పొలాల్లో దహన ప్రాంతాలను ఇస్రో చూపిస్తున్నా మీరు పట్టించుకోరా?
కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం
దహనాలను అడ్డుకోని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది.
విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు.
కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్
కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు.
కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు
‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు.
సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment