సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. అనువైన నగరాన్ని గుర్తించేందుకు శివరామకృష్ణన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ఇటీవలే సీమ ముఖద్వారమైన కర్నూలులోనూ పర్యటించింది.
నగరంలో విద్య, వైద్యం, రవాణా, నీటి వసతి, పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఆ కమిటీకి నివేదించారు. 1956కు ముందు ఆంధ్రరాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు కొనసాగింది. మూడేళ్లపాటు ఆ వైభవాన్ని అనుభవించి పెద్ద మనసుతో రాజధానిని త్యాగం చేసింది. ఈ గత చరిత్రతో పాటు ప్రస్తుతం జిల్లాలో లభిస్తున వనరులను పరిశీలిస్తే నిస్సంకోచంగా తిరిగి కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని నిపుణలు డిమాండ్ చేస్తున్నారు.
మెరుగైన రవాణ మార్గం
రాయలసీమకు ముఖద్వారం కావడంతో రోడ్డు, రైలు మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలూ ఉన్నాయి. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా స్థలం ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ గుర్తించింది. కర్నూలు నగరం నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు గంటల్లో చేరుకోవచ్చు.
హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే డోన్ రైల్వేజంక్షన్ ఉంది. ఇక్కడినుంచి కర్ణాటక, హైదరాబాద్‌కు రైళ్లు నడుస్తున్నాయి. కర్నూలు నగరం నుంచి సైతం పలు రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సరకు రవాణా ద్వారా గణనీయంగా ఆదాయం అర్జిస్తున్న డివిజన్ ఇది. కర్నూలు-నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకునేందుకు బస్సు మార్గం ఉంది. దీని ద్వారా కోస్తాను అనుసంధానించవచ్చు.
సాఫ్ట్‌వేర్ రంగానికి అనువైన ప్రాంతం..
జిల్లాలో సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి అనువైన ప్రదేశం. ఇక్కడ 40కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఈ తరుణంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యకలాపాలు సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వ్యవసాయానికి నెలవు ..
ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ధాన్యాగారంగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో మన జిల్లా ఒకటి. ఏటా ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నారు. కర్నూలు సోనాకు ఓ ప్రత్యేకత ఉంది.
రాజధానికి కర్నూలు అనుకూలం
Published Fri, Aug 15 2014 2:32 AM | Last Updated on Sat, Aug 11 2018 5:53 PM
Advertisement
Advertisement