మాజీ సీఎం కిరణ్ సోదరుడు టీడీపీలోకి!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ బలహీనంగా ఉండటంతో కిషోర్‌కుమార్‌రెడ్డిని చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఆయనను పార్టీలో చేర్పించుకునే విషయాన్ని ఇటీవల జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో మదనపల్లె నుంచి శాసనసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కిషోర్‌కుమార్‌రెడ్డిని చేర్చుకుని ఆ స్థానం నుంచి మండలికి పోటీ చేయించాలని చంద్రాబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కిషోర్ తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన సోదరులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ ఆ పని చేయలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్‌పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ సందర్భంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గట్టెక్కడానికి వీలుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభలో ఓటింగ్ రోజున ఓటింగ్‌లో పాల్గొనకుండా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ తటస్థంగా ఉండాలంటూ విప్ జారీ చేశారు. ఆ కారణంగా వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం వీగిపోయి కిరణ్ సర్కారు నిలబడిన సంగతి తెలిసిందే. ఇలావుండగా, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి టీడీపీలో చేరుతున్న విషయం ప్రస్తావించగా, ఆయన దాన్ని ఖండించలేదు. అయితే తాను వేరే పనిలో ఉన్నానని, తర్వాత మాట్లాడుతానని మాత్రమే చెప్పారు.