ప్రజాప్రతినిధుల గోల
- 15 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్
- రూ.8.5 కోట్ల నిధుల బిల్లులకు ఆటంకం
- పాత, కొత్త ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్
మళ్లీ గెలుస్తామో లేదో అనుకున్నారు. ఇప్పుడే వీలైనంత వెనకేసుకోవాలనుకున్నారు. రాబోయే నిధులకు పనులకు రూపకల్పన చేశారు. అనుమతుల్లేకపోయినా ప్రారంభించేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొల్లగొట్టేశారు. ఆ పనుల్నే చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అధికారం చేపట్టగానే పాత ప్రభుత్వ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిచ్చారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల బిల్లుల్ని నిలిపివేశారు. రూ.8.5 కోట్ల నిధుల మంజూరు నిలిచిపోవడంతో మాజీ, తాజా ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం : గత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ.కోటి చొప్పున జిల్లాకు రూ.15 కోట్లు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద నిధులు విడుదల చేసేది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటం, సమైక్యాంధ్ర ఉద్యమ వేడితో గెలుపు గెలవడం కష్టమనే భావనతో దాదాపు ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గ నిధులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశారు. ఎప్పుడో రాబోయే నిధులకు సైతం అనుమతుల్లేకుండా ముందుగా ప్రారంభించేశారు. తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేశారు. జిల్లా ప్రణాళిక శాఖకు సైతం చెప్పకుండా, అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ శంకుస్థాపనలు చేసేశారు. కాంట్రాక్టర్ల నుంచి ముందే కమీషన్లను వసూలు చేసేశారు.
2013-2014 ఆర్థికసంవత్సరం చివరి ఆరు నెలల్లో 15 నియోజకవర్గాల్లో రూ.8.50 కోట్ల పనులను ప్రారంభించేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది తాము ప్రారంభించిన పనులను చూపించి ఓట్లు కూడా అడిగేశారు. కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.8.50 కోట్ల ఎమ్మెల్యే నిధులను నిలిపివేసింది. పాత ప్రభుత్వంలో చివరి ఆరునెలల కాలానికి నిధులివ్వడం సాధ్యం కాదని మొండికేస్తోంది. దీంతో ప్రస్తుతం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 205 వరకు చిన్నా,పెద్దా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి.
జిల్లా ప్రణాళిక శాఖాధికారుల్ని ఆశ్రయిస్తే తమకు సంబంధం లేదని, పాత నిధులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని చెబుతుండటంతో పాత ఎమ్మెల్యేలు, అధికారులు, కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ముందుగానే కమీషన్లు చెల్లించేయడంతో ఇప్పుడు నష్టపోయామంటూ మాజీ ఎమ్మెల్యేల వద్ద కాంట్రాక్టర్లు పంచాయతీ పెడుతున్నారు. అనుమతులిచ్చిన మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులేమో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
పాత ఎమ్మెల్యేలు నిత్యం జిల్లా ప్రణాళిక శాఖకు ఫోన్లు చేస్తుండటంతో అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండడంతో సర్దుబాటు చేయాలనుకున్నా ఏకంగా చంద్రబాబు ఎమ్మెల్యే నిధుల పథకాన్ని రద్దు చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు.