తెనాలి అర్బన్ : గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంతో లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఆ పథకానికి పేరు మార్చినప్పటికీ ప్రయోజనాలు అందించడం లేదు. పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే గర్భంలోనే చిదిమేసే దారుణానికి తిలోదకాలిచ్చేందుకు 2013 మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారుతల్లి పథకం ప్రారంభించారు. ఈ పథకం ఆవిర్భావంతో అప్పటివరకు కొనసాగిన బాలికా శిశు బీమా పథకం మూలన పడింది.
కొత్తగా వచ్చిన బంగారుతల్లి పథకానికీ దరఖాస్తులు చేసుకోవడం మినహా, పురోగతి లేకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి చందంగా ఉంది. గతంలో ప్రవేశపెట్టిన ఁబాలికా శిశు బీమా* పథకంలో ఒక ఆడపిల్ల అయితే లక్ష రూపాయలు బాలికకు 20 ఏళ్లు నిండగానే అందేలా భారతీయ జీవిత బీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే ఇద్దరు ఆడపిల్లలైతే ఒకొక్కరికి రూ.30 వేల చొప్పున బీమా చేయించేది. వారు విధిగా చదువుకోవాలి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ రూ.1200 చొప్పున ఏటా ఉపకార వేతనాన్ని అందించేది. బంగారుతల్లి రాకతో ‘బాలికా శిశు బీమా’ నమోదును నిలిపివేశారు.
బంగారుతల్లి పథకం ప్రయోజనాలు
బాలిక పుట్టిన వెంటనే పుట్టినతేదీ ధ్రువీకరణ, ఆ కుటుంబ తెల్ల రేషన్‌కార్డు, తల్లి బ్యాంకు ఖాతాతో ఈ పథకంలో నమోదు చేయించుకోవాలి. నమోదైన వెంటనే తల్లి ఖాతాలో రూ.2500 జమవుతాయి. తదుపరి మూడేళ్లు వ్యాక్సినేషన్ తదితర ఖర్చుల కోసం రూ.1000 వంతున మూడేళ్లు, చిన్నారి అంగన్‌వాడీలో చేరిన వెంటనే రూ.1500 అమ్మ ఖాతాలో చేరాలి. ఎనిమిదో తరగతి నుంచి ఏడాదికి రూ.మూడు వేల వంతున ఇంటర్ పూర్తయ్యే వరకూ ఆర్థిక సాయం అందుతుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.1.50 లక్షలు అందేలా పథకాన్ని రూపొందిం చారు. దీనికి చట్టబద్ధత కూడా కల్పించారు. పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా 2013 నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండలో కొద్దిమందికి బాండ్లు పంపిణీ చేశారు. అది మినహా పురోగతి లేదు. కొత్త ప్రభుత్వం దీనికి ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడం మినహా చేసిందేమీ లేదు.
4800 పేర్ల నమోదు
బంగారుతల్లి పథకంలో ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా 4800పై చిలుకు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయి. పట్టణ పరిధికి మాత్రమే వర్తించే ఈ పథకంలో అత్యధికంగా గుంటూరు కార్పొరేషన్‌లో 1184 దరఖాస్తులు దాఖలయ్యాయి. తెనాలిలో 462, బాపట్లలో 234, చిలకలూరిపేటలో 450, మాచర్లలో 323, మంగళగిరిలో 330, నరసరావుపేటలో 418, పిడుగురాళ్ళలో 215, పొన్నూరులో 232, రేపల్లెలో 194, సత్తెనపల్లిలో 279, తాడేపల్లిలో 260, వినుకొండలో 231 దరఖాస్తులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో నమోదైన వెంటనే బాలిక తల్లి ఖాతాలో రూ.2500 జమ కావాల్సి ఉంది. అయితే నగదు జమ కాకపోవడంతో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
ప్రభుత్వం పేరు మార్చింది
బంగారు తల్లి పథకం బాలికలకు వరమే. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో ఈ పథకం ప్రారంభంలో 40 మందికి బాండ్లు పంపిణీ చేశారు. వారి ఖాతాల్లో రూ.2500 చొప్పున డబ్బు జమైంది. వీటికి దరఖాస్తు చేసుకున్న వారిలో తెనాలి మున్సిపాలిటీ జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికి 462 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయి. వీటికి ఎలాంటి చెల్లింపులూ లేవు.
- ఎం.నాగేంద్ర,
టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్, తెనాలి
త్రిశంకుస్వర్గంలో ‘బంగారు తల్లి’
Published Sat, Feb 21 2015 3:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement