ammahastam
-
పేరు మార్చి.. సరుకుల్లో కోతేసి!
కర్నూలు: టీడీపీ ప్రభుత్వం పొదుపు మంత్రం పఠిస్తోంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలోని పథకాల్లో తమ ముద్ర కనిపించేలా పేర్లు మార్పు చేస్తున్నా.. అమలులో విఫలమవుతోంది. చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల్లో కోత విధిస్తూ పేదల కడుపు మాడుస్తోంది. ‘అమ్మహస్తం’ కింద గత ప్రభుత్వం బియ్యం సహా తొమ్మిది సరుకులు అందిస్తుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రజాపంపిణీగా పేరు మార్పు చేసి రెండు సరుకులతో సరిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. బియ్యం, అర కిలో చక్కెర మాత్రమే అందించి మిగిలిన వస్తువులకు మంగళం పాడటం గమనార్హం. రూ.185లకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల్లో భాగంగా అర కిలో చక్కెర, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, ఉప్పు ప్యాకెట్, 100 గ్రాముల కారం, అర కిలో చింతపండు, 100 గ్రాముల పసుపు పంపిణీ చేయాల్సి ఉంది. దశల వారీగా ఈ సరుకుల్లో కోత విధిస్తూ ఆగస్టు నెలకు బియ్యం, చక్కెరతో సరిపెట్టేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటని కార్డుదారులు డీలర్లను నిలదీస్తే బిక్క ముఖం వేస్తున్నారు. కొన్నింటికి డీడీలు కట్టినా అందుకు తగిన సరుకులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం స్పందించకపోతే తామేమి చేయాలనే సమాధానం వస్తోంది. గత నెలలో బ్యాక్లాగ్ కింద మిగిలిన కందిపప్పును కర్నూలులోని 40 చౌక డిపోలకు మాత్రమే కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 17 గోదాములు ఉండగా.. అన్ని చోట్లా బియ్యం, చక్కెర మినహా ఇతర సరుకుల కొరత ఏర్పడింది. డీడీలు కట్టిన డీలర్లు గోదాముల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల కార్పొరేషన్ల మధ్య సమన్వయ లోపంతో ఏ మేరకు సరుకులు సరఫరా చేయాలనే విషయమై జిల్లాలో గందరగోళం నెలకొంది. పౌర సరఫరాల శాఖ కేటాయించిన కోటా ప్రకారం సరుకులను అందజేయడంలో అయోమయ పరిస్థితి తలెత్తుతోంది. టమాటాలు, చింతపండు, ఎర్రగడ్డలు తదితర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చౌకడిపోల ద్వారా అందించే సరుకుల్లో కోత పెడుతుండటం పట్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ సరఫరా ఐదు మాసాలుగా నిలిచిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ, పౌర సరఫర సంస్థ అధికారులు సోమవారం అన్ని జిల్లాల అధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ వచ్చే నెల కోటాలో తొమ్మిది రకాల సరుకులపై స్పష్టత కొరవడింది. గందరగోళంగా ఆధార్ అనుసంధానం రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా డీలర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 11,54,068 రేషన్ కార్డులు ఉండగా, 43,94,846 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 25,94,069 కార్డులకు మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు లోపల 40 శాతం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆధార్ దిగిన మూడు లక్షల మందికి పైగా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆధార్ అనుసంధానమైన రేషన్ కార్డులకు మాత్రమే సెప్టెంబర్ నెల కోటా సరుకులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో నెలాఖరులోగా ఆధార్ కార్డులు అందని పరిస్థితి ఏమిటనే విషయం ప్రశ్నార్థకమవుతోంది. -
అమ్మహస్తం అభాసుపాలు
కర్నూలు, న్యూస్‌లైన్: నాణ్యత లేని సరుకులతో అమ్మహస్తం అభాసుపాలవుతోంది. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.185లకే సరుకులను అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూపకల్పన చేశారు. పేద, అల్పాదాయ వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన ఈ పథకం అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రారంభంలో పంచదార, పామాయిల్, కందిపప్పు, చింతపండు, గోధుమలు, కారం, పసుపు, ఉప్పు, గోధుమ పిండిని పంపిణీ చేసినా.. ప్రస్తుతం బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలతో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి, చింతపండు నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా డీలర్లు కూడా డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తుండటంతో ఐదు మాసాల నుంచి అధికారులు కూడా ఆయా సరుకులు తెప్పించడం లేదు. ప్రస్తుతం రాయితీ ధరపై నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 17 స్టాక్‌పాయింట్లు ఉండగా.. వీటి ద్వారా చౌక డిపోలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకం ప్రారంభ రోజుల్లో కొనుగోలు చేసిన సరుకులు కొన్ని గోడౌన్లలో నిలిచిపోవడంతో వాటిని ఇటీవల గ్రామీణ ప్రాంత డీలర్లకుబలవంతంగా కట్టబెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పసుపు, కారం, చింతపండు కొనుగోలు చేయడానికి మొదటి నుంచీ డీలర్లు ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం. ఆకాశాన్నంటుతున్న ధరలు ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో పంచదార కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో రూ.35లు చెల్లించాల్సిందే. చౌకడిపోల ద్వారా ప్రభుత్వం అరకిలో చక్కెర కార్డుదారులకు సబ్సిడీపై రూ.7లకే సరఫరా చేస్తోంది. అలాగే చింతపండు అరకిలో రూ.30లకు సరఫరా చేశారు. ఐదు మాసాల నుంచి చింతపండు తెప్పించకపోవడంతో కార్డుదారులు కూడా బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.90ల ధరతో కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా పామాయిల్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వ నిర్ణయం ఏమిటో... తాజాగా అధికారం చేతులు మారింది. నూతన ఆంధ్రప్రదశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు ఉంటాయనే విషయంలో అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమ్మహస్తం స్థానంలో కొత్త పథకం ప్రవేశపెడతారా? లేక పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పేదలకు కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో ఈ పథకం అమలుపైనా సందిగ్ధం నెలకొంది. ప్రక్షాళన అవసరం జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నా.. వందల క్వింటాళ్ల బియ్యం దారి మళ్లుతోంది. నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కోవెలకుంట్ల ప్రాంతాల్లోని బియ్యం వ్యాపారులపై పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా జిల్లా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థపై దృష్టి సారించి చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వంటింటి సంక్షోభం
కర్నూలు, న్యూస్‌లైన్ : చౌకడిపోల ద్వారా పేదలకు అందించే పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో వంటింటి ఘుమఘుమలకు గడ్డుకాలం తలెత్తింది. గత ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి డబ్బు బకాయి పడటంతో పామాయిల్ పారిశ్రామికవేత్తలు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేయడమే ఇందుకు కారణమైంది. రెండు నెలల క్రితమే సరఫరా నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జూన్ నెలలోనూ పామాయిల్ సరఫరా లేదనే చేదు వార్త పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి చేరింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ద్వారా ఆర్డీఓలు, అక్కడి నుంచి తహశీల్దార్లకు సమాచారం అందింది. తెల్లకార్డుదారులకు రాయితీ ధరపై పంపిణీ చేస్తున్న పామోలిన్ ఆయిల్ జూన్ తర్వాతనైనా వచ్చే అవకాశాలపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మే నెలలోనూ సరఫరా చేపట్టలేదు. అంతకుముందు నెలకు సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద గోదాముల్లోని మిగులును మాత్రం కొన్ని గ్రామీణ ప్రాంతాల చౌకడిపోలకు చేరవేశారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనె ధర రూ.85 కాగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగించే పామోలిన్ ధర రూ.65 పలుకుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాల్లో రేషన్‌కార్డులకు లీటర్ పామోలిన్ వంటింటి సంక్షోభం రూ.40లకు లభ్యమవుతోంది. మలేషియా నుంచి నిలిచిన దిగుమతి పామోలిన్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. అక్కడి నుంచి కాకినాడ సీపోర్టుకు చేరుతుంది. అక్కడే ప్యాకింగ్ చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. దిగుమతి చేసుకునే సమయంలో సబ్సిడీ ధరను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మూడు నెలల నుంచి జమ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పామోలిన్ దిగుమతి నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస ఎన్నికలు జరిగాయి. దీంతో పామోలిన్ సబ్సిడీ ధర చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. ఈ కారణంగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. కార్డుదారులపై అదనపు భారం పేదలు అధికంగా వినియోగించే వంట నూనె పామోలిన్ సరఫరాపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 11.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుకు లీటరు చొప్పున(ప్యాకెట్) 2,374 చౌక డిపోల ద్వారా పేదలందరికీ ప్రతి నెలా 11.40 లక్షల లీటర్ల పామోలిన్ సరఫరా చేసేవారు. అది నిలిచిపోవడంతో బహిరంగ మార్కెట్లో వంట నూనెను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ లెక్కన ప్రతి నెలా కార్డు వినియోగదారులపై రూ.2.85 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్ నెలలో పామోలిన్ ఇవ్వాలనుకుంటే 8వ తేదీన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమ్మహస్తం.. అస్తవ్యస్తం అమ్మహస్తం కింద తొమ్మిది రకాల సరుకులతో కార్డుదారులకు పంపిణీ చేసే సరుకుల సంచి నెమ్మదిగా చిక్కిపోతుంది. తొమ్మిది సరుకుల స్థానంలో ప్రస్తుతం బియ్యం, పంచదారా, కందిపప్పు, గోధుమ పిండితో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో ఈ సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తాజాగా పామోలిన్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం రాయితీ ధరపై కేవలం నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందుతున్నాయి. కిరోసిన్ సరఫరాపైనా రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్ర విభజన ప్రభావం కిరోసిన్ సరఫరాపైనా చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ దిగుమతి ఈ నెల 24వ తేదీ నుంచి నిలిచిపోయింది. 24వ తేదీ వరకు మాత్రమే హోల్‌సేల్ డీలర్లకు కిరోసిన్ సరఫరా చేశారు. కర్నూలు కార్పొరేషన్‌లోని కార్డుదారులకు నెలకు 4 లీటర్లు.. మునిసిపాలిటీలు, మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులకు ప్రతి నెలా 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి నెలా 20.76 లక్షల లీటర్లు కిరోసిన్ అవసరం కాగా, ఇప్పటి వరకు 1.50 లక్షల లీటర్లు కూడా హోల్‌సేల్ డీలర్ల వద్దకు చేరకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం ప్రతి నెలా 22, 23 తేదీల్లో సబ్సిడీ సరుకులు.. 2, 3 తేదీల్లో కిరోసిన్ కేటాయింపులు చేపట్టేది. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం.. రాష్ట్ర విభజన తదితర ఘటనలతో రెండు రాష్ట్రాలకు సమాన కోటా కేటాయింపుల విషయంపై సందిగ్ధం నెలకొనడంతో జిల్లాకు కేటాయించిన కిరోసిన్ కోటా కూడా నిలిచిపోయింది. -
అపహాస్యం పాలైన అమ్మ‘హస్తం’
=నాసిరకం సరుకులు మాకోద్దంటున్న పేదలు =ఆరు నెలల ‘అమ్మహస్తం’ పంపిణీ తీరుపై సమీక్ష విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం అపహాస్యం పాలైంది. జిల్లాలో ఈ పథకం నిర్వీర్యమైపోయింది. ఆదినుంచే అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న ఈ పథకం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా... నేటికి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యామైన నిత్యావసర సరుకులు అందించాలన్న లక్ష్యం బెడిసికొట్టినట్లయింది. సరుకుల నాణ్యత లేమీ, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సరుకుల ధరలో పెద్దగా తేడా కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కోల్పోయింది. దీంతో పేదలు సరుకులు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సరఫరా తగ్గుముఖం పట్టిందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 11లక్షల 80వేల మంది కార్డుదారులకు 2,100 చౌకడిపోల ద్వారా వీటినిఅంటగట్టేందుకు అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. నాణ్యతపై అనుమానాలు ‘అమ్మహస్తం’ పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందిపప్పు ఉడకటం లేదంటున్నారు. ఒక్కోసారి నిల్వ ఉన్న పప్పును సరఫరా చేస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. చింతపండు నల్లని రంగు ఉండి గింజలు అధికంగా ఉండటంతో అది నాసిరకమని భావిస్తున్నారు. గోధుమలు, గోధుమ పిండిలో పురుగులుంటున్నాయని వాపోతున్నారు. ఘాటివ్వని కారం పోడి, రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు కంగుతింటున్నారు. కేవలం రూ.185 కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు ముక్కిపోయిన సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. తొమ్మిదింటిలో మూడే .. అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కందిపప్పు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు. ప్రచార అర్భాటమే.... ‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరుకులుపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం. నెలసరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే . వద్దు మొర్రో అంట్ను డీలర్లు .... రేషన్ డీలర్లు తొమ్మిది సరుకుల పంపిణీపై అసక్తి చూపడం లేదు. ఇవన్నీ వద్దు మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. ప్రజలు పంచదార, నూనె నెలవారీ కొంటున్నారని, గోధుమలు, కందిపప్పు కూడా అప్పుడప్పుడు కొంటున్నారని డీలర్లు చె బుతున్నారు. సరుకుల కోసం అదనపు పెట్టుబడి, కమీషన్ గిట్టుబాటుతో పాటు, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజవేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు. పైగా సరుకుల దిగుమతి ఖర్చు,రవాణ అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు ఉపాధికి గండిపడుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నాసిరకం సరుకులతో ‘అమ్మహస్తం’కు ఆదరణ కరువు
కిరణ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకం అట్టర్‌ఫ్లాప్ అయింది. సరుకుల నాణ్యత లేమితో పాటు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కరువైంది. మరోవైపు రేషన్ డీలర్లూ ఈ సరుకుల పంపిణీపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానికి తగ్గట్టే సరుకుల సరఫరా కూడా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఫలితంగా చౌకధరల దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం బెడిసికొట్టినట్లయింది. నాణ్యతపై అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినాన లాంఛనంగా ప్రారంభించిన ఈ పథకం ఆచరణలో పూర్తిగా అభాసుపాలైంది. ప్రజల ఛీత్కారాలు, ఆగ్రహావేశాలకు గురికావాల్సి వచ్చింది. వాస్తవంగా పథకం ప్రారంభం నుంచి సరుకులకు ప్రజల ఆదరణ లేకుండా పోయింది. ఈ పథకం కింద ఇస్తున్న తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల్లో నాణ్యత లోపిస్తోంది. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమ పిండి, ఘాటు లేని కారం పోడి రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు ఖంగుతింటున్నారు. కేవలం రూ.185 కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు ముక్కిపోయిన ఈ సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేయడంపై పలు దుకాణాల్లో మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అమ్మహస్తం తీరిదీ... సరుకులు కొనుగోలు (శాతం) గోధుమలు 91 శాతం చక్కెర 92 శాతం పామోలిన్ 91 శాతం కందిపప్పు 23 శాతం గోధుమ పిండి 29 శాతం కారంపొడి 13 శాతం పసుపు 14 శాతం ఉప్పు 9 శాతం చింతపండు 29 శాతం తొమ్మిదింటిలో మూడే .. అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబర్చుతున్నారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగితా ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు. దీంతో మిగతా సరుకుల కోటా కూడా తగ్గుముఖం పట్టింది. వాస్తవానికి పథకాన్ని ప్రారంభించే రోజు మాత్రం నాణ్యమైన ప్యాకెట్లను లబ్ధిదారులకు అందించి.. మరుసటి రోజు నుంచి సరుకుల సరఫరాలో అసలు రంగు బయటపెట్టారు. దీంతో తొమ్మిది సరుకులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. డీలర్ల నిరాస్తకత రేషన్ డీలర్లు కూడా తొమ్మిది సరుకుల పంపిణీపై ఆసక్తి చూపడం లేదు. సరుకుల కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడం, కమీషన్ గిట్టుబాటు కాకపోవడం, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల (కిట్) సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక కిట్ విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు. పైగా సరుకుల దిగుమతి ఖర్చు, రవాణా అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు ఉపాధికి గండిపడుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారార్భాటమే... ‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరకులుపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం. నెల సరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. సరుకుల్లో నాణ్యత లేదు కారంపొడి కందిపప్పులలో పూర్తిగా పురుగులు కనిపిస్తున్నాయి. మిగతా సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. పైగా రేషన్ డీలర్లు రోజుల తరబడి తిప్పుతున్నారు. అమ్మహస్తం వస్తువులతో పాటు అందజేసే బ్యాగ్‌ను సైతం ఇవ్వడం లేదు. - రవికాంత్, హనుమాన్‌నగర్. మార్కెట్ ధరల్లాగే ఉన్నాయి అమ్మహస్తం సరుకుల ధర బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే పెద్దగా తేడా లేదు. పైగా నాసిరకం సరుకులను పంపిణీ చేస్తున్నారు. పప్పు, కారం పొడి ఎందుకు పనికి రాకపోవడంతో పడేస్తున్నాం. - రంజిత్, గౌలిపురా -
ఖాళీ ‘హస్తం’
= చక్కెర లేని ప్యాకెట్లు = లీకవుతున్న ఆయిల్ = బియ్యం తూకంలో తేడా = బెంబేలెత్తుతున్న డీలర్లు స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకం సరుకులను చూసి రేషన్‌డీలర్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే తొమ్మిది సరుకులకు గాను అరకొరగా పంపిణీ చేస్తున్నారు.. వాటిలో కూడా అనేక లోపాలుండడంతో లబ్ధిదారుల చేతిలో డీలర్లు తిట్లు తినాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నా రు. గురువారం రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు కలకోల బాబు, ప్రధాన కార్యదర్శి గట్టు మొగిళి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగపురం మోహన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విలేకరులకు వివరించారు. పథకం ప్రారంభించిన నాటి నుంచి తమకు తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సరుకుల కోసం డబ్బులు చెల్లిస్తు న్నా నాలుగైదు మాత్రమే వస్తున్నాయని, దీంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకుం డా ఉందని అన్నారు. చక్కెర ప్యాకెట్లు కొన్ని పూర్తిగా ఖాళీగా ఉంటున్నాయని, నష్కల్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కాశం ఎలిషాకు ఈనెల పంపిణీ చేసిన చక్కెర ప్యాకెట్లలో పది ప్యాకెట్లు ఖాళీగా వచ్చాయని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసే బియ్యం సంచుల్లో 50 కిలోలకు బదులు కేవలం 47 కిలోలే ఉంటున్నాయని తెలిపారు. ఒక కార్టన్ లో 12 నూనె ప్యాకెట్లు ఉండాలి.. ఒకటి, రెండు తక్కువగా ఉంటున్నాయని, అంతేకాకుండా ప్రతి నెలా నాలుగైదు ప్యాకెట్లు లీకయి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఒక బ్యాగ్‌లో 50 పప్పు ప్యాకెట్లకు గాను 48 మాత్రమే ఉంటున్నాయన్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, సివిల్ సప్లై డీటీ పరశురాములు, ఆర్ఐ శ్రీనివాస్‌కు విన్నవించినట్లు తెలిపారు. ప్రస్తుతం పండుగ సీజన్‌కు కూడా సరుకులు పూర్తిగా రాలేదని, లబ్ధిదారులతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని సరుకులు, తూకాల్లో తేడా లేకుండా పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కోరారు. -
రేషన్ దుకాణాల్లో నో స్టాక్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రేషన్ సరుకుల పంపిణీపై సర్కారు చేతులెత్తేసింది. సద్దుల బతుకమ్మ... దసరా పండుగల ముందు నిరుపేద కుటుంబాల్లో సంబురం లేకుండా చేసింది. కీలకమైన సమయంలో నిత్యావసరాల పంపిణీని విస్మరించింది. ప్రధానంగా ఇంటింటా అవసరమయ్యే చక్కెర, పామాయిల్, కందిపప్పునకు కొరత ఏర్పడింది. అక్టోబర్‌లో జిల్లాకు రావాల్సిన రేషన్ కోటాలో దాదాపు 40 శాతం కోత పడింది. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఈ నెలలో పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ గత నెలాఖరు నాటికి జిల్లాకు చేరాలి... డీలర్లకు సైతం చేరవేయాలి. ఒకటి నుంచి 18వ తేదీలోగా రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేయాలి. కానీ.. ఈసారి అన్ని రేషన్ షాపులకు సరుకులు అరకొరగా సరఫరా అయ్యాయి. దీంతో తొమ్మిది సరుకులుండాల్సిన ‘అమ్మహస్తం’ సంచిలో చక్కెర, పామాయిల్, కందిపప్పు ప్యాకెట్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రేషన్ షాపుల్లో ఈ మూడు సరుకులు లేవనే సమాధానం వినిపిస్తోంది. దాదాపు 30 శాతం రేషన్ కార్డులున్న కుటుంబాలకు పండుగ చేదెక్కినట్లే. ఈ నెలలో రావాల్సినంత సరుకుల కోటా రాలేదని.. సీమాం ధ్రలో ఆందోళనలతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా మన జిల్లాకు గుంటూరు నుంచి కందిపప్పు, చిత్తూరు జిల్లా నుంచి చక్కెర, కాకినాడ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అక్కడ రవాణా నిలిచి పోవడంతో సరిపడేన్ని సరుకులు రాలేదని సివిల్ సప్లయిస్ విభాగం జిల్లా మేనేజర్ రాజేంద్రకుమార్ తెలిపారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ కోటా తగ్గిందని ఆయన అంగీకరించారు. సద్దులు... పిండివంటలు... ఇంటింటా పండుగ అవసరాల రీత్యా సాధారణంగా ఈ నెలలోనే రేషన్ సరుకులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో కోటాలో కోత పడడంతో డీలర్లు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సకాలంలో డీడీలు చెల్లించినప్పటికీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. -
నెలాఖరు వరకు రేషన్
సాక్షి,విశాఖపట్నం: చౌకదుకాణాల్లో బియ్యం,అమ్మహస్తం సరకులు నెలాఖరు వరకు రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఈమేరకు డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ప్రతినెలా 15వ తేదీతో చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ పూర్తయ్యేది. సమైక్య ఉద్యమం కారణంగా జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు రేషన్ సరకులు ఈ నెల ఆలస్యంగా చేరాయి. దీంతో పంపిణీలోనూ జాప్యం చోటుచేసుకుంది. ఉద్యమం ప్రభావంతో చాలామంది మధ్య,దిగువతరగతి ప్రజలకు ఉపాధిలేక ఆదాయం కూడా తగ్గింది. ఈనేపథ్యంలో సరకులు విడిపించుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా బియ్యం నిల్వలు చాలావరకు డీలర్లవద్ద ఉండి పోయాయి. అమ్మహస్తం సరకులు 55శాతమే అమ్ముడుపోయాయి. ఈనేపథ్యంలో ఈనెల30 వరకు కార్డుదారులు కోటా విడిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క ఉద్యమం తో గోదాముల నుంచి బియ్యం, పప్పులు రావడంలేదు. దీనివల్ల ప్రతినెలా సరకుల పంపిణీ ఆలస్యమవుతోంది. వచ్చే నెల నుంచి ఈ సమ స్య ఉత్పన్నం కాకుండా ముందుగానే రవాణా ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.