కర్నూలు, న్యూస్‌లైన్ : చౌకడిపోల ద్వారా పేదలకు అందించే పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో వంటింటి ఘుమఘుమలకు గడ్డుకాలం తలెత్తింది. గత ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి డబ్బు బకాయి పడటంతో పామాయిల్ పారిశ్రామికవేత్తలు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేయడమే ఇందుకు కారణమైంది. రెండు నెలల క్రితమే సరఫరా నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జూన్ నెలలోనూ పామాయిల్ సరఫరా లేదనే చేదు వార్త పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి చేరింది.
ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ద్వారా ఆర్డీఓలు, అక్కడి నుంచి తహశీల్దార్లకు సమాచారం అందింది. తెల్లకార్డుదారులకు రాయితీ ధరపై పంపిణీ చేస్తున్న పామోలిన్ ఆయిల్ జూన్ తర్వాతనైనా వచ్చే అవకాశాలపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మే నెలలోనూ సరఫరా చేపట్టలేదు. అంతకుముందు నెలకు సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద గోదాముల్లోని మిగులును మాత్రం కొన్ని గ్రామీణ ప్రాంతాల చౌకడిపోలకు చేరవేశారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనె ధర రూ.85 కాగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగించే పామోలిన్ ధర రూ.65 పలుకుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాల్లో రేషన్‌కార్డులకు లీటర్ పామోలిన్ వంటింటి సంక్షోభం
రూ.40లకు లభ్యమవుతోంది.
మలేషియా నుంచి నిలిచిన దిగుమతి
పామోలిన్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. అక్కడి నుంచి కాకినాడ సీపోర్టుకు చేరుతుంది. అక్కడే ప్యాకింగ్ చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. దిగుమతి చేసుకునే సమయంలో సబ్సిడీ ధరను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మూడు నెలల నుంచి జమ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పామోలిన్ దిగుమతి నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస ఎన్నికలు జరిగాయి. దీంతో పామోలిన్ సబ్సిడీ ధర చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. ఈ కారణంగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది.
కార్డుదారులపై అదనపు భారం
పేదలు అధికంగా వినియోగించే వంట నూనె పామోలిన్ సరఫరాపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 11.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుకు లీటరు చొప్పున(ప్యాకెట్) 2,374 చౌక డిపోల ద్వారా పేదలందరికీ ప్రతి నెలా 11.40 లక్షల లీటర్ల పామోలిన్ సరఫరా చేసేవారు. అది నిలిచిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వంట నూనెను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ లెక్కన ప్రతి నెలా కార్డు వినియోగదారులపై రూ.2.85 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్ నెలలో పామోలిన్ ఇవ్వాలనుకుంటే 8వ తేదీన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అమ్మహస్తం.. అస్తవ్యస్తం
అమ్మహస్తం కింద తొమ్మిది రకాల సరుకులతో కార్డుదారులకు పంపిణీ చేసే సరుకుల సంచి నెమ్మదిగా చిక్కిపోతుంది. తొమ్మిది సరుకుల స్థానంలో ప్రస్తుతం బియ్యం, పంచదారా, కందిపప్పు, గోధుమ పిండితో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో ఈ సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తాజాగా పామోలిన్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం రాయితీ ధరపై కేవలం నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందుతున్నాయి.
కిరోసిన్ సరఫరాపైనా రాష్ట్ర విభజన ప్రభావం
రాష్ట్ర విభజన ప్రభావం కిరోసిన్ సరఫరాపైనా చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ దిగుమతి ఈ నెల 24వ తేదీ నుంచి నిలిచిపోయింది. 24వ తేదీ వరకు మాత్రమే హోల్‌సేల్ డీలర్లకు కిరోసిన్ సరఫరా చేశారు. కర్నూలు కార్పొరేషన్‌లోని కార్డుదారులకు నెలకు 4 లీటర్లు.. మునిసిపాలిటీలు, మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులకు ప్రతి నెలా 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది.
ఈ లెక్కన ప్రతి నెలా 20.76 లక్షల లీటర్లు కిరోసిన్ అవసరం కాగా, ఇప్పటి వరకు 1.50 లక్షల లీటర్లు కూడా హోల్‌సేల్ డీలర్ల వద్దకు చేరకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం ప్రతి నెలా 22, 23 తేదీల్లో సబ్సిడీ సరుకులు.. 2, 3 తేదీల్లో కిరోసిన్ కేటాయింపులు చేపట్టేది. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం.. రాష్ట్ర విభజన తదితర ఘటనలతో రెండు రాష్ట్రాలకు సమాన కోటా కేటాయింపుల విషయంపై సందిగ్ధం నెలకొనడంతో జిల్లాకు కేటాయించిన కిరోసిన్ కోటా కూడా నిలిచిపోయింది.
వంటింటి సంక్షోభం
Published Mon, Jun 2 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement