అమ్మహస్తం అభాసుపాలు
కర్నూలు, న్యూస్‌లైన్: నాణ్యత లేని సరుకులతో అమ్మహస్తం అభాసుపాలవుతోంది. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.185లకే సరుకులను అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూపకల్పన చేశారు. పేద, అల్పాదాయ వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన ఈ పథకం అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రారంభంలో పంచదార, పామాయిల్, కందిపప్పు, చింతపండు, గోధుమలు, కారం, పసుపు, ఉప్పు, గోధుమ పిండిని పంపిణీ చేసినా.. ప్రస్తుతం బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలతో సరిపెడుతున్నారు.
పసుపు, కారంపొడి, చింతపండు నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా డీలర్లు కూడా డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తుండటంతో ఐదు మాసాల నుంచి అధికారులు కూడా ఆయా సరుకులు తెప్పించడం లేదు. ప్రస్తుతం రాయితీ ధరపై నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 17 స్టాక్‌పాయింట్లు ఉండగా.. వీటి ద్వారా చౌక డిపోలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకం ప్రారంభ రోజుల్లో కొనుగోలు చేసిన సరుకులు కొన్ని గోడౌన్లలో నిలిచిపోవడంతో వాటిని ఇటీవల గ్రామీణ ప్రాంత డీలర్లకుబలవంతంగా కట్టబెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పసుపు, కారం, చింతపండు కొనుగోలు చేయడానికి మొదటి నుంచీ డీలర్లు ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం.
ఆకాశాన్నంటుతున్న ధరలు
ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో పంచదార కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్‌లో రూ.35లు చెల్లించాల్సిందే. చౌకడిపోల ద్వారా ప్రభుత్వం అరకిలో చక్కెర కార్డుదారులకు సబ్సిడీపై రూ.7లకే సరఫరా చేస్తోంది. అలాగే చింతపండు అరకిలో రూ.30లకు సరఫరా చేశారు. ఐదు మాసాల నుంచి చింతపండు తెప్పించకపోవడంతో కార్డుదారులు కూడా బహిరంగ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.90ల ధరతో కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా పామాయిల్ సరఫరా కూడా నిలిచిపోయింది.
కొత్త ప్రభుత్వ నిర్ణయం ఏమిటో...
తాజాగా అధికారం చేతులు మారింది. నూతన ఆంధ్రప్రదశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు ఉంటాయనే విషయంలో అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమ్మహస్తం స్థానంలో కొత్త పథకం ప్రవేశపెడతారా? లేక పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పేదలకు కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో ఈ పథకం అమలుపైనా సందిగ్ధం నెలకొంది.
ప్రక్షాళన అవసరం
జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నా.. వందల క్వింటాళ్ల బియ్యం దారి మళ్లుతోంది. నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కోవెలకుంట్ల ప్రాంతాల్లోని బియ్యం వ్యాపారులపై పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా జిల్లా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థపై దృష్టి సారించి చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.