గూడు వైపు అడుగు పడేనా ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఒక కొత్త పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్‌టీఆర్ గృహ పథకం పేరుతో ప్రతి జిల్లాలో భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఏడాది కిందట ప్రటించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో వివిధ పథకాల కింద 11,118 ఇళ్ల నిర్మాణానికి, 10,000 పక్కా గృహాల మరమతులకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ పథకంలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి.
ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులు వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ వహించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు ఇళ్ల కోసం వేలాది దరఖాస్తులు అందాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ దరఖాస్తులు అటకెక్కాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న వేలాది ఇళ్లను అనర్హుల సాకుతో రద్దు చేశారు. గృహ నిర్మాణాలపై విచారణ జరిపించే పేరుతో రెండేళ్లుగా ఒక్క కొత్త ఇంటిని మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో గృహ నిర్మాణ శాఖకార్యకలాపాలు అటకెక్కాయి.
నిధులేవీ..?
ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో రూ.30,450 లక్షలతో 10,500 ఇళ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదం తెలిపింది. అధికారులు 9052 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణానికి అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన 10,000 పక్కా ఇళ్ల మరమ్మతులకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికారులు ఈ పథకం కింద 5366 మంది లబ్ధిదారులను గుర్తించారు. అందరికీ పక్కా ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్ ) పథకం కింద 20681 ఇళ్ల నిర్మాణానికి రూ. 1,13,745 లక్షలు కేటాయించడానికి రాష్ర్ట ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ఆర్నెల్లు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. దరఖాస్తుదారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు, నిధులు విడుదలయ్యే వరకు తామేమీ చేయలేమని వారు లబ్ధిదారులకు సమాధానం ఇచ్చి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలోనైనా ఇళ్ల నిర్మాణానికి, అవసరమైన నిధుల విడుదలకు ఉత్తర్వులు వెలువరించేలా నిర్ణయం తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.