Navyandhrapradesh
-
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏఎన్‌యూ : అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. నవనిర్మాణాత్సోవాల్లో భాగంగా శనివారం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఆధ్వర్యంలో అశాస్త్రీయ - విభజన- రెండేళ్లలో రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. కార్యక్రమానికి వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్‌పాల్, ప్రిన్సిపాల్ సిద్ధయ్య, దూరవిద్య పరీక్షల కో-ఆర్డినేటర్ వేదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కమలంలో ‘కుల’కలం
బీజేపీ అధ్యక్ష పదవి కోసం పరాకాష్టకు చేరిన వర్గపోరు నేతల కుమ్ములాటలతో పార్టీ శ్రేణులకు ఎసరు సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖలో కుల సమీకరణలు, గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. అధ్యక్ష పదవి కోసం నాయకులు వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలకు తెరలేపారు. తాము సిఫార్సు చేసిన వ్యక్తినే అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని పట్టుబడుతున్నారు. లెక్కకు మించిన నేతల వర్గ రాజకీయాలతో బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో అర్బన్ జిల్లా శాఖలతో కలిపి భారతీయ జనతా పార్టీకి 17 జిల్లా శాఖలు ఉన్నాయి. వీటిలో రాజధాని నేపథ్యంతో కృష్ణా జిల్లా, నేతల వర్గ పోరు కారణంగా పశ్చిమగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లా శాఖల్లోనూ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి ఏపీలో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా సభ్యత్వ నమోదు చేయించిన‘పశ్చిమ’లో అన్నింటి కంటే ముందే అధ్యక్ష పదవి భర్తీ పూర్తి కావాలి. సంస్థాగత ఎన్నికల ప్రకియను కూడా మిగిలిన జిల్లాల కంటే ముందుగానే పూర్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు మార్గం సుగమమైందనుకున్న సమయంలో నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు. ఎంపీది ఓదారి.. మంత్రిది మరో దారి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మొదట్లో తన సోదరుడినే జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించారు. కార్యకర్తల నుంచి అంత సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన వ్యూహాత్మకంగా దళిత నేత బుంగా సారథి పేరును తెరపైకి తీసుకువచ్చారు. గతంలో బీజేపీలో పనిచేసి బయటకు వెళ్లి కాంగ్రెస్, పీఆర్పీల్లో పనిచేసిన సారథి అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీలోని రెండువ ర్గాలు సారధి పేరును ప్రతిపాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే దళిత నేతను కాదన్నారన్న ముద్ర పడకుండా ఎవరికి వారు తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఇదిలావుండగా, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. మిగిలిన జిల్లాల్లో ఎక్కడా తమ సామాజిక వర్గ నేతలకు జిల్లా అధ్యక్ష పదవి రాకపోవడంతో కనీసం పశ్చిమగోదావరి జిల్లాలోనైనా ఆ వర్గానికి అవకాశం ఇవ్వాలని మంత్రి గట్టిగానే వాదిస్తున్నారని చెబుతున్నారు. పాలకొల్లుకు చెందిన రావూరి సుధ పేరును మాణిక్యాలరావు ప్రతిపాదిస్తున్నారు. పార్టీలో మూడో గ్రూపుగా తయారైన బీజేపీ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మరోసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పీవీఎస్ వర్మ పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి అధ్యక్ష పదవి చేపట్టి ప్రస్తుతం క్వాయర్‌బోర్డు సభ్యుడిగా నామినేటెడ్ పదవిలో ఉన్న ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ మిగిలిన రెండు వర్గాలు వాదిస్తున్నాయి. ఇంతమంది నేతలు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి జిల్లాలో బీజేపీ నేతలు లెక్కకు మించి ఉన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావుతోపాటు తీరప్రాంత గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా జిల్లా నేతగానే కార్యకర్తలు భావిస్తుంటారు. కేంద్ర మాజీ మంత్రులు యూవీ కృష్ణంరాజు, కావూరి సాంబశివరావుతోపాటు డెల్టా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు అధినాయకత్వం వద్ద ఎంతోకొంత పట్టు ఉన్న వాళ్లే. ఇంతమంది నేతలు, రికార్డు స్థాయిలో కార్యకర్తలు ఉండి కూడా జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయలేని విచిత్రమైన పరిస్థితిని కమలనాథులు ఎదుర్కొంటున్నారు. కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలోగానైనా జిల్లా అధ్యక్ష పీఠం భర్తీ అవుతుందేమో చూడాలి. -
వ్యవసాయం ఏదీ?
కనీసం భరోసా కూడా కల్పించలేకపోయారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఇందులో కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులేవీ కేటాయించలేదు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా రైతులకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలేనని పదేపదే ప్రస్తావించారు. అటువంటి కరువు జిల్లాపై చంద్రబాబు ప్రభుత్వం కరుణించలేదు. నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా బనవాసిని గొర్రెలు, మేకలు, ఒంగోలు గిత్తల పరిశోధనా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదోని, ఆలూరు, నందికొట్కూరు పరిధిలో సాగవుతున్న పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని.. ఆలూరు ప్రాంతంలో జింకల పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్క దానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు. -
రాజధానికి కర్నూలు అనుకూలం
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. అనువైన నగరాన్ని గుర్తించేందుకు శివరామకృష్ణన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ఇటీవలే సీమ ముఖద్వారమైన కర్నూలులోనూ పర్యటించింది. నగరంలో విద్య, వైద్యం, రవాణా, నీటి వసతి, పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఆ కమిటీకి నివేదించారు. 1956కు ముందు ఆంధ్రరాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు కొనసాగింది. మూడేళ్లపాటు ఆ వైభవాన్ని అనుభవించి పెద్ద మనసుతో రాజధానిని త్యాగం చేసింది. ఈ గత చరిత్రతో పాటు ప్రస్తుతం జిల్లాలో లభిస్తున వనరులను పరిశీలిస్తే నిస్సంకోచంగా తిరిగి కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని నిపుణలు డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన రవాణ మార్గం రాయలసీమకు ముఖద్వారం కావడంతో రోడ్డు, రైలు మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలూ ఉన్నాయి. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా స్థలం ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ గుర్తించింది. కర్నూలు నగరం నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే డోన్ రైల్వేజంక్షన్ ఉంది. ఇక్కడినుంచి కర్ణాటక, హైదరాబాద్‌కు రైళ్లు నడుస్తున్నాయి. కర్నూలు నగరం నుంచి సైతం పలు రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సరకు రవాణా ద్వారా గణనీయంగా ఆదాయం అర్జిస్తున్న డివిజన్ ఇది. కర్నూలు-నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకునేందుకు బస్సు మార్గం ఉంది. దీని ద్వారా కోస్తాను అనుసంధానించవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి అనువైన ప్రాంతం.. జిల్లాలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి అనువైన ప్రదేశం. ఇక్కడ 40కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యకలాపాలు సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయానికి నెలవు .. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ధాన్యాగారంగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో మన జిల్లా ఒకటి. ఏటా ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నారు. కర్నూలు సోనాకు ఓ ప్రత్యేకత ఉంది. -
రాజధానిగా కర్నూలే అనుకూలం
కర్నూలు(కలెక్టరేట్): నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కర్నూలు అన్నివిధాలా అనుకూలమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ మేరకు జిల్లా ప్రజానీకంతో పాటు ప్రజా సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు జిల్లాకు రానుండటంతో రాజధానిగా కర్నూలు ఏవిధంగా అనుకూలమో తెలియజెప్పేందుకు వివిధ వర్గాలు సన్నద్ధమయ్యాయి. కమిటీకి నేతృత్వం వహిస్తున్న శివరామకృష్ణన్‌తో పాటు సభ్యులు అరోమార్ రవి, జగన్‌షా, కె.టి.రవీంద్రన్, పరిశోధన సలహాదారు నితిన్.కె, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ డెరైక్టర్ తిమ్మారెడ్డి సోమవారం జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. 1956లో రాజధానిని త్యాగం చేసినందున ఇప్పుడు విధిగా కర్నూలునే తిరిగి రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్ ఉద్ధృతమవుతోంది. అప్పుడే పెద్ద మనుషుల ఒప్పందానికి విలువనిచ్చినట్లని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్న శివరామకృష్ణన్ కమిటీ.. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనుంది. కర్నూలే ఎందుకంటే... 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం మేరకే రాజధానిని ఎంపిక చేశారు. తెలంగాణ ప్రాంతంలో 1956లో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఎంపికైంది. విశాలాంధ్ర కోసం రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిని త్యాగం చేశారు. 1956కు ముందున్న రాష్ట్రమే తిరిగి ఏర్పడటంతో కర్నూలునే రాజధానిగా ఎంపిక చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రభుత్వ భూములు లేవు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే ప్రైవేట్ భూములను సేకరించాల్సి ఉంది. కొత్త భూసేకరణ చట్టంతో ఆ ప్రక్రియ అంత సులువు కాదని తెలుస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం రాజధాని ఎంపికకు అనుకూలమనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. రాజధాని నిర్మాణంలో కీలకమైన తాగునీటి వనరులు పుష్కలంగా ఉండటం. శ్రీశైలం ప్రాజెక్టు జిల్లాలోనే ఉండటం అదనపు బలం. కర్నూలు మీదుగా వివిధ రాష్ట్రాలను కలుపుతూ నాలుగులైన్ల జాతీయ రహదారులు ఉండటం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలను కలుపుతూ రైలు మార్గాలు. కర్నూలు, నంద్యాల, ఆదోనిల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా రైళ్లు. కర్నూలుకు అత్యంత సమీపంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణానికి అనువైన భూములు. ఇప్పటికే సంబంధిత అధికారుల పరిశీలన పూర్తి కావడం కలిసొచ్చే అంశం. పారిశ్రామికాభివృద్ధికి కర్నూలు అన్ని విధాలా అనుకూలం. జిల్లాలో ఐరన్ ఓర్ విస్తారంగా లభిస్తుంది. గ్రానైట్‌కు జిల్లా పెట్టింది పేరు. ముగ్గురాయి, సున్నపురాయి.. ఇలా అనేక ఖనిజాలకు నెలవు. తుగ్గలి, మద్దికెర తదితర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల పంటలు పండుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఖనిజ సంపద జిల్లాలో ఉంది. పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కర్నూలు జిల్లానే అన్ని రంగాల్లోను వెనుకబడి ఉంది. ఇంతవరకు జిల్లాలో చెప్పుకోదగిన విద్యాసంస్థ ఒక్కటీ లేదు. వెయ్యి మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు. వనరులు పుష్పలంగా ఉన్నా అభివృద్ధికి నోచుకోకపోవడం. -
నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి మంత్రులుగా పల్లె, పరిటాల
సాక్షి, అనంతపురం : నవ్యాంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబు కేబినెట్లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చోటు దక్కించుకున్నారు. ఆదివారం వీరు గుంటూరు- విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. పల్లె రఘునాథరెడ్డి ఉన్నత విద్యావంతుడు. చంద్రబాబుకు వీరవిధేయుడు. 1999 ఎన్నికల్లో అప్పటి నల్లమాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో విప్‌గానూ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఇక పరిటాల రవీంద్ర హత్యానంతరం 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో పెనుకొండ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి పరిటాల సునీత గెలుపొందారు. ఈమె 2009, 2014 ఎన్నికల్లోనూ రాప్తాడు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. సునీతకు కమ్మ సామాజికవర్గ కోటా కింద మంత్రి పదవి దక్కింది. పల్లె, పరిటాలకు మంత్రి వర్గంలో చోటు లభించడంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా.. మలి విడతలో బీసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.