పంపిణీ.. మొక్కుబడి
►ఈసారి బియ్యం, చక్కెర, గోధుమపిండితో సరి
►మిగతా ఆరింటికి ఎసరు
►పౌర సరఫరాల్లో ప్రతిసారీ ఇదే తంతు
►అధికారంలోకి వచ్చి 9 నెలలైనా మారని తీరు
పేద ప్రజలకు నిత్యావసరాలను చౌకగా అందించేందుకు ఉద్దేశించిన పథకం రానురాను నీరుగారుతోంది. గత ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా 9 రకాల నిత్యావసరాలను నెలనెలా అందిస్తుండగా ప్రస్తుతం మొక్కుబడి తంతు అరుుంది. ఈనెల ముచ్చటగా మూడంటే మూడు సరుకులతో సరిపెట్టారు. పథకాన్ని పేరు మార్చి మరింత మెరుగ్గా నిత్యావసరాల పంపిణీ చేపడతామని చెప్పుకున్న కొత్త ప్రభుత్వం 9 నెలలు అరుునా ఆ దిశగా అడుగులు వెయ్యడంలేదు. పైగా ఉన్న సరుకులనే తగ్గించి పథకాన్ని నామమాత్రంగా మార్చింది.
సాక్షి, కడప : బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ హామీలతో ఊదరగొట్టిన తెలుగుదేశం నేతలు ప్రస్తుతం మౌనం దాల్చారు.అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలికిన నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకురాకపోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు. జనవరి నెల లో సంక్రాంతి పేరుతో చంద్రన్న కానుక అంటూ అందరికీ అందించలేక అభాసుపాలైన టీడీపీ సర్కార్ నిత్యావసరాల పంపిణీ వ్యవస్థకే ఎసరు పెడుతోందా అన్న సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి వచ్చింది. సీఎం నుంచి మంత్రుల వరకు మార్పులు తీసుకు వస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో ఒరిగింది శూన్యం.
తొమ్మిది నెలలుగా ఇదేతంతు
2014వ సంవత్సరంలో రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కలుపుకొని ఏడాదిగా సామాన్యుడికి సరుకులు సక్రమంగా అందడం లేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా సరుకులు మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. చివరకు పండుగలప్పుడు కూడా సరుకు పంపిణీకి నోచుకోలేదు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువుల్లో ప్రస్తుతం కోత పెట్టారు. తాజాగా బియ్యం, చక్కెర, గోధుమలు మాత్రమే గోడౌన్లకు పంపించారు.అందులోనూ గోధుమలు పలుచోట్ల అందలేదన్న విమర్శలున్నాయి. గతం నుంచి ఇస్తున్న పామోలిన్, కందిబేడలు, ఉప్పు, చింతపండు, కారం పొడి తదితర వస్తువులకు మంగళం పాడినట్లే కనిపిస్తోంది.