Happy Birthday Shivaji Raja: ‘‘కరోనా సమయంలో నా శక్తికి మించి చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడా దక్కలేదు. ‘శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి, పేద కళాకారులకు సేవ చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు శివాజీ రాజా అన్నారు. నేడు (శనివారం) ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు శివాజీ రాజు.. కానీ ఒకరోజు ఏచూరిగారు ‘శివాజీ రాజా’ పేరు బాగుంటుందని చెప్పడంతో అప్పటి నుంచి మీడియాలో నా పేరు మారిపోయింది.
1985 ఫిబ్రవరి 24న చెన్నైలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎం.వి. రఘు దర్శకత్వం వహించిన ‘కళ్ళు’ నా తొలి సినిమా. ఆ మూవీ ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన 37 ఏళ్లలో దాదాపు 500 సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది. పునీత్ రాజ్‌కుమార్‌గారు చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి.. అంతకంటే మంచితనం ఇంకేముంది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాను (అధ్యక్షుడిగా కూడా). నేను హీరోగా చేసిన ఏ సినిమా నాకు సక్సెస్ ఇవ్వలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన చిత్రాలకు, సీరియల్స్‌కు నంది అవార్డులు వచ్చాయి.
నా ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులను ప్రోత్సహిస్తా. నేను మొదటి నుంచి చిరంజీవిగారి అభిమానినే. ఈ తరం హీరోల్లో అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ప్రభాస్‌లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. నాకు వ్యవసాయం చేయడం ఇష్టం. మణికొండలో ఉన్న స్థలంలో, మొయినాబాద్‌లోని పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లో మా అబ్బాయి (విజయ్ రాజా)తో ‘కళ్ళు’ సినిమా రీమేక్ చేయాలని ఉంది. ప్రస్తుతం తను ఓ హిందీ, మూడు నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు బాగుంది. కొన్ని సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment