సాక్షి, కర్నూలు/అర్బన్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలతో కర్నూలు నగరం మురిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖుల రాకతో ఉత్సవం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అధికారుల ముందస్తు ప్రణాళిక.. సమష్టి సహకారంతో సంబరం అంబరాన్నంటింది. పోలీసుల పక్కా వ్యూహం ఫలించగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమం సాఫీగా సాగిపోయింది.
రాష్ట్ర స్థాయి వేడుకలకు నగరం వేదిక కాగా.. తిలకించేందుకు ప్రతి ఒక్క హృదయం తపించింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరికీ అవకాశం దక్కకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేసినా.. ఎనిమిది ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లపై జెండా పండుగ వీక్షించడం ప్రజలకు సరికొత్త అనుభూతికి లోనుచేసింది. ఉదయం 7 గంటల నుంచే స్థానికులు స్క్రీన్ల వద్దకు చేరుకోవడం కనిపించింది. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో కర్నూలును రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది.
కరువు రక్కసి కోరలు చాస్తున్న వేళ.. ‘అభివృద్ధి’ మాటతో.. రాజకీయ చతురతతో బాబు వరాల వర్షం కురిపించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం 8.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలు దేరింది. ఫైవ్‌రోడ్డు జంక్షన్, ఆనంద్ థియేటర్ సర్కిల్, కొత్త బస్టాండు మీదుగా కాన్వాయ్ పెరెడ్ మైదానానికి చేరుకుంది. రెండో బెటాలియన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న తొలి వేడుక కావడంతో పోలీసు శాఖ ఒళ్లంతా కళ్లు చేసుకుంది.
ఏపీఎస్పీ మైదానం, చుట్టుపక్క ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు.. ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. పెరేడ్ మైదానం చుట్టూ ఉన్న కాలనీలు.. బహుళ అంతస్తుల భవనాలపైనా నిఘా ఉంచడంతో అడుగడుగునా పోలీసులే కన్పించారు. ఏపీఎస్పీ మైదానంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు సహా సామాన్యులను, విద్యార్థులను ఒకటికి రెండు సార్లు తనిఖీ నిర్వహించి అనుమతించారు. ఐదు ప్రధాన ద్వారాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ బలగాలను మోహరించారు. మొత్తం వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
Published Sat, Aug 16 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement