కుటుంబానికి ఒక్క సీటే పేరుతో బాబు రాజకీయం
అదే సూత్రంతో జేసీ, పరిటాల, అయ్యన్నలకు చెక్
తమతోపాటు తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న ఆ కుటుంబాల సీనియర్లు
పనబాకకు కూడా చెప్పిందొకటి, చేసేదొకటి
ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటిస్తానని చంద్రబాబు పట్టు
కానీ, తన కుటుంబంలో మాత్రం నలుగురికి కేటాయింపు
తనతో సహా తన కుమారుడు, బావమరిది, బావమరిది అల్లుడికి సీట్లు
అలాగే, కింజరాపు కుటుంబంలోనూ ఇద్దరికి..
మాకో నిబంధన, చంద్రబాబుకో నిబంధనా అంటూ సీనియర్ల రుసరుస
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపు ఇచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
చంద్రబాబు తన కుటుంబంలో కావాల్సిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూలు పెడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో ముగ్గురికి సీట్లు ప్రకటించుకోగా, ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేశ్‌కు మంగళగిరి, తన బావమరిది–వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించుకున్నారు.
మరో సీటును లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కి ఎక్కడో ఒకచోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా నాలుగు సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు. అదేమంటే పొత్తుల్లో సీట్లు తగ్గిపోయాయని వంకలు చెబుతున్నా సొంత కుటుంబానికి నాలుగు సీట్లు ఎలా ఇచ్చుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు.
అయ్యన్నకు సీటు..కొడుక్కి మొండిచేయి..
అనకాపల్లి జిల్లాలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్‌కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ఒక దశలో తనకు కాకుండా తన కుమారుడికి సీటు ఇవ్వాలని అయ్యన్న గట్టిగా కోరినా ఆయన మాట పెడచెవిన పెట్టారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి కాపుకాసిన తమకు ఈ పరిస్థితి ఏమిటని ఆవేదనతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు నర్సీపట్నం సీటు ఇచ్చినా అయ్యన్న సంతృప్తిగా లేరు. తనకో నిబంధన, చంద్రబాబుకి మరో నిబంధనా అని అంటూ అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జేసీ బ్రదర్స్‌కి ఝలక్..
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా ఝలక్ ఇచ్చారు. జేసీ సోదరులు గత ఎన్నికల్లోనూ తాము పక్కకు తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపారు. అనంతపురం ఎంపీ స్థానంలో దివాకర్ కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ని పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో అలాగే సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటిచ్చి పవన్‌కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు.
పనబాక విషయంలోనూ గందరగోళమే..
మరోవైపు.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కుటుంబాన్నీ చంద్రబాబు గాల్లో పెట్టారు. పార్టీలో చేరే ముందు ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్యకు సీటిస్తామని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు ఏ విషయం తేల్చడంలేదు. ఆమెకు మొదట తిరుపతి ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం దానిపైన స్పష్టత ఇవ్వలేదు.
బీజేపీతో పొత్తు ఉంటే ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పనబాక కుటుంబం చంద్రబాబు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. దీన్నిబట్టి చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక సీటనే రూలును తన రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే తనకు అవసరమైన చోట మాత్రమే ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
పరిటాల కుటుంబానికి చెక్..
ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్‌కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికివ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కనపెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది.
ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవీ వర్తించవనేలా వ్యవహరిస్తుండడం సీనియర్లకు మింగుడుపడడంలేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్‌నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment