నాసిరకం సరుకులతో ‘అమ్మహస్తం’కు ఆదరణ కరువు | Amma Hastam scheme fails due to supply of crumbling food items | Sakshi
Sakshi News home page

నాసిరకం సరుకులతో ‘అమ్మహస్తం’కు ఆదరణ కరువు

Published Sat, Oct 12 2013 4:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

Amma Hastam scheme fails due to supply of crumbling food items

కిరణ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకం అట్టర్‌ఫ్లాప్ అయింది. సరుకుల నాణ్యత లేమితో పాటు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కరువైంది. మరోవైపు రేషన్ డీలర్లూ ఈ సరుకుల పంపిణీపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానికి తగ్గట్టే సరుకుల సరఫరా కూడా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఫలితంగా చౌకధరల దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం బెడిసికొట్టినట్లయింది.
 
నాణ్యతపై అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినాన లాంఛనంగా ప్రారంభించిన ఈ పథకం ఆచరణలో పూర్తిగా అభాసుపాలైంది. ప్రజల ఛీత్కారాలు, ఆగ్రహావేశాలకు గురికావాల్సి వచ్చింది. వాస్తవంగా పథకం ప్రారంభం నుంచి సరుకులకు ప్రజల ఆదరణ లేకుండా పోయింది. ఈ పథకం కింద ఇస్తున్న తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల్లో నాణ్యత లోపిస్తోంది. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమ పిండి, ఘాటు లేని కారం పోడి రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు ఖంగుతింటున్నారు. కేవలం రూ.185 కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు ముక్కిపోయిన ఈ సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేయడంపై పలు దుకాణాల్లో మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనలూ ఉన్నాయి.

అమ్మహస్తం తీరిదీ...
 సరుకులు కొనుగోలు (శాతం)
 గోధుమలు 91 శాతం
 చక్కెర 92 శాతం
 పామోలిన్ 91 శాతం
 కందిపప్పు 23 శాతం
 గోధుమ  పిండి 29 శాతం
 కారంపొడి 13 శాతం
 పసుపు 14 శాతం
 ఉప్పు 9 శాతం
 చింతపండు 29 శాతం

తొమ్మిదింటిలో మూడే ..
అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబర్చుతున్నారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగితా ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు. దీంతో మిగతా సరుకుల కోటా కూడా తగ్గుముఖం పట్టింది. వాస్తవానికి పథకాన్ని ప్రారంభించే రోజు మాత్రం నాణ్యమైన ప్యాకెట్లను లబ్ధిదారులకు అందించి.. మరుసటి రోజు నుంచి సరుకుల సరఫరాలో అసలు రంగు బయటపెట్టారు. దీంతో తొమ్మిది సరుకులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
 
డీలర్ల నిరాస్తకత
రేషన్ డీలర్లు కూడా తొమ్మిది సరుకుల పంపిణీపై ఆసక్తి చూపడం లేదు. సరుకుల కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడం, కమీషన్ గిట్టుబాటు కాకపోవడం, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల (కిట్) సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక కిట్ విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు. పైగా సరుకుల దిగుమతి ఖర్చు, రవాణా అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు ఉపాధికి గండిపడుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రచారార్భాటమే...
‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరకులుపై  ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం. నెల సరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే.
 
సరుకుల్లో నాణ్యత లేదు

కారంపొడి కందిపప్పులలో పూర్తిగా పురుగులు కనిపిస్తున్నాయి. మిగతా సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. పైగా రేషన్ డీలర్లు రోజుల తరబడి తిప్పుతున్నారు. అమ్మహస్తం వస్తువులతో పాటు అందజేసే బ్యాగ్‌ను సైతం ఇవ్వడం లేదు.    
 - రవికాంత్, హనుమాన్‌నగర్.                   
 
మార్కెట్ ధరల్లాగే ఉన్నాయి

అమ్మహస్తం సరుకుల ధర బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే పెద్దగా తేడా లేదు. పైగా నాసిరకం సరుకులను పంపిణీ చేస్తున్నారు. పప్పు, కారం పొడి ఎందుకు పనికి రాకపోవడంతో పడేస్తున్నాం.
 - రంజిత్, గౌలిపురా

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement