సాయం కొందరికే..
పంపిణీలో ‘పచ్చ’ముద్ర
కొరవడిన నిఘా..
లోపించిన పర్యవేక్షణ
రేషను జోలికిపోని మధ్యతరగతి
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునే లక్ష్యంతో పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోని రీతిలో అంది వచ్చి న అవకాశాన్ని కొందరు సొమ్ముచేసు కుంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొరవడిన నిఘా..పర్యవేక్షణాలోపాలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. నగరంలో 4 లక్షల 80 వేల కుటుం టబాలున్నాయి. 3లక్షల93వేల తెల్లకార్డులుంటే, లక్షా76వేల గులాబీ కార్డులున్నాయి. మరో లక్ష కుటుంబాలకు ఎలాంటికార్డుల్లేవని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే ఆరులక్షల కుటుంబాలున్నట్టు అంచనా. వీరిలో ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఐదు లక్షల మంది వరకు ఉంటే..మధ్య తరగతి ప్రజలు కనీసం ఏడులక్షల మంది వరకు ఉంటారని అంచనా. మిగిలిన 13 లక్షల మంది అల్పాదాయవర్గాలకు చెందిన వారే. మామూలురోజుల్లో క్రమం తప్ప కుండా రేషన్ తీసుకునేది అల్పాదాయవర్గాల వారే. విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేది కూడా వీరే. విద్య, వైద్యం కోసం తెల్లకార్డులు తీసుకున్న మధ్యతరగతి ప్రజల్లో కూడా రేషన్ షాపులకెళ్లేది 10 శాతం లోపే ఉంటారు. ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల వారైతే ఏనాడు రేషన్ షాపుల తలుపుతట్టేదే ఉండదు. హుదూద్ బాధితులకు కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతీ కుటుంబానికి ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
సిఫార్సు లేఖలతో సరకుల పక్కదారి : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో టన్నుల కొద్దీ సరకులు పక్కదారి పట్టిస్తున్న తెలుగు తమ్ముళ్లు కొంత మంది డీలర్ల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరొకపక్క బియ్యం కుటుంబానికి 25కేజీలు పంపిణీ చేయాల్సి ఉండగా..కొన్నిచోట్ల కేజీ నుంచి ఐదు కేజీల వరకు తక్కువగా పంపిణీ జరిగింది. ఇలా టన్నుకు 100 నుంచి 200 కేజీల వరకు పక్కదారి పట్టిస్తున్నట్టు చెబుతున్నారు. గుం టూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదులక్షల గుడ్లు, 17 టన్నుల ఉల్లిపాయలు నగరానికి తరలించారు. ఈ లారీలన్నీ వచ్చిన రెండు గంటల్లోనే ఎలా మాయమై పోయాయో అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. నెక్ మరో 3లక్షల గుడ్లు బాధితుల కోసం తరలించింది. ఇవి కూడా ఏమైయైపోయాయో తెలియదు. ఇప్పటి వరకు ఇలా పక్కదారి పట్టిన సరుకుల విలువ రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సాయానికి దూరంగా లక్ష కుటుంబాలు
ఈ సాయం అందుకునేందుకు క్యూ కడుతున్న వారు ఎక్కువగా అల్పాదాయ వర్గీయులే. మధ్యతరగతిలో చాలామటుకు రేషన్‌షాపుల జోలికి వెళ్లని పరిస్థితి కనిపించింది. ఏడులక్షలకుపైగా ఉన్న మధ్య తరగతి వాసుల్లో సరుకులు తీసుకున్నదీ నాలుగులక్షల్లోపే ఉంటారు. అపార్టుమెంట్లలో నివసించే వారిలో 50 శాతం మందికికూడా సరుకులు తీసుకోలేదు. అంటే 8లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిత్యావసరాలు తీసుకునేందుకు దూరంగా ఉన్నట్టే. ఇలా సాయం అందుకోని కుటుంబాలు రెండు లక్షల వరకు ఉంటాయి. పోనీ అంతకాకున్నా కనీసం లక్ష కుటుంబాలైనా ఈసాయం అందుకోని వారి జాబితాలో ఉంటాయనడంలో సందేహమేలేదు. మంగళవారం వరకు ఐదులక్షల కుటుంబాలకు పైగా సాయం అందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన నిత్యావసరాలు పూర్తిగా పక్కదారి పట్టినట్టే అంచనా వేయొచ్చు. ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే తీసుకున్న వారే చాలా మంది మరలా మరలా తీసుకున్నారని చెబుతున్నారు.