కర్నూలు(కలెక్టరేట్): నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కర్నూలు అన్నివిధాలా అనుకూలమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ మేరకు జిల్లా ప్రజానీకంతో పాటు ప్రజా సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు జిల్లాకు రానుండటంతో రాజధానిగా కర్నూలు ఏవిధంగా అనుకూలమో తెలియజెప్పేందుకు వివిధ వర్గాలు సన్నద్ధమయ్యాయి.
కమిటీకి నేతృత్వం వహిస్తున్న శివరామకృష్ణన్‌తో పాటు సభ్యులు అరోమార్ రవి, జగన్‌షా, కె.టి.రవీంద్రన్, పరిశోధన సలహాదారు నితిన్.కె, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ డెరైక్టర్ తిమ్మారెడ్డి సోమవారం జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. 1956లో రాజధానిని త్యాగం చేసినందున ఇప్పుడు విధిగా కర్నూలునే తిరిగి రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్ ఉద్ధృతమవుతోంది. అప్పుడే పెద్ద మనుషుల ఒప్పందానికి విలువనిచ్చినట్లని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్న శివరామకృష్ణన్ కమిటీ.. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనుంది.
కర్నూలే ఎందుకంటే...
1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం మేరకే రాజధానిని ఎంపిక చేశారు. తెలంగాణ ప్రాంతంలో 1956లో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఎంపికైంది. విశాలాంధ్ర కోసం రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిని త్యాగం చేశారు. 1956కు ముందున్న రాష్ట్రమే తిరిగి ఏర్పడటంతో కర్నూలునే రాజధానిగా ఎంపిక చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రభుత్వ భూములు లేవు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే ప్రైవేట్ భూములను సేకరించాల్సి ఉంది. కొత్త భూసేకరణ చట్టంతో ఆ ప్రక్రియ అంత సులువు కాదని తెలుస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం రాజధాని ఎంపికకు అనుకూలమనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
రాజధాని నిర్మాణంలో కీలకమైన తాగునీటి వనరులు పుష్కలంగా ఉండటం. శ్రీశైలం ప్రాజెక్టు జిల్లాలోనే ఉండటం అదనపు బలం.
కర్నూలు మీదుగా వివిధ రాష్ట్రాలను కలుపుతూ నాలుగులైన్ల జాతీయ రహదారులు ఉండటం.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలను కలుపుతూ రైలు మార్గాలు. కర్నూలు, నంద్యాల, ఆదోనిల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా రైళ్లు.
కర్నూలుకు అత్యంత సమీపంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణానికి అనువైన భూములు. ఇప్పటికే సంబంధిత అధికారుల పరిశీలన పూర్తి కావడం కలిసొచ్చే అంశం.
పారిశ్రామికాభివృద్ధికి కర్నూలు అన్ని విధాలా అనుకూలం. జిల్లాలో ఐరన్ ఓర్ విస్తారంగా లభిస్తుంది. గ్రానైట్‌కు జిల్లా పెట్టింది పేరు. ముగ్గురాయి, సున్నపురాయి.. ఇలా అనేక ఖనిజాలకు నెలవు. తుగ్గలి, మద్దికెర తదితర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల పంటలు పండుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఖనిజ సంపద జిల్లాలో ఉంది. పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు.
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కర్నూలు జిల్లానే అన్ని రంగాల్లోను వెనుకబడి ఉంది. ఇంతవరకు జిల్లాలో చెప్పుకోదగిన విద్యాసంస్థ ఒక్కటీ లేదు. వెయ్యి మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు. వనరులు పుష్పలంగా ఉన్నా అభివృద్ధికి నోచుకోకపోవడం.
రాజధానిగా కర్నూలే అనుకూలం
Published Mon, Jul 7 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement