రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీ | SC asks Centre to frame model policy on menstrual leave for women | Sakshi
Sakshi News home page

రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీ

Published Tue, Jul 9 2024 6:16 AM | Last Updated on Tue, Jul 9 2024 11:49 AM

SC asks Centre to frame model policy on menstrual leave for women

రాష్ట్రాలు, భాగస్వామ్యపక్షాలతో సంప్రదించండి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. 

దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్‌ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. 

ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్‌ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement