సాక్షి ప్రతినిధి, కర్నూలు: ముప్పై మూడు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవికృష్ణ శాంతిభద్రతలపై దృష్టిపెట్టారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో మొదటిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.
ఆ వివరాలిలా..
సాక్షి: జిల్లా అంతటా పర్యటించినట్లున్నారు?
ఎస్పీ: ఇంకా కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది.
సాక్షి: జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి?
ఎస్పీ: ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి.
సాక్షి: ఫ్యాక్షన్ గ్రామాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: గతంలో 81 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది. ప్రస్తుతం లేదు. అయినా గ్రామస్తులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాం. పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అదే విధంగా సీసీఎస్‌ను పటిష్టపరిచి నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అణచివేస్తాం.
సాక్షి: బహిరంగ ప్రదేశాల్లో కొందరు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. చుట్టుపక్కల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు?
ఎస్పీ: ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు స్పందించి నా దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా సీసీఎస్‌ను అలర్ట్ చేశాం.
సాక్షి: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టాం. వాహనదారులు, ఆటోవాలాలకు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయంచాం.
సాక్షి: మావోల కదలికలు ఎలా ఉన్నాయి?
ఎస్పీ: జిల్లాలో మావోల కదలికలు లేవు. అయినా ప్రత్యేక నిఘా పెట్టాం.
సాక్షి: సాయిఈశ్వరుడి హత్య కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?
ఎస్పీ: ప్రత్యేక టీ మ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలో సాయి ఈశ్వరుడిని హత్య కేసులో నిందితులను పట్టుకుంటాం.
సాక్షి: మీపై ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?
ఎస్పీ: అలాంటివేమీ లేవు.