కర్నూలు: టీడీపీ ప్రభుత్వం పొదుపు మంత్రం పఠిస్తోంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలోని పథకాల్లో తమ ముద్ర కనిపించేలా పేర్లు మార్పు చేస్తున్నా.. అమలులో విఫలమవుతోంది. చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల్లో కోత విధిస్తూ పేదల కడుపు మాడుస్తోంది. ‘అమ్మహస్తం’ కింద గత ప్రభుత్వం బియ్యం సహా తొమ్మిది సరుకులు అందిస్తుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రజాపంపిణీగా పేరు మార్పు చేసి రెండు సరుకులతో సరిపెట్టడం విమర్శలకు తావిస్తోంది.
బియ్యం, అర కిలో చక్కెర మాత్రమే అందించి మిగిలిన వస్తువులకు మంగళం పాడటం గమనార్హం. రూ.185లకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల్లో భాగంగా అర కిలో చక్కెర, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, ఉప్పు ప్యాకెట్, 100 గ్రాముల కారం, అర కిలో చింతపండు, 100 గ్రాముల పసుపు పంపిణీ చేయాల్సి ఉంది. దశల వారీగా ఈ సరుకుల్లో కోత విధిస్తూ ఆగస్టు నెలకు బియ్యం, చక్కెరతో సరిపెట్టేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటని కార్డుదారులు డీలర్లను నిలదీస్తే బిక్క ముఖం వేస్తున్నారు.
కొన్నింటికి డీడీలు కట్టినా అందుకు తగిన సరుకులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం స్పందించకపోతే తామేమి చేయాలనే సమాధానం వస్తోంది. గత నెలలో బ్యాక్‌లాగ్ కింద మిగిలిన కందిపప్పును కర్నూలులోని 40 చౌక డిపోలకు మాత్రమే కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 17 గోదాములు ఉండగా.. అన్ని చోట్లా బియ్యం, చక్కెర మినహా ఇతర సరుకుల కొరత ఏర్పడింది. డీడీలు కట్టిన డీలర్లు గోదాముల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
శాఖల మధ్య సమన్వయ లోపం
పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల కార్పొరేషన్ల మధ్య సమన్వయ లోపంతో ఏ మేరకు సరుకులు సరఫరా చేయాలనే విషయమై జిల్లాలో గందరగోళం నెలకొంది. పౌర సరఫరాల శాఖ కేటాయించిన కోటా ప్రకారం సరుకులను అందజేయడంలో అయోమయ పరిస్థితి తలెత్తుతోంది. టమాటాలు, చింతపండు, ఎర్రగడ్డలు తదితర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చౌకడిపోల ద్వారా అందించే సరుకుల్లో కోత పెడుతుండటం పట్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పామాయిల్ సరఫరా ఐదు మాసాలుగా నిలిచిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ, పౌర సరఫర సంస్థ అధికారులు సోమవారం అన్ని జిల్లాల అధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ వచ్చే నెల కోటాలో తొమ్మిది రకాల సరుకులపై స్పష్టత కొరవడింది.
గందరగోళంగా ఆధార్ అనుసంధానం
రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా డీలర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 11,54,068 రేషన్ కార్డులు ఉండగా, 43,94,846 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 25,94,069 కార్డులకు మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు లోపల 40 శాతం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆధార్ దిగిన మూడు లక్షల మందికి పైగా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆధార్ అనుసంధానమైన రేషన్ కార్డులకు మాత్రమే సెప్టెంబర్ నెల కోటా సరుకులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో నెలాఖరులోగా ఆధార్ కార్డులు అందని పరిస్థితి ఏమిటనే విషయం ప్రశ్నార్థకమవుతోంది.
పేరు మార్చి.. సరుకుల్లో కోతేసి!
Published Wed, Aug 20 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement