ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర బడ్జెట్‌పై సెటైర్లు వేశారు. ఇంగ్లాండ్ తరహాలో భారతీయులు ట్యాక్స్‌లు కడుతుంటే సర్వీసులు మాత్రం సోమాలియా తరహాలో ఉన్నాయని మండిపడ్డారు.
రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, బీజేపీ మద్దతు దారులు, ఓటర్లతో సహా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజల్ని సంతృప్తి పరచడంలో విఫలమైందని పేర్కొన్నారు.
సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, సమాజంలోని కొన్ని వర్గాలు సంతోషంగా, మరికొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేయడం సర్వసాధారణం. అయితే ఈసారి కేంద్రం అన్నీ వర్గాల వారిని అసంతృప్తికి గురి చేసింది. అందులో బీజేపీ మద్దతు దారులు సైతం ఉన్నారని తెలిపారు.
అదే సమయంలో కేంద్ర వసూలు చేస్తున్న ట్యాక్స్‌లపై మండిపడ్డారు. గత పదేళ్లుగా ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వంటి పన్నులు విధించి ప్రజల ఆదాయంలో 70-80 శాతం మొత్తాన్ని తీసుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా కేంద్రం ప్రజలకు ఎలాంటి ప్రయోజనాల్ని అందిస్తోంది? అని ప్రశ్నించారు.
ట్యాక్స్ కడుతున్నందుకు ప్రజలకు ఎలాంటి సేవల్ని అందిస్తున్నారని ప్రశ్నించిన చద్దా.. మేము ఇంగ్లండ్‌లో లాగా పన్నులు చెల్లిస్తాము, కానీ సోమాలియాలో సేవలను పొందుతున్నాము. ప్రభుత్వం మాకు ఎలాంటి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, రవాణా విద్యను అందిస్తోంది? అని విమర్శలు గుప్పించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై స్పందించిన ఆప్ ఎంపీ.. 2019లో బీజేపీ ప్రభుత్వానికి 303 సీట్లు వచ్చాయి. అయితే దేశ ప్రజలు ఆ సీట్లపై 18 శాతం జీఎస్టీ విధించి వాటిని 240కి తగ్గించారని ఎద్దేవా చేశారు.
బీజేపీ సీట్ల సంఖ్య తగ్గడానికి ఆర్థిక వ్యవస్థతో పాటు ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తలసరి ఆదాయం వంటి అనేక ఇతర కారణాలను పేర్కొన్నారు. ఈ పోకడలు కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 120 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment