న్యూఢిల్లీ: ఓ మహిళా జడ్జికి గర్భస్రావం అయిన పరిస్థితిని కనీస పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుమోటోగా విచారణ జరుపుతోంది. అయితే..
ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఊరట దక్కని ఇద్దరు.. ఎంత విజ్ఞప్తి చేసినా ఉన్నత న్యాయస్థానం వినలేదు.
అయితే.. ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతోపాటు తన సోదరుడు క్యాన్సర్ బారినపడినట్లు హైకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ నాగరత్న, ఎన్‌కే సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మంగళవారం విచారణ జరిపింది.
‘‘ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంది. పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఏంటనేది తెలిసేది’’ అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో.. సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment