సాక్షి ప్రతినిధి, వరంగల్ : రేషన్ సరుకుల పంపిణీపై సర్కారు చేతులెత్తేసింది. సద్దుల బతుకమ్మ... దసరా పండుగల ముందు నిరుపేద కుటుంబాల్లో సంబురం లేకుండా చేసింది. కీలకమైన సమయంలో నిత్యావసరాల పంపిణీని విస్మరించింది. ప్రధానంగా ఇంటింటా అవసరమయ్యే చక్కెర, పామాయిల్, కందిపప్పునకు కొరత ఏర్పడింది. అక్టోబర్‌లో జిల్లాకు రావాల్సిన రేషన్ కోటాలో దాదాపు 40 శాతం కోత పడింది. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఈ నెలలో పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ గత నెలాఖరు నాటికి జిల్లాకు చేరాలి... డీలర్లకు సైతం చేరవేయాలి. ఒకటి నుంచి 18వ తేదీలోగా రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేయాలి. కానీ.. ఈసారి అన్ని రేషన్ షాపులకు సరుకులు అరకొరగా సరఫరా అయ్యాయి. దీంతో తొమ్మిది సరుకులుండాల్సిన ‘అమ్మహస్తం’ సంచిలో చక్కెర, పామాయిల్, కందిపప్పు ప్యాకెట్లు కనిపించడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రేషన్ షాపుల్లో ఈ మూడు సరుకులు లేవనే సమాధానం వినిపిస్తోంది. దాదాపు 30 శాతం రేషన్ కార్డులున్న కుటుంబాలకు పండుగ చేదెక్కినట్లే. ఈ నెలలో రావాల్సినంత సరుకుల కోటా రాలేదని.. సీమాం ధ్రలో ఆందోళనలతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా మన జిల్లాకు గుంటూరు నుంచి కందిపప్పు, చిత్తూరు జిల్లా నుంచి చక్కెర, కాకినాడ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అక్కడ రవాణా నిలిచి పోవడంతో సరిపడేన్ని సరుకులు రాలేదని సివిల్ సప్లయిస్ విభాగం జిల్లా మేనేజర్ రాజేంద్రకుమార్ తెలిపారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ కోటా తగ్గిందని ఆయన అంగీకరించారు. సద్దులు... పిండివంటలు... ఇంటింటా పండుగ అవసరాల రీత్యా సాధారణంగా ఈ నెలలోనే రేషన్ సరుకులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో కోటాలో కోత పడడంతో డీలర్లు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సకాలంలో డీడీలు చెల్లించినప్పటికీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
రేషన్ దుకాణాల్లో నో స్టాక్
Published Tue, Oct 8 2013 1:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement