సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర విభజనానంతరం నిర్వహిస్తున్న మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకలకు కర్నూలు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జెండా పండుగకు వేదికైన ఏపీఎస్పీ మైదానంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదిక ఎదుట ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహం.. ఇరువైపుల తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బుధవారం నిర్వహించిన మాక్ వేడుకలో పంద్రాగస్టు కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్ర డీజీపీ రాముడు, జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మొత్తం 14 కంటింజెంట్లను ప్రదర్శించారు. జెండావిష్కరణ అనంతరం అవార్డులు, గ్రూప్ ఫొటో సెషన్ సాఫీగా సాగింది. చరిత్రలో నిలిచిపోయేలా వేడుక నిర్వహణకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసి డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం వినియోగించిన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
కొండారెడ్డి బురుజు, తెలుగుతల్లి విగ్రహం, స్వామి వివేకానంద, దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకోనున్నారు.
డిప్యూటీ సీఎం, హైకోర్టు జడ్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు ఒక రోజు ముందుగానే కర్నూలుకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి బసకు ప్రభుత్వ అతిథిగృహం సిద్ధమైంది. సుమారు రూ.30 లక్షలతో పాత భవనానికి మరమ్మతులు చేపట్టారు. ముఖ్యులకు నగరంలోని ప్రధాన హోటళ్లలో బస ఏర్పాటు చేయగా, మరికొందరికి ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతి కల్పించారు. ఇప్పటికే నగరం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అడుగడుగున గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
కోర్కెల చిట్టాతో తమ్ముళ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందుగానే కర్నూలుకు వస్తుండటంతో టీడీపీ నేతలు తమ కోర్కెల చిట్టాను ఆయన ముందుంచేందుకు సిద్ధమయ్యారు. నామినేటెడ్ పదవులు, పనులు, అధికారుల మార్పు తదితరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అమలులో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రజల్లో తిరిగేందుకు జంకే పరిస్థితి నెలకొంది.
తాత్కాలిక రాజధానిగా విజయవాడ తెరపైకి రావడంతో కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ ఇక్కడ ఉద్ధృతమవడం నేతలను కలవరపరుస్తోంది. వీటిపై అధినేత ఎలా స్పందిస్తారోనని తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్‌తో ఉద్యమకారులు, విద్యార్థులు సీఎంను కలిసే అవకాశం ఉంది.
వెలుగు..జిలుగులు
Published Thu, Aug 14 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement