మడకశిర: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనుల్లో నాణ్యత లోపించిందని, ఫలితంగానే పలు గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య నెలకొని ఉందని జెడ్పీ చైర్మన్ చ మన్‌సాబ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.600 కోట్లతో చేపట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనులు గత కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యంగా చేయలేదని, నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు.
ఈ పథకం ద్వారా 832 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు. పనులు సక్రమంగా చేయక పోవడంతో 600 గ్రామాలకే తాగునీరు అందుతోందన్నారు. తమ ప్రభుత్వం ఈ పథకం పనులను నాణ్యతగా పూర్తి చేసి మిగిలిన గ్రామాలతో సహా నిర్దేశించిన అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాగునీటి కోసం ప్రస్తుతం రూ.3.40 కోట్ల నిధులను కేటాయించామని ఆయన వెల్లడించారు.
అలాగే 282 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిధుల కొరత ఉందని, దీంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించలేక పోతున్నామని అన్నారు. మరో ఆరు నెలల వరకు నిధుల కొరత ఉంటుందని, తర్వాత ఆ సమస్య ఉండబోదని చెప్పారు. జిల్లాలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు తాగునీటి సమస్య ఉందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కాకపోతే చర్యలు తప్పవని జెడ్పీ చైర్మన్ హెచ్చరించారు.
దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతమైతే, జిల్లాలో మడకశిర నియోజకవర్గం మరింత క్షామ పీడిత ప్రాంతమని, ఇక్కడ తాగునీటి సమస్య కూడా అధికంగా ఉందని అన్నారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, వాటిని పరిష్కరించేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.
‘శ్రీరామిరెడ్డి’ పనుల్లో నాణ్యతా లోపం
Published Sat, Oct 11 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement