జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగు పరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? అధికార ప్రతి పక్షాలు రెండూ తమవైన వివరణలను జోడించి చేసిన 85 శాతం–15 శాతం ప్రచారాన్ని ఓటర్లు ఎలా తీసుకున్నారు? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?
ఇలాంటి ప్రశ్నలకు ఓ రెండ్రోజుల్లో సమాధానం లభిస్తుంది.జూన్ 4న వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల లెక్కల్లో బీజేపీ 303 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు. లేదా దాని స్థానాలు 272 నుంచి 303 మధ్య ఉండవచ్చు. లేదా మెజారిటీ మార్కు కంటే తక్కువగా ఉండవచ్చు. వీటి గురించి ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. అయితే నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు మనకు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఆ ఫలితాలను పరిశీలించండి.
గత దశాబ్దం గురించిన స్పష్టమైన మొదటి పరికల్పనను ఇక్కడ చూద్దాం. నరేంద్ర మోదీ రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రతి ఎన్నికా స్థానిక, జాతీయ సమతూకంతో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల పంపిణీ, ఎడతెగని జాతీయ సందేశపు ప్రదర్శనతో మోదీ జాతీయతను, స్థానికతను అనుసంధానించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రతికూలతలను పూడ్చడానికి మోదీ ప్రజాదరణ సరిపోయింది. మరోవైపున ఓటర్లు కూడా తమ శాసనసభా కార్యకలాపానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే అంశానికన్నా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనేదానికి ప్రాధాన్యతను ఇచ్చారు.
2024 తీర్పు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో, కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లను మోదీ ఆకర్షిస్తున్నారా, లేదా? బీజేపీ అభ్యర్థి స్వభావం లేదా కుల సమీకరణలు లేదా ఆర్థిక ఆందోళన నుండి ఉత్పన్నమయ్యే స్థానిక బలహీనతలను పూడ్చడానికి మోదీ ఇమేజ్ సరిపోతుందా? ఓటర్లు భారత ప్రభుత్వ అధికారంలో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారా లేక బలమైన తనిఖీలతో 1989–2014 మధ్యకాలపు తరహా ఏర్పాటు తిరిగి రావాలని కోరుకుంటున్నారా?
ఇక రెండో పరికల్పన హిందూ మత–రాజకీయ గుర్తింపునకు పెరుగుతున్న భావన గురించి. దీన్ని బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే పెంచి పోషించింది. హిందూ మత గుర్తింపునకు సంబంధించిన రాజకీయ ప్రకటనకు ప్రభుత్వ మద్దతు ఉంది. కల్పిత మనోవేదనల సమాహారం ద్వారా ముస్లింలను ఇతరులుగా మార్చే భావన మరొకటి. వెనుకబడిన, దళిత ఉప సమూహాలకు సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం ద్వారా సమ్మిళిత హిందూ గుర్తింపును నిర్మించడం కూడా దీని వెనుక ఉంది. అయోధ్యలో లేదా కశ్మీర్‌లో లేదా దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక అన్యాయాల ‘సవరణ’ ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే, వారు ముస్లిం ఓట్లను అసంగతం చేయగలరనీ, ముస్లిం ప్రాతినిధ్యాన్ని చాలావరకు తగ్గించగలరనీ చూపించడానికి ఒక ఎన్నికల నమూనా కూడా దీని వెనుక ఉంది.
కులాలకు అతీతంగా హిందుత్వ సామాజిక గాఢత కనబడటం, ‘లౌకికవాదం’ ప్రతిధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) మద్దతు వంటివి తనకు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది. బీజేపీ తరహా రాజకీయ మతపరమైన గుర్తింపును సవాలు చేసే కథనం తన దగ్గర లేకపోవడంతో కుల గణన, మరిన్ని రిజర్వేషన్లు, అన్ని రంగాలలో అన్ని కుల సమూహాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని వాగ్దానం చేసింది. ఇది చారిత్రాత్మకం!
జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్... దేశాన్ని కుల సమూహాలు, మతాలు, జాతుల మొత్తంగా కాకుండా హక్కులతో కూడిన, వ్యక్తిగత పౌరులతో కూడిన ఒక పెద్ద సమూహంగా భావించింది. మౌలికమైన అస్తిత్వ ఆధారిత విధానాల కంటే సామాజిక ప్రయోజనాలను సమతుల్యం చేసే క్రమానుగతమైన మార్పును విశ్వసించింది. ఈ రెండు అంశాలకు సంబంధించినంతవరకూ నెహ్రూ పార్టీని రాహుల్ గాంధీ భారత రాజకీయాలను సామ్యవాద స్రవంతి వైపు తిరిగి మళ్లించారు. పైగా కమ్యూనిస్ట్ స్రవంతి నుండి అరువు తెచ్చుకున్న బలమైన పెట్టుబడిదారీ వ్యతిరేక వైఖరిని దానికి జోడించారు.
హిందూ గొడుగులోని సంకీర్ణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్షాలు ఎన్నికలను 85%–15% యుద్ధంగా మలిచాయి. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 15 శాతం అంటే ‘ఇతరులైన’ ఉన్నత కులాలు. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఉద్దేశించినట్లు అది తప్పుగా పేర్కొంది. మరోవైపున తన సొంత హిందూ సామాజిక సంకీర్ణాన్ని కొనసాగించడానికి, బీజేపీ ఈ ఎన్నికలను 85% వర్సెస్ 15% యుద్ధంగా రూపొందించింది. ఇక్కడ 15 శాతం అంటే ‘ఇతరులైన’ ముస్లింలు ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది.
అట్టడుగు హిందువుల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఉద్దేశించినట్లు బీజేపీ తప్పుగా ఆరోపించింది. అన్ని ప్రశ్నల పరంపరకు ఈ ఎన్నికల తీర్పు సమాధానం ఇస్తుంది. ఏకీకృత హిందూ రాజకీయ గుర్తింపునకు చెందిన ఆలోచన భౌగోళికంగా దక్షిణాదిలో కూడా విస్తరించి, సామాజికంగా దళితులు, గిరిజనులలో లోతుగా పాతుకుపోయిందా? రిజర్వేషన్ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి ఈ తీర్పు పార్టీలను ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తుంది?
మూడవ పరికల్పన రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి. మోదీ నమూనా మౌలిక సదుపాయాలలో తయారీపై, పెట్టుబడులు పెంచడంపై ఆధారపడినది. ప్రైవేట్ వ్యవస్థాపకతను ముందుకు తీసుకుపోవడానికి డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను ఉపయోగించడం; ఆర్థిక మార్కెట్లను విస్తరించడం; పరపతిని సరళీకరించడం; ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం; సేవలలో భారతదేశ బలాన్ని పెంచడం; నగదు, గృహాలు, నీరు, ఆహారం, విద్యుత్, వంటగ్యాస్ వంటి వాటిని అందుకునే కోట్లాది మంది ప్రజలతో కూడిన సంక్షేమ వలయాన్ని సృష్టించడం ఈ నమూనాలో భాగం.
సంక్షేమం ఒక తరగతి లబ్ధిదారులను సృష్టించింది, గుర్తింపులు, ప్రాంతాల వ్యాప్తంగా మహిళా ఓటర్ల మద్దతును గెలవడానికి ఇవి మోదీకి సహాయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంపై ప్రజల్లో కోపం, బాధ పెరుగుతున్నాయని కూడా స్పష్టమైంది. గరిష్ఠంగా నగదు బదిలీలు, ప్రభుత్వ రంగ ఉపాధి, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రణాళికతో సహా మరింత సంక్షేమానికి ప్రతిపక్షాలు వాగ్దానం చేశాయి.
ప్రస్తుత పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికి లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడానికి సంక్షేమం ప్రేరేపణ కలిగించిందా? రాజకీయ–క్యాపిటల్ నెట్‌వర్క్‌పై ప్రజలకు ఆగ్రహం ఉందా? మహమ్మారి అనంతరం వివిధ రూపాల్లో దేశం కోలుకోవడం జరిగిందా?
ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?తమను ఎవరు నడిపించాలనుకుంటున్నారు, తమను ఎలా నిర్వచించాలనుకుంటున్నారు, తమ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వారు ఎవరిని విశ్వసిస్తారు అనే కీలకాంశాలను రెండ్రోజుల్లో ఓటర్లు ప్రకటిస్తారు. ఇది 2024కి సంబంధించిన అసలైన కథ.
- వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-ప్రశాంత్ ఝా
Comments
Please login to add a commentAdd a comment