హొస్పేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిద్దరామయ్య గాఢనిద్రలో ఉన్నారని, వారిని వైద్యులకు చూపించాలని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో న్యాయాంగ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందన్నారు. పోలీస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి వారికి సరైన బుద్ధి చెప్పడం పోయి టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ చర్చల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనైతిక కార్యకలాపాలు, అక్రమ ఇసుక మాఫీయాలు అధికమయ్యాయన్నారు. అక్రమ ఇసుక మాఫియా వెనుక మంత్రుల పుత్రుల హస్తముందన్నారు.
సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ చెరుకుకు కల్పించిన మద్దతు ధర రూ.2650లు ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అందలేదన్నారు. ఈ శాన్య ఉపాధ్యాయుల విధాన పరిషత్ అభ్యర్థి శశీల్ జీ.నమోషి తరుపున కొప్పళ, బళ్లారి జిల్లాలో ప్రచారం చేశామన్నారు. శశీల్ జీ.నమోషి ఈశాన్య ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా నాలుగో సారి గెలువడం ఖాయమన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలను నేడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం తమకెంతో బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్.ఈశ్వరప్ప, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే ఎన్‌టీ.బొమ్మన్న, బీజేపీ జిల్లాధ్యక్షుడు కే.నేమిరాజ్‌నాయక్, బీజేపీ నేతలు రామలింగప్ప, భరమలింగనగౌడ, సందీప్‌సింగ్, చంద్రకాంత్ కామత్ పాల్గొన్నారు.
నిద్ర మత్తులో సిద్ధు సర్కార్
Published Tue, Jun 17 2014 2:14 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement