
నిల్వ పరిమితులపై కఠిన ఆంక్షలు
న్యూఢిల్లీ: గోధుమల ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ట్రేడర్లు, హోల్‌సేల్ వర్తకులు, బడా రిటైల్ మాల్స్ నిర్వాహకులకు గోధుల నిల్వలపై పరిమితులను కఠినతరం చేసింది. జూన్ 24న విధించిన నిల్వ పరిమితులను సవరించింది. ట్రేడర్లు, టోకు వర్తకులు 2,000 టన్నుల వరకే నిల్వ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఇది 3,000 టన్నులుగా ఉంది.
3 బడా రిటైల్ చైన్‌లు ప్రతి ఔట్‌లెట్ (స్టోర్)లో 10 మెట్రిక్ టన్నుల వరకే గోధుమల నిల్వలకు పరిమితం కావాల్సి ఉంటుంది. డిపోలో స్టోర్ సంఖ్యకు 10 రెట్లకు మించి ఉండరాదు. గతంలో స్టోర్‌వారీ పరిమితుల్లేవు. అదే గోధుమ ప్రాసెసర్లు అయితే నెలవారీ స్థాపిత సామర్థ్యంలో ఇప్పటి వరకు 70 శాతం వరకు నిల్వలు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటే, దీనిని 60 శాతానికి తగ్గించింది. విడిగా రిటైల్ స్టోర్లు అయితే 10 టన్నుల గోధుమలు నిల్వ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది.
ఉల్లిగడ్డలు, బాస్మతీ ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిగడ్డలు, బాస్మతీ బియ్యం ఎగుమతులకు సంబంధించి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర రైతులు ఎక్కువగా ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. హర్యానా, పంజాబ్‌లో బాస్మతీ సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. బాస్మరీ బియ్యం ఎగుమతికి టన్నుకు కనీసం 950 డాలర్ల ధర పరిమితిని తొలగించింది. అలాగే, టన్ను ఉల్లిగడ్డలపై 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను కూడా తొలగించినట్టు డైరెక్టరేట్ నరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎగుమతుల వృద్దికి, రైతుల ఆదాయం మెరుగుపడేందుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment