the Congress government
-
‘శ్రీరామిరెడ్డి’ పనుల్లో నాణ్యతా లోపం
మడకశిర: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనుల్లో నాణ్యత లోపించిందని, ఫలితంగానే పలు గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య నెలకొని ఉందని జెడ్పీ చైర్మన్ చ మన్సాబ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.600 కోట్లతో చేపట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనులు గత కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యంగా చేయలేదని, నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. ఈ పథకం ద్వారా 832 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు. పనులు సక్రమంగా చేయక పోవడంతో 600 గ్రామాలకే తాగునీరు అందుతోందన్నారు. తమ ప్రభుత్వం ఈ పథకం పనులను నాణ్యతగా పూర్తి చేసి మిగిలిన గ్రామాలతో సహా నిర్దేశించిన అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాగునీటి కోసం ప్రస్తుతం రూ.3.40 కోట్ల నిధులను కేటాయించామని ఆయన వెల్లడించారు. అలాగే 282 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిధుల కొరత ఉందని, దీంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించలేక పోతున్నామని అన్నారు. మరో ఆరు నెలల వరకు నిధుల కొరత ఉంటుందని, తర్వాత ఆ సమస్య ఉండబోదని చెప్పారు. జిల్లాలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు తాగునీటి సమస్య ఉందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కాకపోతే చర్యలు తప్పవని జెడ్పీ చైర్మన్ హెచ్చరించారు. దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతమైతే, జిల్లాలో మడకశిర నియోజకవర్గం మరింత క్షామ పీడిత ప్రాంతమని, ఇక్కడ తాగునీటి సమస్య కూడా అధికంగా ఉందని అన్నారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, వాటిని పరిష్కరించేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, తదితరులు పాల్గొన్నారు. -
పేరు మార్చి.. సరుకుల్లో కోతేసి!
కర్నూలు: టీడీపీ ప్రభుత్వం పొదుపు మంత్రం పఠిస్తోంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలోని పథకాల్లో తమ ముద్ర కనిపించేలా పేర్లు మార్పు చేస్తున్నా.. అమలులో విఫలమవుతోంది. చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల్లో కోత విధిస్తూ పేదల కడుపు మాడుస్తోంది. ‘అమ్మహస్తం’ కింద గత ప్రభుత్వం బియ్యం సహా తొమ్మిది సరుకులు అందిస్తుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రజాపంపిణీగా పేరు మార్పు చేసి రెండు సరుకులతో సరిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. బియ్యం, అర కిలో చక్కెర మాత్రమే అందించి మిగిలిన వస్తువులకు మంగళం పాడటం గమనార్హం. రూ.185లకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల్లో భాగంగా అర కిలో చక్కెర, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, ఉప్పు ప్యాకెట్, 100 గ్రాముల కారం, అర కిలో చింతపండు, 100 గ్రాముల పసుపు పంపిణీ చేయాల్సి ఉంది. దశల వారీగా ఈ సరుకుల్లో కోత విధిస్తూ ఆగస్టు నెలకు బియ్యం, చక్కెరతో సరిపెట్టేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటని కార్డుదారులు డీలర్లను నిలదీస్తే బిక్క ముఖం వేస్తున్నారు. కొన్నింటికి డీడీలు కట్టినా అందుకు తగిన సరుకులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం స్పందించకపోతే తామేమి చేయాలనే సమాధానం వస్తోంది. గత నెలలో బ్యాక్లాగ్ కింద మిగిలిన కందిపప్పును కర్నూలులోని 40 చౌక డిపోలకు మాత్రమే కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 17 గోదాములు ఉండగా.. అన్ని చోట్లా బియ్యం, చక్కెర మినహా ఇతర సరుకుల కొరత ఏర్పడింది. డీడీలు కట్టిన డీలర్లు గోదాముల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల కార్పొరేషన్ల మధ్య సమన్వయ లోపంతో ఏ మేరకు సరుకులు సరఫరా చేయాలనే విషయమై జిల్లాలో గందరగోళం నెలకొంది. పౌర సరఫరాల శాఖ కేటాయించిన కోటా ప్రకారం సరుకులను అందజేయడంలో అయోమయ పరిస్థితి తలెత్తుతోంది. టమాటాలు, చింతపండు, ఎర్రగడ్డలు తదితర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చౌకడిపోల ద్వారా అందించే సరుకుల్లో కోత పెడుతుండటం పట్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ సరఫరా ఐదు మాసాలుగా నిలిచిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ, పౌర సరఫర సంస్థ అధికారులు సోమవారం అన్ని జిల్లాల అధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ వచ్చే నెల కోటాలో తొమ్మిది రకాల సరుకులపై స్పష్టత కొరవడింది. గందరగోళంగా ఆధార్ అనుసంధానం రేషన్ కార్డులకు ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా డీలర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 11,54,068 రేషన్ కార్డులు ఉండగా, 43,94,846 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 25,94,069 కార్డులకు మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు లోపల 40 శాతం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆధార్ దిగిన మూడు లక్షల మందికి పైగా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆధార్ అనుసంధానమైన రేషన్ కార్డులకు మాత్రమే సెప్టెంబర్ నెల కోటా సరుకులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో నెలాఖరులోగా ఆధార్ కార్డులు అందని పరిస్థితి ఏమిటనే విషయం ప్రశ్నార్థకమవుతోంది. -
ప్రజాప్రతినిధుల గోల
15 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్ రూ.8.5 కోట్ల నిధుల బిల్లులకు ఆటంకం పాత, కొత్త ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్ మళ్లీ గెలుస్తామో లేదో అనుకున్నారు. ఇప్పుడే వీలైనంత వెనకేసుకోవాలనుకున్నారు. రాబోయే నిధులకు పనులకు రూపకల్పన చేశారు. అనుమతుల్లేకపోయినా ప్రారంభించేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొల్లగొట్టేశారు. ఆ పనుల్నే చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అధికారం చేపట్టగానే పాత ప్రభుత్వ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిచ్చారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల బిల్లుల్ని నిలిపివేశారు. రూ.8.5 కోట్ల నిధుల మంజూరు నిలిచిపోవడంతో మాజీ, తాజా ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం : గత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ.కోటి చొప్పున జిల్లాకు రూ.15 కోట్లు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద నిధులు విడుదల చేసేది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటం, సమైక్యాంధ్ర ఉద్యమ వేడితో గెలుపు గెలవడం కష్టమనే భావనతో దాదాపు ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గ నిధులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశారు. ఎప్పుడో రాబోయే నిధులకు సైతం అనుమతుల్లేకుండా ముందుగా ప్రారంభించేశారు. తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేశారు. జిల్లా ప్రణాళిక శాఖకు సైతం చెప్పకుండా, అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ శంకుస్థాపనలు చేసేశారు. కాంట్రాక్టర్ల నుంచి ముందే కమీషన్లను వసూలు చేసేశారు. 2013-2014 ఆర్థికసంవత్సరం చివరి ఆరు నెలల్లో 15 నియోజకవర్గాల్లో రూ.8.50 కోట్ల పనులను ప్రారంభించేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది తాము ప్రారంభించిన పనులను చూపించి ఓట్లు కూడా అడిగేశారు. కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.8.50 కోట్ల ఎమ్మెల్యే నిధులను నిలిపివేసింది. పాత ప్రభుత్వంలో చివరి ఆరునెలల కాలానికి నిధులివ్వడం సాధ్యం కాదని మొండికేస్తోంది. దీంతో ప్రస్తుతం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 205 వరకు చిన్నా,పెద్దా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా ప్రణాళిక శాఖాధికారుల్ని ఆశ్రయిస్తే తమకు సంబంధం లేదని, పాత నిధులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని చెబుతుండటంతో పాత ఎమ్మెల్యేలు, అధికారులు, కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ముందుగానే కమీషన్లు చెల్లించేయడంతో ఇప్పుడు నష్టపోయామంటూ మాజీ ఎమ్మెల్యేల వద్ద కాంట్రాక్టర్లు పంచాయతీ పెడుతున్నారు. అనుమతులిచ్చిన మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులేమో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. పాత ఎమ్మెల్యేలు నిత్యం జిల్లా ప్రణాళిక శాఖకు ఫోన్లు చేస్తుండటంతో అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండడంతో సర్దుబాటు చేయాలనుకున్నా ఏకంగా చంద్రబాబు ఎమ్మెల్యే నిధుల పథకాన్ని రద్దు చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు. -
ఉచిత కరెంటుకు మంగళం!
ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కోకు అందని నిధులు లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌కో మూన్నాళ్ల ముచ్చటగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఎస్సీ, ఎస్టీలకు ఆసరాగా ఉండేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ఆరు నెలలు తిరక్కుండానే అభాసుపాలవుతోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దీనిగురించి పట్టించుకోవడంలేదు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రాన్స్‌కో లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోంది. పలమనేరు: ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడే లబ్ధిదారులకు ఉచిత కరెంటును అందజేసేలా గత ప్రభుత్వం ఉచి త విద్యుత్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు రాకపోవడంతో ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ట్రాన్స్‌కో అధికారులు ఎస్సీ, ఎస్టీల నుంచి విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. పథక ఉద్దేశమేమిటంటే... ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంటును అందివ్వడమే ఈ పథక లక్ష్యం. ఇందుకోసం గత ఏడాది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చింది. కార్యక్రమ నిర్వహణను సాంఘిక సంక్షేమశాఖకు అప్పగించింది. పథకం ప్రారంభమైన తర్వాత రెండు నెలలు మాత్రం ట్రాన్స్‌కోకు నిధులు అందాయి. ఆపై దీని గురించి పట్టించుకోలేదు. ట్రాన్స్‌కోకు రూ.2.40 కోట్ల బకాయి తిరుపతి ట్రాన్స్‌కో సర్కిల్ పరిధిలోని రూరల్ డివిజన్లలో ఈ పథకం అమలవుతోంది. చిత్తూరురూరల్, మదనపల్లెరూరల్, తిరుపతి రూర ల్, పూతలపట్టు, పీలేరు డివిజన్ పరిధులతో పాటు కుప్పం రెస్కోతో కలిపి దాదాపు 44 వేల మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులున్నారు. వీరికి సంబంధించి ఆరు నెలలుగా రూ.2.40 కోట్ల వరకు సాంఘిక సంక్షేమ శాఖ ట్రాన్స్‌కోకు బకాయిపడింది. ఇన్నాళ్లూ ఎదురుచూసినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తోంది. రెండు నెలల నుంచి వసూలు రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు లబ్ధిదారుల నుంచి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. కొందరు బిల్లులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఓ నెల వేచిచూసే ధోరణిలో ట్రాన్స్‌కో ఉం ది. వచ్చే నెల నుంచి కచ్చితంగా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. కుదరదంటే ఇళ్లకు డీసీలు చేయాల్సి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చిత్తూరు ట్రాన్స్‌కో డీఈ రమణను వివరణ కోరగా పథకం ప్రారంభమయ్యాక రెండు నెలలు మాృతం బిల్లులందాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమకు డబ్బు జమ కాలేదన్నారు. తమ శాఖకు ఈ బిల్లులు గుదిబండలా మారాయన్నారు. అందుకే ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నామన్నారు. -
నిద్ర మత్తులో సిద్ధు సర్కార్
హొస్పేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిద్దరామయ్య గాఢనిద్రలో ఉన్నారని, వారిని వైద్యులకు చూపించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో న్యాయాంగ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందన్నారు. పోలీస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి వారికి సరైన బుద్ధి చెప్పడం పోయి టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ చర్చల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనైతిక కార్యకలాపాలు, అక్రమ ఇసుక మాఫీయాలు అధికమయ్యాయన్నారు. అక్రమ ఇసుక మాఫియా వెనుక మంత్రుల పుత్రుల హస్తముందన్నారు. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ చెరుకుకు కల్పించిన మద్దతు ధర రూ.2650లు ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అందలేదన్నారు. ఈ శాన్య ఉపాధ్యాయుల విధాన పరిషత్ అభ్యర్థి శశీల్ జీ.నమోషి తరుపున కొప్పళ, బళ్లారి జిల్లాలో ప్రచారం చేశామన్నారు. శశీల్ జీ.నమోషి ఈశాన్య ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా నాలుగో సారి గెలువడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలను నేడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం తమకెంతో బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్.ఈశ్వరప్ప, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే ఎన్టీ.బొమ్మన్న, బీజేపీ జిల్లాధ్యక్షుడు కే.నేమిరాజ్‌నాయక్, బీజేపీ నేతలు రామలింగప్ప, భరమలింగనగౌడ, సందీప్‌సింగ్, చంద్రకాంత్ కామత్ పాల్గొన్నారు.