాయి (విజయ్ రాజా)తో ‘కళ్ళు’ సినిమా రీమేక్ చేయాలని ఉంది. ప్రస్తుతం తను ఓ హిందీ, మూడు నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు బాగుంది. కొన్ని సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
నగదు బదిలీలో మోసం!
పెదకళ్లేపల్లి(మోపిదేవి): నిత్యావసర సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీల వల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని గుమ్మడి నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పెదకళ్లేపల్లి షాపు నెంబర్ 22లో ఈ నెలలో తీసుకున్న రేషన్ సరుకులకు ఈ–పోస్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపినట్లు తెలి పారు. డీలర్ ఎకౌంట్లో నగదు పడలేదని చెప్పి సరుకులు ఇవ్వలేదని చెప్పారు. స్థానిక ఇండియన్ బ్యాంకుకు వెళ్లి పరి శీలించగా తన ఎకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు వస్తుందని వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన చవాకుల వనజాక్షమ్మ 35 కిలోల బియ్యం, అర కిలో పంచదార తీసుకోగా రూపే కార్డు నుంచి రూ. 150 డీలర్ ఎకౌంట్‌కు జమ అయినట్లు తెలిపింది. రూపే కార్డుల బడ్వాడాపై అధికారులకే అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్ట పోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయండి
కడప రూరల్ : జిల్లాలో మే 1 నుంచి పిం ఛన్ల పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడి యో కాన్ఫరెన్స్ హాలులో పింఛన్ల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలో హ్యాబిటేషన్ ప్రకారం పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలన్నారు. మే 2 నుంచి 11వ తేది వరకు నీరు-చెట్టు కార్యక్రమం జరుగుతున్నందున రోజువారి కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇరిగేషన్ అదికారులు, ఎం పీడీఓలు నిర్వహించాలని ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమం జరిగే ముందు గ్రామంలో ప్రజలకు తెలిసేలా బహిరంగ పర్చాలన్నారు. ఉపాధి హామి పథ కం కింద కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలన్నారు. గ్రామంలో ఎన్ని చెరువులున్నాయి? వాటినన్నింటికీ మరమ్మతులు చేయించాలన్నారు. ఓటరుకార్డుకు ఆధార్ ఎంట్రీ మే 10లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వాల్టా చట్టాన్ని అతిక్రమించి బోరువేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో మే నెలలో 496 ఈ-పాస్ యంత్రాల ద్వారా డీలర్లు వంద శాతం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాల సుబ్రమణ్యం, వెంకట సుబ్బయ్య, ఇరిగేషన్ ఎస్ఈ శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వరయ్య, డీఆర్వో సులోచన, కమిషనర్ఓబులేశు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, సీపీఓ తిప్పేస్వామి, డీపీఓ అపూర్వసుందరి తదితరులు పాల్గొన్నారు. -
పంపిణీ.. మొక్కుబడి
►ఈసారి బియ్యం, చక్కెర, గోధుమపిండితో సరి ►మిగతా ఆరింటికి ఎసరు ►పౌర సరఫరాల్లో ప్రతిసారీ ఇదే తంతు ►అధికారంలోకి వచ్చి 9 నెలలైనా మారని తీరు పేద ప్రజలకు నిత్యావసరాలను చౌకగా అందించేందుకు ఉద్దేశించిన పథకం రానురాను నీరుగారుతోంది. గత ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా 9 రకాల నిత్యావసరాలను నెలనెలా అందిస్తుండగా ప్రస్తుతం మొక్కుబడి తంతు అరుుంది. ఈనెల ముచ్చటగా మూడంటే మూడు సరుకులతో సరిపెట్టారు. పథకాన్ని పేరు మార్చి మరింత మెరుగ్గా నిత్యావసరాల పంపిణీ చేపడతామని చెప్పుకున్న కొత్త ప్రభుత్వం 9 నెలలు అరుునా ఆ దిశగా అడుగులు వెయ్యడంలేదు. పైగా ఉన్న సరుకులనే తగ్గించి పథకాన్ని నామమాత్రంగా మార్చింది. సాక్షి, కడప : బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ హామీలతో ఊదరగొట్టిన తెలుగుదేశం నేతలు ప్రస్తుతం మౌనం దాల్చారు.అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలికిన నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకురాకపోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు. జనవరి నెల లో సంక్రాంతి పేరుతో చంద్రన్న కానుక అంటూ అందరికీ అందించలేక అభాసుపాలైన టీడీపీ సర్కార్ నిత్యావసరాల పంపిణీ వ్యవస్థకే ఎసరు పెడుతోందా అన్న సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి వచ్చింది. సీఎం నుంచి మంత్రుల వరకు మార్పులు తీసుకు వస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో ఒరిగింది శూన్యం. తొమ్మిది నెలలుగా ఇదేతంతు 2014వ సంవత్సరంలో రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కలుపుకొని ఏడాదిగా సామాన్యుడికి సరుకులు సక్రమంగా అందడం లేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా సరుకులు మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. చివరకు పండుగలప్పుడు కూడా సరుకు పంపిణీకి నోచుకోలేదు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువుల్లో ప్రస్తుతం కోత పెట్టారు. తాజాగా బియ్యం, చక్కెర, గోధుమలు మాత్రమే గోడౌన్లకు పంపించారు.అందులోనూ గోధుమలు పలుచోట్ల అందలేదన్న విమర్శలున్నాయి. గతం నుంచి ఇస్తున్న పామోలిన్, కందిబేడలు, ఉప్పు, చింతపండు, కారం పొడి తదితర వస్తువులకు మంగళం పాడినట్లే కనిపిస్తోంది. -
పేదల నోట్లో మట్టి !
అందని అమ్మహస్తం పామోలిన్, గోధుమల నిలిపివేత మార్కెట్లో నింగినంటిన ధరలు వినియోగదారులపై నెలకు *12.54 కోట్ల భారం చిత్తూరు: అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారులకు పామోలిన్, గోధుమలు,కందిపప్పు తదితర వస్తువులను నిలిపేసింది. పేద ప్రజలు బయట దుకాణాల్లో సరుకులు కొనాల్సివస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇది పేదలకు భారంగా మారింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న అరకొర సరుకుల్లో కూడా అధిక భాగం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు జిల్లాలో 10 లక్షల 37 వేల రేషన్ కార్డులు ఉండగా, ఆధార్ సీడింగ్ అంటూ కోతలు పెట్టి 9.65 లక్షల కార్డులను తేల్చారు. 72 వేల కార్డులను తొలగించారు. అర్హులైన పేదలు సైతం కార్డులు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్న కార్డులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యం, చక్కెర, పామోలిన్, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు, చింతపండు అంటూ 9 రకాల వస్తువుల పేర్లు చెప్పి తొలుత ఆర్భాటం చేసినా ఆ తరువాత కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వస్తువులను కూడా పంపిణీ చేయడంలేదు. బియ్యం,కిరోసిన్, ఒక్కో కార్డుకు అర కిలో చక్కెర మాత్రమే అందిస్తోంది. గోధుమలు,పామోలిన్, కందిపప్పు, చింతపండు పంపిణీ నిలిపేసింది. కందిపప్పు, పామోలిన్‌ను ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించేది, వీటి ధరలు మార్కెట్లో ఆకాశాన్నంటాయి. పేదలు కొనలేని పరిస్థితి. మార్కెట్లో కిలో చక్కెర *34 ఉండగా,కందిపప్పు * 80,గోధుమలు *36,పామోలిన్ కిలో పాకెట్ ధర * 54 ఉంది. ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంటే పేదలకు కొంతైనా ఉపశమనం ఉంటుంది. గతంలో ఇస్తున్న మేర అయినా సరుకులు పంపిణీచేస్తే వినియోగదారులపైన కోట్లాది రూపాయల భారం తగ్గేది. పౌరసరఫరాల శాఖ గణాంకాల మేరకు 9.65 లక్షల కార్డుదారులు నెలకు కిలో గోధుమలు బయట మార్కెట్లో కొనడంవల్ల జిల్లా వ్యాప్తంగా * 3,47,40,000 భారం పడుతుంది. ఇక పామోలిన్ పాకెట్‌పై *5,21,10,000 భారం పడుతుండగా, అర కిలో కందిపప్పు బయట మార్కెట్లో కొనడం వల్ల *3,86,00.000 భారం పడుతోంది. ఈ లెక్కన చూసినా నెలకు * 12 కోట్ల, 54 లక్షల, 50 వేలు వినియోగ దారులపై భారం పడుతోంది. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సరుకులు సక్రమంగా వినియోగదారులకు అందడంలేదు. రేషన్‌షాపుల డీలర్లు, అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కందిపప్పు,గోధుమలు,పామోలిన్‌తో పాటు మరిన్ని సరుకులు పంపిణీచేసి పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. -
సాయం కొందరికే..
పంపిణీలో ‘పచ్చ’ముద్ర కొరవడిన నిఘా.. లోపించిన పర్యవేక్షణ రేషను జోలికిపోని మధ్యతరగతి విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునే లక్ష్యంతో పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోని రీతిలో అంది వచ్చి న అవకాశాన్ని కొందరు సొమ్ముచేసు కుంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొరవడిన నిఘా..పర్యవేక్షణాలోపాలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. నగరంలో 4 లక్షల 80 వేల కుటుం టబాలున్నాయి. 3లక్షల93వేల తెల్లకార్డులుంటే, లక్షా76వేల గులాబీ కార్డులున్నాయి. మరో లక్ష కుటుంబాలకు ఎలాంటికార్డుల్లేవని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే ఆరులక్షల కుటుంబాలున్నట్టు అంచనా. వీరిలో ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఐదు లక్షల మంది వరకు ఉంటే..మధ్య తరగతి ప్రజలు కనీసం ఏడులక్షల మంది వరకు ఉంటారని అంచనా. మిగిలిన 13 లక్షల మంది అల్పాదాయవర్గాలకు చెందిన వారే. మామూలురోజుల్లో క్రమం తప్ప కుండా రేషన్ తీసుకునేది అల్పాదాయవర్గాల వారే. విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేది కూడా వీరే. విద్య, వైద్యం కోసం తెల్లకార్డులు తీసుకున్న మధ్యతరగతి ప్రజల్లో కూడా రేషన్ షాపులకెళ్లేది 10 శాతం లోపే ఉంటారు. ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల వారైతే ఏనాడు రేషన్ షాపుల తలుపుతట్టేదే ఉండదు. హుదూద్ బాధితులకు కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతీ కుటుంబానికి ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సిఫార్సు లేఖలతో సరకుల పక్కదారి : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో టన్నుల కొద్దీ సరకులు పక్కదారి పట్టిస్తున్న తెలుగు తమ్ముళ్లు కొంత మంది డీలర్ల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరొకపక్క బియ్యం కుటుంబానికి 25కేజీలు పంపిణీ చేయాల్సి ఉండగా..కొన్నిచోట్ల కేజీ నుంచి ఐదు కేజీల వరకు తక్కువగా పంపిణీ జరిగింది. ఇలా టన్నుకు 100 నుంచి 200 కేజీల వరకు పక్కదారి పట్టిస్తున్నట్టు చెబుతున్నారు. గుం టూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదులక్షల గుడ్లు, 17 టన్నుల ఉల్లిపాయలు నగరానికి తరలించారు. ఈ లారీలన్నీ వచ్చిన రెండు గంటల్లోనే ఎలా మాయమై పోయాయో అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. నెక్ మరో 3లక్షల గుడ్లు బాధితుల కోసం తరలించింది. ఇవి కూడా ఏమైయైపోయాయో తెలియదు. ఇప్పటి వరకు ఇలా పక్కదారి పట్టిన సరుకుల విలువ రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాయానికి దూరంగా లక్ష కుటుంబాలు ఈ సాయం అందుకునేందుకు క్యూ కడుతున్న వారు ఎక్కువగా అల్పాదాయ వర్గీయులే. మధ్యతరగతిలో చాలామటుకు రేషన్‌షాపుల జోలికి వెళ్లని పరిస్థితి కనిపించింది. ఏడులక్షలకుపైగా ఉన్న మధ్య తరగతి వాసుల్లో సరుకులు తీసుకున్నదీ నాలుగులక్షల్లోపే ఉంటారు. అపార్టుమెంట్లలో నివసించే వారిలో 50 శాతం మందికికూడా సరుకులు తీసుకోలేదు. అంటే 8లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిత్యావసరాలు తీసుకునేందుకు దూరంగా ఉన్నట్టే. ఇలా సాయం అందుకోని కుటుంబాలు రెండు లక్షల వరకు ఉంటాయి. పోనీ అంతకాకున్నా కనీసం లక్ష కుటుంబాలైనా ఈసాయం అందుకోని వారి జాబితాలో ఉంటాయనడంలో సందేహమేలేదు. మంగళవారం వరకు ఐదులక్షల కుటుంబాలకు పైగా సాయం అందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన నిత్యావసరాలు పూర్తిగా పక్కదారి పట్టినట్టే అంచనా వేయొచ్చు. ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే తీసుకున్న వారే చాలా మంది మరలా మరలా తీసుకున్నారని చెబుతున్నారు. -
అమ్మహస్తం అభాసుపాలు
కర్నూలు, న్యూస్‌లైన్: నాణ్యత లేని సరుకులతో అమ్మహస్తం అభాసుపాలవుతోంది. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.185లకే సరుకులను అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూపకల్పన చేశారు. పేద, అల్పాదాయ వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన ఈ పథకం అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రారంభంలో పంచదార, పామాయిల్, కందిపప్పు, చింతపండు, గోధుమలు, కారం, పసుపు, ఉప్పు, గోధుమ పిండిని పంపిణీ చేసినా.. ప్రస్తుతం బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలతో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి, చింతపండు నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా డీలర్లు కూడా డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తుండటంతో ఐదు మాసాల నుంచి అధికారులు కూడా ఆయా సరుకులు తెప్పించడం లేదు. ప్రస్తుతం రాయితీ ధరపై నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 17 స్టాక్‌పాయింట్లు ఉండగా.. వీటి ద్వారా చౌక డిపోలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకం ప్రారంభ రోజుల్లో కొనుగోలు చేసిన సరుకులు కొన్ని గోడౌన్లలో నిలిచిపోవడంతో వాటిని ఇటీవల గ్రామీణ ప్రాంత డీలర్లకుబలవంతంగా కట్టబెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పసుపు, కారం, చింతపండు కొనుగోలు చేయడానికి మొదటి నుంచీ డీలర్లు ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం. ఆకాశాన్నంటుతున్న ధరలు ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో పంచదార కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో రూ.35లు చెల్లించాల్సిందే. చౌకడిపోల ద్వారా ప్రభుత్వం అరకిలో చక్కెర కార్డుదారులకు సబ్సిడీపై రూ.7లకే సరఫరా చేస్తోంది. అలాగే చింతపండు అరకిలో రూ.30లకు సరఫరా చేశారు. ఐదు మాసాల నుంచి చింతపండు తెప్పించకపోవడంతో కార్డుదారులు కూడా బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.90ల ధరతో కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా పామాయిల్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వ నిర్ణయం ఏమిటో... తాజాగా అధికారం చేతులు మారింది. నూతన ఆంధ్రప్రదశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు ఉంటాయనే విషయంలో అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమ్మహస్తం స్థానంలో కొత్త పథకం ప్రవేశపెడతారా? లేక పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పేదలకు కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో ఈ పథకం అమలుపైనా సందిగ్ధం నెలకొంది. ప్రక్షాళన అవసరం జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నా.. వందల క్వింటాళ్ల బియ్యం దారి మళ్లుతోంది. నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కోవెలకుంట్ల ప్రాంతాల్లోని బియ్యం వ్యాపారులపై పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా జిల్లా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థపై దృష్టి సారించి చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.