
తెలుగు హీరో మంచు మనోజ్ నేడు(మే 20)న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బర్త్‌డే రోజు పార్టీలు, సెలబ్రేషన్స్‌ను పక్కన పెట్టిన మనోజ్ తన మానవత్వాన్ని చాటుతూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖను రిలీజ్ చేశాడు. పుట్టినరోజును పురస్కరించుకుని కోవిడ్ వల్ల ప్రభావితం అయిన 25 వేల కుటుంబాలను ఆదుకోనున్నట్లు వెల్లడించాడు.
"ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కరోనా వైరస్ వల్ల ప్రభావితం అయిన వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను. ముందుగా మన ప్రాణాల్ని కాపాడటానికి వాళ్ల ప్రాణాలని, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరినీ కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ సానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి.
నా వంతుగా ఈ పుట్టినరోజున నేను నా అభిమానులు, మిత్రులు కలిసి కోవిడ్ వల్ల ప్రభావితం అయిన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం" అని రాసుకొచ్చాడు. కాగా మంచు మనోజ్ ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' సినిమా చేస్తున్నాడు. దీనికి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
Love you all and thanks for all the advanced Birthday Wishes 🙏🏻❤️ #StayHomeStaySafe pic.twitter.com/6sttpRXpUO
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 19, 2021