స్కూల్లో భోజనం..ఇంట్లో శుభ్రం | Drinking water problems at Primary schools | Sakshi
Sakshi News home page

స్కూల్లో భోజనం..ఇంట్లో శుభ్రం

Published Sun, Aug 2 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

స్కూల్లో భోజనం..ఇంట్లో శుభ్రం

స్కూల్లో భోజనం..ఇంట్లో శుభ్రం

♦ మర్రిపూడి సర్కార్ స్కూళ్లలో తాగునీటికి తిప్పలు
♦ చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకోవడానికి ఇంటి బాట పడుతున్న విద్యార్థులు
♦ ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్న వైనం
♦ చోద్యం చూస్తున్న విద్యాశాఖ   
 
 సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మర్రిపూడి మండలంలో తాగునీటి కోసం విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనానికి ఇంటి వద్ద నుంచే నీరు తెచ్చుకుంటూ, తినే పళ్లెం, చేతులు శుభ్రం చేసుకోవ డానికి ఇంటి బాట పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగునీరు ఏర్పాటు చేయాలని పలు మార్లు అధికారులకు విన్నవించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.  
 
 మర్రిపూడి : మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే కేవలం 8 ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే తాగునీరు వసతి ఉంది. మిగిలిన ప్రాథమిక పాఠశాల ఆవరణలో చేతిపంపులు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా సగానికి పైగా మరమ్మతులకు గురయ్యాయి. పాఠశాల ఆవరణలో ఉన్న చేతి పంపు నీరు ఫ్లోరైడ్‌తో ఉండటం చేత విద్యార్థులు తాగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి బాటిల్స్‌తో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గంగపాలెం ప్రాథమిక పాఠశాలలో 79 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

పాఠశాల ఆవరణలో చేతి పంపు నీరు దుర్వాసన వెదజల్లుతుంది.  మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు చేతులు నాక్కుంటూ ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు ఇళ్లకు వెళుతున్నారు. దీనికి తోడు గ్రామంలో దాదాపు 700 మందికి పై గా ఉన్నారు.  వీరందరికీ కలపి ఒకే ఒక్క కుళాయి ఉంది. పాఠశాలలో చేతిపంపు మరమ్మతుకు గురైన విషయం పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.  

 ఇంతకంటే దారుణం ఏముంటుంది.. -మాలకొండారెడ్డి, గంగపాలెం గ్రామస్తులు  
 నాయకులు ఓట్ల కోసం మా గ్రామం వస్తారు. ఈ ఒక్కసారి గెలిపించమని బతిమలాడుకుంటారు. గెలిచాక ఇక కనిపించరు. పాఠశాలలో చిన్నారులకు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారంటే అధికారులు, నాయకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అన్నం తినే ప్లేట్లు ఇళ్లకు  వెళ్లి శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంతకంటే దారుణం ఏముంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement