డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో వరద బాధితులకు నాసిరకం సరుకులు
పాడైపోయిన కూరగాయలను చూసి బాధితుల ఆగ్రహం
తినేందుకు పనికిరాక చెత్తకుప్పల్లో పడేస్తున్న వైనం
పిఠాపురం : వరద కారణంగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులను కూటమి ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇలాకాలో వరద బాధితులకు అందించిన రేషన్ సరకులు నాసిరకంగా ఉండటంతో బాధితులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలైన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రభుత్వం వరద బాధితులకు రెండు రోజులుగా బియ్యం, నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. వాటిని అందుకున్న బాధితులు విప్పి చూసి అవాక్కవుతున్నారు.
పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నల్ల రంగులో పులిసిన వాసనతో చక్కెర, సైరస్ కంపెనీ 25 కేజీల బియ్యం బ్యాగ్‌లో రేషన్ బియ్యం కనిపిస్తుండటంతో వరద బాధితులు విస్తుబోతున్నారు. బ్యాగ్ చూసి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిందని సంతోషించిన వరద బాధితులు అందులో రేషన్ బియ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వండిన వంట జావగా మారడంతో ఇవి తిని ఆస్పత్రి పాలవమంటారా.. అని ప్రశ్నిస్తున్నారు. పాడైన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెరను చెత్తలో పారేస్తున్నారు. చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్ ఇవి తింటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరికి వరద సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment