భోజనాలకు రూ.368 కోట్లు.. మంచినీళ్లకు రూ.26 కోట్లా?
కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకూ రూ.23 కోట్ల ఖర్చేమిటి?
వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి ప్రశ్న
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?
ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment