Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు? | Supreme Court Directs Govt To Frame Model Policy On Menstrual Leave, Complete Details Inside | Sakshi
Sakshi News home page

Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?

Published Thu, Jul 11 2024 1:11 AM | Last Updated on Thu, Jul 11 2024 3:56 PM

Menstrual Leave: SC Directs Govt to Frame Model Policy

చర్చ

ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్‌  ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో  ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన  పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని  ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?

సుజన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.

మేరీ ప్రైమరీ స్కూల్‌ టీచర్‌. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్‌గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.

కరుణ బట్టల షోరూమ్‌లో పనిచేస్తోంది. రోజంతా షాప్‌లో నిల్చొనే ఉండాలి. సేల్‌ సీజన్‌ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్‌ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. 

నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్‌ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా?  నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.

అవసరం ఉన్నవారికే!
దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్‌ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్‌ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్‌లో ఉన్నవారు డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌తో లీవ్‌ తీసుకోవచ్చు. స్కూల్‌ టైమ్‌లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్‌లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్‌ తీసుకుంటే సరిపోతుంది. 
– మృణాళిని, టీచర్‌

ఉపయోగకరమైనదే! 
మహిళ ఇంటిని, ఆఫీస్‌ పనినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్‌ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్‌ చెకప్‌కి లీవ్‌ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్‌ అవకాశం ఉపయోగపడుతుంది. 
– డాక్టర్‌ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్‌

విశ్రాంతి అవసరమే!
మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్‌ లీవ్‌ తప్పనిసరి చేస్తేæ వర్క్‌లోడ్‌ పెరగడం, ప్రమోషన్స్‌పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్‌రూమ్‌లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్‌ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం.  పిరియడ్‌ లీవ్‌ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. 
– ఎస్‌.కె.బాజి, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

– నిర్మలా రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement