సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్కడ పని చేయాలనే విషయంలో స్పష్టత కొరవడటం అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం లాటరీ తీయడంతో అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. రోస్టర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఐపీఎస్ అధికారి ఎస్పీ ఆకే రవికృష్ణలు ఎక్కడ సేవలందిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేయగా.. మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్‌పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేయడం తెలిసిందే. గత శనివారం కమిటీ ఢిల్లీలో సమావేశం కాగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కేటగిరీలకు తీసిన లాటరీల్లో తొలి అవకాశం తెలంగాణకే లభించింది.
ప్రత్యక్ష నియామకాలపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన(అవుట్ సైడర్) అధికారుల కేటాయింపులను రోస్టర్ విధానంలో తెలంగాణ రాష్ట్రం నుంచే చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడివిడిగా రోస్టర్ విధానంలో.. నేరుగా నియమితులైన(ఆంధ్ర కేడర్), పదోన్నతి పొందిన రాష్ట్ర అధికారులను స్థిర నివాస ప్రాంతం ఆధారంగా కేటాయించనున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారుల కొరత ఆధారంగా కూడా కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూలై 14న బాధ్యతలు చేపట్టిన సీహెచ్ విజయమోహన్ పదోన్నతుల కేటగిరీలో ఐఏఎస్ అధికారి అయ్యారు. గతంలో కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్‌గా పని చేశారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతల అనంతరం కలెక్టర్‌గా పోస్టింగ్ దక్కింది. కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ అయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో నిర్వహించిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయనను ఏ రాష్ట్రానికి కేటాయిస్తారనేది వేచి చూడాలి.
ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ ఆకే రవికృష్ణ 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఉన్నారు. జిల్లాకు కొత్తే అయినా రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రవికృష్ణ భవిష్యత్ ఏమిటనేది కూడా కేటాయింపుల్లో తేలనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి వట్టి వసంతకుమార్ ఓఎస్డీగా పని చేస్తూ దాదాపు 22 నెలల క్రితం జిల్లాకు బదిలీపై వచ్చిన జేసీ కె.కన్నబాబు కూడా పదోన్నతుల ప్రక్రియలోనే ఐఏఎస్ హోదా పొందారు. జేసీగా తొలి పోస్టింగ్ అయినప్పటికీ విధి నిర్వహణలో తన ముద్రను కనబర్చారు. ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే. మరి ఈయన సేవలను ఏ రాష్ట్రంలో ఉపయోగించుకుంటారో స్పష్టం కావాల్సి ఉంది.
మనవాళ్లెక్కడికి!
Published Mon, Aug 18 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement