కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
సీఏక్యూఎం చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం
పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపై మండిపాటు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది.
చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు.
సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment