నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి మంత్రులుగా పల్లె, పరిటాల
సాక్షి, అనంతపురం : నవ్యాంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబు కేబినెట్‌లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చోటు దక్కించుకున్నారు. ఆదివారం వీరు గుంటూరు- విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
పల్లె రఘునాథరెడ్డి ఉన్నత విద్యావంతుడు. చంద్రబాబుకు వీరవిధేయుడు. 1999 ఎన్నికల్లో అప్పటి నల్లమాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో విప్‌గానూ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఇక పరిటాల రవీంద్ర హత్యానంతరం 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో పెనుకొండ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి పరిటాల సునీత గెలుపొందారు. ఈమె 2009, 2014 ఎన్నికల్లోనూ రాప్తాడు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. సునీతకు కమ్మ సామాజికవర్గ కోటా కింద మంత్రి పదవి దక్కింది. పల్లె, పరిటాలకు మంత్రి వర్గంలో చోటు లభించడంతో ఆయా నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా.. మలి విడతలో బీసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.