wholesale
-
గోధుమ ధరల పెరుగుదలకు చెక్!
న్యూఢిల్లీ: గోధుమల ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ట్రేడర్లు, హోల్‌సేల్ వర్తకులు, బడా రిటైల్ మాల్స్ నిర్వాహకులకు గోధుల నిల్వలపై పరిమితులను కఠినతరం చేసింది. జూన్ 24న విధించిన నిల్వ పరిమితులను సవరించింది. ట్రేడర్లు, టోకు వర్తకులు 2,000 టన్నుల వరకే నిల్వ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఇది 3,000 టన్నులుగా ఉంది.3 బడా రిటైల్ చైన్లు ప్రతి ఔట్లెట్ (స్టోర్)లో 10 మెట్రిక్ టన్నుల వరకే గోధుమల నిల్వలకు పరిమితం కావాల్సి ఉంటుంది. డిపోలో స్టోర్ సంఖ్యకు 10 రెట్లకు మించి ఉండరాదు. గతంలో స్టోర్‌వారీ పరిమితుల్లేవు. అదే గోధుమ ప్రాసెసర్లు అయితే నెలవారీ స్థాపిత సామర్థ్యంలో ఇప్పటి వరకు 70 శాతం వరకు నిల్వలు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటే, దీనిని 60 శాతానికి తగ్గించింది. విడిగా రిటైల్ స్టోర్లు అయితే 10 టన్నుల గోధుమలు నిల్వ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఉల్లిగడ్డలు, బాస్మతీ ఎగుమతులపై ఆంక్షల తొలగింపు ఉల్లిగడ్డలు, బాస్మతీ బియ్యం ఎగుమతులకు సంబంధించి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర రైతులు ఎక్కువగా ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. హర్యానా, పంజాబ్‌లో బాస్మతీ సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. బాస్మరీ బియ్యం ఎగుమతికి టన్నుకు కనీసం 950 డాలర్ల ధర పరిమితిని తొలగించింది. అలాగే, టన్ను ఉల్లిగడ్డలపై 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను కూడా తొలగించినట్టు డైరెక్టరేట్ నరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎగుమతుల వృద్దికి, రైతుల ఆదాయం మెరుగుపడేందుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
ఆగస్టులో నెమ్మదించిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి. → ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి. → త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి. ‘‘ఈ పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
రూ. 25కు కిలో ఉల్లి
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కలి్పంచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో రూ.25కే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు నిల్వలను 25 రూపాయల సబ్సిడీ ధరకే టోకు, రిటైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 22 రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో దుకాణాలు, వాహనాల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నారు. -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్‌యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్‌లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
అమ్మాజీ... కదిలించావు!
ఒక సిటీలో ఒక మహిళ రోడ్డు పక్కన ఎండలో కూర్చుని బఠాణీలు అమ్ముతోంది. ఈ దృశ్యం పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్ కంట్లో పడింది. ‘ఈ వయసులో ఎండలో కూర్చొని కష్టపడుతోంది’ అని జాలిపడి బేరం ఆడకుండా ఆమె దగ్గర ఉన్న బఠాణీల సంచులను హోల్‌సేల్‌గా కొనేశాడు. ఆమెతో సెల్ఫీ దిగి తన సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘అమ్మాజీకి సహాయపడినందుకు సంతోషంగా ఉంది’ అంటూ రాశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా యూజర్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ‘చాలా మంచి పనిచేశారు’ అని ప్రశంసిస్తే మరో వర్గం మాత్రం ‘చేసిన మంచి పని చెప్పుకోకూడదు. పబ్లిసిటీ ఎందుకు!’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు పవన్ కౌశిక్ ఇలా స్పందించాడు.. ‘నేను చేసింది చాలా చిన్న పని అనే విషయం, ఆ సహాయం వల్ల అమ్మాజీ జీవితం మారదనే విషయం నాకు తెలుసు. అయితే ఈ పని నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ -
సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కూల్
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 18 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. 10.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్లోకి వస్తువుల ధర 10.7 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది. సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు రికవరీ ఊపందుకోవడం కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు. గణాంకాల్లో కీలక విభాగాలు ఇలా... ► ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్ 22.29 శాతం. ఆయిల్ సీడ్స్ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది. ► ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది. -
ఐదు నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.54 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే 2021 అక్టోబర్‌లో టోకు బాస్కెట్ ఉత్పత్తుల ధర 12.54 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ధరల తీవ్రత ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల, సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత వంటి అంశాలు దీనికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ధరలన్నీ పైపైకి... ► మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, కెమికల్స్, రసాయన ఉత్పత్తుల వంటివి గతేడాది అక్టోబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలల్లో భారీగా పెరిగాయి. ► తయారీ రంగంలో సమీక్షా నెల్లో ద్రవ్యోల్బణం 12.04 శాతంకాగా, సెప్టెంబర్‌లో 11.41 శాతం. ► ఫ్యూయెల్ అండ్ పవర్ రంగాల్లో 2021 అక్టోబర్ ద్రవ్యోల్బణం 37.18 శాతం. సెప్టెంబర్‌లో 24.81 శాతం. ఒక్క క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 71.86% ఉంటే, అక్టోబర్‌లో ఏకంగా 80.57 శాతానికి ఎగసింది. ► ఆహార ధరల విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో 4.69 శాతం తగ్గాయి (2020 ఇదే నెలతో పోల్చి). అయితే అక్టోబర్‌లో ఈ తగ్గుదల కేవలం 1.69 శాతంగానే ఉంది. కూరగాయల ధరల తగ్గుదల 18.49 శాతం ఉంటే, ఉల్లి విషయంలో తగ్గిన శాతం 25.01 శాతం అని గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచీ రెండంకెల్లోనే... టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగడం ఏప్రిల్ నుంచీ ఇది వరుసగా ఏడవనెల.అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్– 2022 మార్చి) ఇప్పటి వరకూ ఒక అంకెలో టోకు ద్రవ్యోల్బణం లేదన్నమాట. టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ ఏప్రిల్ (10.74%), మే (13.11%) జూన్ (12.07%), జూలై (11.16%), ఆగస్టు (11.39%) నెలల్లో రెండంకెల పైనే కొనసాగింది. సెప్టెంబర్‌లో 10.66%గా నమోదుకాగా, తాజాగా అక్టోబర్‌లో 12.54%గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్ ఎఫెక్ట్ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఉదాహరణకు 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 1.31 శాతం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల దిగువ బాట నుంచి ‘యూ టర్న్’ తీసుకుని అక్టోబర్‌లో 4.48 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. -
రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం ఎంఎస్ఎంఈ పరిధిలోకి: గడ్కరీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను కూడా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రంగం పరిధిలోకి చేరుస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. దీంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో 2.5 కోట్లపైగా రిటైల్, హోల్‌సేల్ ట్రేడర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తిం చే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే... వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు ► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది. ► మొత్తంగా...: 2018 డిసెంబర్లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం. ► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం. ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది. ► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%. రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్.. ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది. -
గుండెపోటుతో హోల్‌సేల్ వ్యాపారి మృతి
వసూళ్ల కోసం హైదరాబాద్ నుంచి రాక lభార్య ఫోన్‌తో లాడ్జి గది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బంధువులు lరూ.2,72,710 సొమ్ము లభ్యం రాజమహేంద్రవరం క్రైం : స్థానిక త్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో హైదరాబాద్‌కు చెందిన ప్లాస్టిక్ హోల్‌సేల్ వ్యాపారి గుండెపోటుతో మృతి చెందారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన వ్యాపారి బీకే బన్సలి (62) రాజమహేంద్రవరంలో కొందరు వ్యాపారులకు ప్లాస్టిక్ వస్తువులు సరఫరా చేస్తుంటారు. వారి నుంచి నగదు వసూలు చేసుకునే నిమిత్తం మంగళవారం రాజమహేంద్రవరం చేరుకొని నల్లమందు సందులో ఉన్న గణేష్ రెసిడెన్సీలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. కొందరి వద్ద నుంచి నగదు వసూలు చేసుకుని రాత్రి లాడ్జికి తిరిగి వచ్చి నిద్రపోయారు. నిద్రలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బన్సలి భార్య ఉదయం ఫో¯ŒS చేయగా ఎంతకీ తీయకపోవడంతో రాజమహేంద్రవరంలో ఉన్న తమ బంధువులకు సమాచారం అందించారు. వారు హోటల్‌కు వెళ్లి రూమ్ తలుపులు తెరిచే సరికి మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని వద్ద రూ 2,72,710లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు, ఇతర వస్తువులు ఉండడం, డోర్ లాక్ వేసి ఉండడం వల్ల గుండెపోటు వచ్చి మృతి చెం ది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుడ్డు.. రికార్డు!
అమాంతం పెరిగిన ధర కార్తీకం ముగియడంతోనే ధరకు రెక్కలు కార్తీకం పుణ్యాన నెల్నాళ్లు ఒదిగి ఉన్న గుడ్డు పుణ్యకాలం పూర్తి కాగానే విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో గుడ్డు చిల్లర ధర రూ.5కు పెరిగింది. గత 15 రోజుల్లోనే 49 పైసల పెరుగుదల నమోదు కావడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులే అంటున్నారు. విశాఖపట్నం : కార్తీకమాసం ముగిసీ ముగియగానే కోడి గుడ్డు ధర కొండెక్కేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. కూరగాయల ధరలు ఆకాశంలో విహరిస్తున్న సమయంలో కోడిగుడ్డే సామాన్యులను ఆదుకుంది. దాదాపు మూడు నెలల పాటు అందుబాటులో ఉన్న గుడ్డు ఇప్పుడు భారమవుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో వంద గుడ్ల ధర రూ. 405లకు చేరింది. రిటైల్ మార్కెట్లో విడిగా రూ.5లకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ కంటే రిటైల్ ధర గుడ్డుకు గరిష్టంగా 50 పైసలు అధికంగా ఉంటుంది. కానీ అర్థ రూపాయికి కాలం చెల్లడంతో మధ్యలో బ్రేక్ లేకుండా వినియోగదారుడిపై ఏకంగా రూపాయి భారం పడుతోంది. పెరిగిన వాడకం నిజానికి కార్తీకమాసంలో పూజల సెంటిమెంట్‌తో మాంసాహారం వినియోగం బాగా తగ్గుతుంది. అందువల్ల వీటి అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయి. దీంతో ధరలు తగ్గించి విక్రయాలు జరపడంతో గుడ్డు అందరికీ అందుబాటులో ఉంటుంది. శనివారంతో కార్తీకమాసం పూర్తయింది. మరోవైపు చలికాలమూ మొదలైంది. మళ్లీ గుడ్ల వాడకం పెరుగుతుంది. అదే సమయంలో కోడిగుడ్లను ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చలి సీజనులో మామూలు రోజులకంటే అధికంగా తింటారు. ప్రస్తుతం ఒడిశా, బిహార్, పశ్చిమ బంగ, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి గుడ్ల ఎగుమతులు ఊపందుకుంటాయి. వీట న్నింటినీ ఆసరాగా చేసుకుని గుడ్ల ధరలు పెంచుతున్నారు. 15 రోజుల్లో 49 పైసలు పెరుగుదల గత నెల 14న వంద గుడ్ల ధర (హోల్‌సేల్) రూ.355, ఈనెల ఒకటిన రూ.356 ఉంది. అంటే ఆ పదిహేను రోజుల్లో కేవలం గుడ్డుపై ఒక్క పైసా మాత్రమే పెరిగింది. అప్పట్నుంచి రోజుకు మూడు నాలుగు పైసలు చొప్పున పెరుగుతూ ఆదివారం నాటికి రూ.400కు (గుడ్డు రూ.4.05లకు) చేరుకుంది. అంటే గుడ్డుపై 15 రోజుల వ్యవధిలో 49 పైసలు పెరిగిందన్న మాట! ఇప్పటిదాకా కోడిగుడ్డు ధర 2013 డిసెంబర్ 21న రూ.4.02 పైసలకు పెరగడమే రికార్డు. తాజా ధరతో అది చెరిగిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్తరాంధ్రలో 20 లక్షల గుడ్ల ఉత్పత్తి ఉత్తరాంధ్రలో రోజుకు వివిధ పౌల్ట్రీల నుంచి సుమారు 20 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో స్థానికంగా 60 శాతం గుడ్లు వినియోగమవుతాయి. మిగిలినవి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వినియోగం పెరగడంతో పాటు కోళ్ల దాణా ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం కూడా బాగా పెరిగినందున గుడ్ల ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. -
గుడ్డు వెక్కిరిస్తోంది..!
* రిటైల్ కోడి గుడ్డు ధర రూ.5 * హోల్‌సేల్‌గా వంద గుడ్ల ధర రూ.400 సాక్షి, హైదరాబాద్: గుడ్డు వచ్చి కోడిని వెక్కిరించిందంటే ఇదేనేమో..! బుధవారం హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లు రూ.396 పలికాయి. రవాణా చార్జీగా రూ.4 వసూలు చేస్తుండటంతో 100 గుడ్ల ధర రూ.400కు చేరింది. అంటే.. హోల్‌సేల్‌గానే ఒక్కో గుడ్డు రూ.4. చికెన్‌షాపుల వద్దకు వచ్చేసరికి రూ.4.50కి విక్రయిస్తున్నారు. వీరి వద్ద కొనుగోలు చేసే చిల్లర వ్యాపారులు ఒక్కో గుడ్డుకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌గా డజను కోడిగుడ్లు కొనాలంటే రూ.60 వెచ్చించాల్సి వస్తోంది. నిత్యం మెనూలో గుడ్డును వడ్డించే హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఇప్పుడు గుడ్డు భారంగా మారింది. ఇప్పటికిప్పుడు రేట్లు పెంచితే కస్టమర్లు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో తటపటాయిస్తున్నారు. దీంతో ప్రభు త్వ హాస్టళ్లు, ఆస్పత్రులు వంటివాటి మెనూలో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ధర పెరగడం వల్ల కోడి గుడ్ల విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. దాణా ధరల ప్రభావం.. కోళ్ల దాణా(ఫీడ్) ధర అనూహ్యంగా పెరగడం వ ల్లే కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. కోడిగుడ్లకు రాష్ట్రం ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతుల ఆర్డర్ల వల్ల కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. -
పడిలేస్తున్న టమాట
జిల్లాలో టమాట ధరలు నిలకడగా ఉండడం లేదు. ఒకసారి పూర్తిగా పడిపోతే మరోసారి భారీగా పెరుగుతోంది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. రైతు తను పండించిన టమాటాను మార్కెట్లో కిలో రూ.14కు (ప్రస్తుత ధర ప్రకారం) అమ్మి, రిటైల్ మార్కెట్లో రూ.24కు కొనాల్సి వస్తోంది. టమాట విస్తీర్ణం భారీగా పెరగడంతో ధరలు తగ్గాయన్న వాదన ఉంది. - పలమనేరు - మార్కెట్లో నిలకడ లేని ధరలు - హోల్‌సేల్‌కు, రిటైల్‌కు మధ్య వ్యత్యాసం - మూడేళ్లుగా భారీగా పెరిగిన సప్లయ్ రైతుకు మిగిలేది సున్నే.. గంగవరం మండలం కూర్నిపల్లెకు చెందిన వెంకటేష్ తన ఎకరా పొలంలో టమాట సాగు చేశాడు. దానికి సంబంధించి ఖర్చు లు ఇలా ఉన్నాయి. - భూమి దున్నకం, నర్సరీ నుంచి మొక్కల కొనుగోలు(ఎకరాకు 8వేల మొలకలు. మొలక రూ.50 పైసలు)కు రూ.5వేలు. - టమాటకు స్టిక్‌లు ఎకరాకు 1200. ఒకటి రూ.20 చొప్పున రూ.24వేలు - సేంద్రియ ఎరువు పదిలోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు రూ.27వేలు - క్రీమి సంహారక మందులు రూ.10 వేలు - కూలీల ఖర్చు రూ.15 వేలు. ఆ లెక్కన ఎకరాలో పంటసాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.81 వేలు. - ఎకరాకు మంచి దిగుబడి వస్తే వెయ్యి బాక్సులు (బాక్సు 14 కేజీ లు). ఈ ఏడాది సగటు ధర రూ.200. ఆ లెక్కన రూ.2 లక్షలు. - 20 కిలోమీటర్ల నుంచి టమాట బాక్సును మార్కెట్‌కు తరలిం చేందుకు రూ.5 నుంచి 10 - టమాట మండీలు రైతు నుంచి 10 శాతం కమీషన్ (రూ.20) వసూలు చేస్తున్నాయి. కోతకు రైతు వ్యక్తిగత ఖర్చు రూ.50. - ఓ బాక్సు కాయలు కోసేందుకు కూలీ ఖర్చు రూ.15. ఆ లెక్కన ఓ బాక్సు టమాట రవాణా, తదితరాల ఖర్చు ప్రస్తుత ధర ప్రకారం రూ.100. - వెయ్యి బాక్సులకు రూ.100 చొప్పున రూ.లక్ష ఖర్చు - పంట సాగుకు పెట్టిన ఖర్చు రూ.81వేలు, మార్కెటింగ్ తదితర ఖర్చులు రూ.లక్ష మొత్తం 1.81 లక్షలు. రైతు రాబడి రూ.2లక్షలు. రైతుకు మిగిలేది కేవలం 19వేలు మాత్రమే. దీనికోసం రైతు కుటుంబ సభ్యులంతా కష్టపడాల్సి ఉంటుంది. భారీగా పెరిగిన సప్లయ్.. ఐదేళ్ల క్రితం జిల్లాలో ఆరువేల హెక్టార్లలో టమాట సాగయ్యేది. మూడేళ్లుగా పెరిగిన నర్సరీలు, పంట విస్తీర్ణంతో ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఏడాదికి ఇక్కడ 4.80 లక్షల మెట్రిక్ టన్నుల టమాట ఉత్పత్తి అవుతోంది. సప్లయ్‌కు సరిపడా డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుముఖం పడుతోంది. పైగా కర్ణాటక, అనంతపురం జిల్లాల నుంచి సరుకు భారీగా ఇక్కడికొస్తోంది. దీని ప్రభావం ధర మీద పడుతోంది. ఆంధ్రలోని పలు జిల్లాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడులోని చెన్నై, రాణిపేట్, ఆర్కాడ్, నైవేలి, విరుదాచలం, కారైకూడి నుంచి వ్యాపారులొస్తున్నారు. ఆ ప్రాంతాల్లో లోకల్ టమాట ఉన్నపుడు వీరు ఇక్కడికి రాక ధరలు అమాంతం తగ్గుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు.. - డిమాండ్‌ను బట్టి టమాట సాగుచేసేలా చర్యలు - కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు - దళారులతో పనిలేకుండా డెరైక్ట్ మార్కెటింగ్ - రైతు బజార్ల పెంపు - మండల స్థాయిలో రైతుల కమిటీలు, నర్సరీల నియంత్రణ - టమాట పల్ప్, పికెల్, పౌడర్ యూనిట్ల ఏర్పాటు -
భలే గిరాఖీలు
సిద్దిపేట అర్బన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. ఆత్మీయ, అనుబంధాలకు ప్రతీతి.. రాఖీ. ఈ పండుగ రోజున ఆనందం అంబరమవుతుంది. ప్రతి ఇళ్లూ సంబరాలకు వేదికగా మారుతుంది. అందువల్లే పండుగకు రానురానూ ప్రాముఖ్యం ఏర్పడింది. అలాగే రాఖీలకూ డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చిన్న స్పాంజితో పాటు బంగారు రంగు కవర్‌పై ఓ ప్లాస్టిక్ బొమ్మ ఉండే రాఖీలు అందుబాటులో ఉండేవి. కానీ మారుతున్న కాలానుగుణంగా రాఖీల్లోనూ ఎన్నో వెరైటీలు వచ్చేశాయి. మరెన్నో రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. దారం, దూది రాఖీలు మొదలుకొని వెండి, బంగారు కోటింగ్ రాఖీల వరకు వచ్చేశాయి. సమారు ఆరువేల రకాల డిజైన్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కొనుగోలు దారుల ఆసక్తి మేరకు సిద్దిపేట పట్టణ వ్యాపారులు సుమారు ఎనిమిది రాష్ట్రాల నుంచి రాఖీలను దిగుమతి చేసి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు. రాఖీ డిజైన్లలోనూ మార్పులు గతంలో నెమలి ఈకలు, పైసల, నోట్ల, దూది, స్వస్తి, హంస బిల్లలు, పొట్టి బొమ్మలు, కవర్ రాఖీలు తదితర వెరైటీలు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వెరైటీ రాఖీలు అమ్ముడుపోయేవి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంత మాత్రంగా ఉండడం వల్ల వెరైటీ రాఖీలు ఖరీదు చేసేవారు కాదు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాల క్రితం వెండికోటింగ్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారుల్లో ఆసక్తి మేరకు వ్యాపారులు ఐదు సంవత్సరాల నుంచి పలు డిజైన్లలో రాఖీలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. సిద్దిపేట కేంద్రంగా... జిల్లాలో రాఖీల వ్యాపారం ఎక్కువగా సిద్దిపేట కేంద్రంగా సాగుతోంది. ప్రస్తుతం పట్టణంలో సుమారు ఆరు వేల రకాల డిజైన్లు అందుబాటులో ఉండి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. హోల్ సెల్ షాపులతో పాటు పట్టణంలో ప్రతి గల్లీలో రాఖీ విక్రయ కేంద్రాలు వెలిశాయి. రాఖీలతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భాల్లో అవసరమయ్యే బ్యాండ్లను కూడా దుకాణాల్లో అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం రాఖీ డిజైన్లలో స్టోన్స్ ఐటెమ్స్‌కు ఆదరణ పెరిగింది. రకరకాల స్టోన్లతో పొందుపర్చిన రాఖీలు, వాటి అల్లికలు ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, రాజ్‌కోట్, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, బరోడా, ముంబై, రాజ్‌పుర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పలు రకాల వెరైటీలను దిగుమతి చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వాటి ధరల్లో మార్పు అంతగా లేకపోవడంతో రాఖీలకు భలే గిరాకీ ఏర్పడింది. పట్టణం నుంచి కరీంనగర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక, నిజమాబాద్ తదితర ప్రాంతాలకు రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. రూ.1 మొదలు రూ.1000 వరకు వివిధ రకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం తయారు చేసిన చోటాభీమ్ రాఖీలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
భలే గిరాకీ
చేపల ధర కేజీ రూ.30 నుంచి రూ.150 వరకు పెరుగుదల సాక్షి, సిటీబ్యూరో: మృగశిర కార్తె రాకతో నగరంలో చేపల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ‘మృగశిర’ అడుగిడిన తొలి రోజే చేపలు తినడమనేది నగర ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆదివారం ఉదయం 11.36 గం.లకు మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. అయితే... ఆదివారం ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అనేక మంది శనివారం నాడే చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో శనివారం మార్కెట్లో చేపలు మరింత ప్రియమైపోయాయి. సాధారణ రోజుల్లో అమ్మకాల కంటే రెట్టింపు ధర పలికాయి. నగరంలో అనేక చోట్ల రోడ్డుపక్క టెంట్లు వేసి చేపల విక్రయాలు కొనసాగాయి. గిరాకీని బట్టి వ్యాపారులు రేట్లు నిర్ణయించడంతో ఒక్కోచోట ఒక్కో ధర పలికాయి. పెరిగిన దిగుమతులు... రామ్‌నగర్‌లోని దయార హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు రోజుకు 20 నుంచి 25 లారీల్లో చేపలు దిగుమతవుతుంటాయి. అయితే... మృగశిర కార్తె డిమాండ్ దృష్ట్యా శనివారం 45 నుంచి 50 లారీల్లో సరుకు దిగుమతైనట్లు టీ జీఆర్ కంపెనీ అధినేత గోవిందరాజ్ తెలిపారు. ఆదివారం నాడు ఇంకా ఎక్కువ గిరాకీ ఉండే అవకాశం ఉన్నందున 100-120 లారీల వరకు సరుకు దిగుమతయ్యే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, సూర్యాపేట, కోదాడ నుంచే కాకుండా ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేపలు దిగుమతైనట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ‘మాకు ఐస్ సమస్య అధికంగా ఉంది. కరెంట్ కోతల వల్ల ఈ దుస్థితి ఎదురైంది. ఒక్క బ్లాక్ ఐస్‌కు రూ.450-500లు వసూలు చేస్తున్నారు. ఆ ప్రభావమే చేపల ధరలపై పడింది. అందుకే రేట్లు అమాంతం పెరిగాయి’ అని ఆయన వివరించారు. మార్కెట్ల కళకళ... ధరల సంగతెలా ఉన్నా... సెంటిమెంట్ ప్రభావం చేపల మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. నగరంలోని చిన్నా, పెద్దా అన్ని మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. ఆనవాయితీ కారణంగా మాంసాహారులైన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పరిమాణంలో చేపలు కొనుగోలు చేయడం కనిపించింది. దీంతో అన్ని మార్కెట్లలో చేపల వ్యాపారం జోరుగా సాగింది. -
గుడ్డు.. వెరీబ్యాడ్
=అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లలో అన్యాయం =చిన్న గుడ్లతో మాయాజాలం =భారీ ఎత్తున హస్త లాఘవం? యలమంచిలి, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లను చూసి గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు పక్షి గుడ్ల పరిమాణంలో ఉండడమే ఇందుకు కారణం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూలు పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో ఉడికించిన గుడ్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. ఈ తెర వెనుక వ్యవహారంలో పెద్దతతంగమే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుడ్ల పంపిణీలో కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్ల పరిమాణాన్ని చూసి వీటిని తీసుకోడానికి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు నిరాకరిస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే ఒక గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాలి. కుళ్లిన, పగిలిన గుడ్లను కేంద్రాలకు పంపిణీ చేయకూడదు. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొన్ని గుడ్లు 40 గ్రాములు కూడా ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు, బాలింతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో రిటైల్‌గా కోడిగుడ్లను రూ.4కు, హోల్‌సేల్‌గా రూ. 3.88కు విక్రయిస్తున్నారు. చిన్న గుడ్లను హోల్‌సేల్‌గా రూ.2 నుంచి రూ.2.50పైసలకు అమ్ముతున్నారు. కోళ్లఫారాలనుంచి సేకరణ : అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కోళ్ల ఫారాలనుంచి చిన్న గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాల్లో నాణ్యత ఉన్న గుడ్లను మార్కెట్లకు తరలించి గ్రేడింగ్ద్వారా వేరుచేసిన చిన్న గుడ్లను, పాడైన గుడ్లను కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గుడ్ల నాణ్యతపై అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్టు అధికారులు పరిశీలించకపోవడం, ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్నగుడ్లు మాకొద్దు... : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లను పిల్లలు నిరాకరిస్తున్నారు. గుడ్ల పరిమాణంలో బాగా తేడా ఉండడంతో చిన్న గుడ్లు మాకొద్దంటూ పిల్లలు మారాం చేస్తున్నారు. ఇక గుడ్ల విషయమై కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే ధరలు పెరగడంవల్ల చిన్నగుడ్లు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. -
ఊరటనిస్తోన్న ఉల్లి
= హోల్‌సేల్‌గా కేజీ రూ.13 = రిటైల్‌గా కిలో రూ.35 = కొత్తపంట రాకతో దిగివ స్తోన్న ధరలు సాక్షి, సిటీబ్యూరో : ఢిల్లీ సర్కార్ పీఠాన్ని సైతం కదిలించిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే కిందకు దిగివస్తున్నాయి. వంటల్లో అతి ప్రధాన వస్తువైన ఉల్లిగడ్డ ధర క్రమేణా తగ్గుతుండటం గృహిణుల్లో కాస్తంత ఊరటనిస్తోంది. కొత్తపంట దిగుబడి ప్రారంభం కావడంతో సామాన్యుడికి ఉల్లి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.13లకు, గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.7లకు లభిస్తోంది. అయితే... రిటైల్ మార్కెట్లో మాత్రం దోపిడీ యథావిధిగా సాగుతోంది. వీరు నాణ్యమైన ఉల్లి కేజీకి రూ.35లు, రెండో రకం రూ.25-30ల ప్రకారం వసూలు చేస్తున్నారు. రైతుబజార్లో కేజీ రూ.24లు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. స్థానికంగా కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొత్తపంట దిగుబడి మొదలైంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దమొత్తంలో సరుకు దిగుమతి అవుతుండటంతో నగర మార్కెట్‌ను ఉల్లి ముంచెత్తుతోంది. నగరంలోని మహబూబ్ మేన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు శనివారం 80 లారీల్లో మొత్తం 8వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతైంది. గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1300లు, రెండో రకం రూ.700లు ధర పలికింది. ఈ ప్రకారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.13లు, గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.7ల ధర నిర్ణయమైందన్న మాట. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌కు 16వేల ప్యాకెట్స్ ఉల్లి దిగుమతి కాగా, ఇందులో 50 శాతం సరుకు స్థానికంగానే విక్రయించారు. ప్రస్తుతం జంటనగరాల్లో ఎక్కడా కొరత లేదని, ధరలూ స్థిరంగానే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగని దోపిడీ నిన్నమొన్నటి వరకు రెట్టింపు ధరలు వసూలు చేసిన ఉల్లి వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు తగ్గించేందుకు ఇష్టపడట్లేదు. ఫలితంగా రిటైల్ మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.25-30లప్రకారం వసూలు చేస్తున్నారు. తోపుడు బండ్ల వారైతే ఇంటివద్దకే సరుకు తెస్తున్నామంటూ కేజీ రూ.30-35లకు అమ్ముతున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ మార్కెట్లో పలికిన ధరకు రవాణా, హమాలీ, డ్యామేజి, లాభం వంటివి కేజీకి రూ.5-6లు చేర్చి రిటైల్ మార్కెట్లో ధర నిర్ణయించాలి. అంటే... గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.18-19లు, గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.12-13ల ప్రకారం విక్రయించాలి. అయితే... ఇటీవలి వరకు మంచి లాభాలకు అలవాటుపడ్డ వ్యాపారులు పాత ధరలకే అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. ఉల్లి ధరలు తగ్గాయన్న కారణంగా పదిరోజుల క్రితమే రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు నిలిపి వేశారు. ఆ మేరకు తగ్గిన రేట్లను బోర్డుపై రాయకుండా వ్యాపారులకు సహకరిస్తూ రైతుబజార్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం గ్రేడ్-2 రకం ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.7లు ధర ఉంటే... రైతుబజార్లో మాత్రం కేజీ రూ.24ల ప్రకారంబోర్డుపై ధర నిర్ణయించడం అక్రమాలకు అద్దం పడుతోంది. పెరిగిన విక్రయాలు రైతుబజార్లలో కాస్త తక్కువ ధరలకే ఉల్లిపాయలు లభిస్తుండటంతో అక్కడే ఉల్లి కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎర్రగడ్డ వంటి రద్దీ రైతుబజార్లో సాధారణ రోజుల్లో 60-70 క్వింటాళ్లు అమ్ముడుపోయే ఉల్లి ఆదివారం 120 క్వింటాళ్ల మేర విక్రయించారు. చిల్లర మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉండటంతో సరుకు హాట్ కేక్‌లా అమ్ముడుపోయిందని రైతుబజార్ వర్గాలు తెలిపాయి. మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్ ైరె తుబజార్లలో కూడా ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. ఒక్కో రైతుబజార్లో 100 క్వింటాళ్లకు పైగానే అమ్మకాలు జరిగినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. -
బ్లాక్ మార్కెట్‌కు రైతుబజార్ ఉల్లి
సాక్షి, సిటీబ్యూరో : రైతుబజార్లకు మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. నెల రోజులుగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పసిగట్టలేకపోయారు. ముఖ్యంగా రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడంతో వారు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకొంటున్నారు. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి నగరంలోని మహబూబ్‌మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో రోజుకు 75-100 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేస్తోంది. వీటిని ఒక్కో రైతు బజార్‌కు 10-15 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి ‘నో లాస్... నో ప్రాఫిట్’ ప్రాతిపదికన వినియోగదారులకు అందిస్తున్నారు. అంటే హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధర ఎంత ఉంటే... అంతే మొత్తానికి రైతుబజార్లో విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సరుకు సరఫరా చేసిన అధికారులు వాటి విక్రయాలపై నిఘా పెట్టలేదు. దీంతో రైతుబజార్ సిబ్బంది గుట్టుగా చ క్రం తిప్పి ఆ సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఉల్లి సరఫరా చేయగానే కేవలం 2గంటల సేపు విక్రయాలు జరిపి ఆ తర్వాత ‘నో స్టాక్’ బోర్డును వేలాడదీస్తున్నారు. దీంతో సరుకు అయిపోయిందనుకొని వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. అవసరమైనవారు కేజీకి రూ.50-60 అధికమొత్తం చెల్లించి రైతుబజార్‌లోని వ్యాపారుల వద్ద ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. నిజానికి రైతుబజార్‌కు వచ్చిన సరుకు వచ్చినంత వేగంగానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. కొందరు ఆటోల ద్వారా హోటళ్లు, రిటైల్ షాపులకు సరుకు తరలిస్తుండగా, మరికొందరు సంచార రైతుబజార్ల ద్వారా బయటకు తరలించి వివిధ ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్లలో జోరుగా సాగుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా వీరివైపు కన్నెత్తి చూడకపోవడంతో వీరు ఇష్టారీతిన కూరగాయల ధరలు నిర్ణయించడం, అలాగే తక్కువ ధరకు విక్రయించాల్సిన ఉల్లిని బయటకు తరలించి రెండు విధాలుగా దండుకొంటున్నారు. గుట్టుగా స్వాహా మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి రైతుబజార్లో కేజీ రూ.27.50కి లభిస్తుండగా ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-60లకు అమ్ముతున్నారు. ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతుబజార్ల ఉల్లిని కొనేందుకు హోటళ్లవారు ఎగబడుతున్నారు. నిజానికి రైతుబజార్ కౌంటర్లో ఓ బస్తా (50 కేజీలు) ఉల్లిని తూకం వేసి అమ్మేందుకు 30 నిముషాల సమయం పడుతోంది. ఈ ప్రకారం గంటకు 2బస్తాల ఉల్లిని మాత్రమే అమ్మేందుకు అవకాశం ఉంది. అంటే ఉదయం 2గంటలు సాయంత్రం 2గంటల సేపు విక్రయాలు సాగించినా... రోజుకు ఎనిమిది బస్తాల సరుకు మాత్రమే అమ్మే వీలుంది. అయితే... ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 20 బస్తాల ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయి. ఎనిమిది బస్తాల సరుకు అయిపోయినా మిగిలిన పన్నెండు బస్తాల ఉల్లి ఏమౌతుందన్నది సమాధానం లేని ప్రశ్న. స్టాక్ వచ్చిన రెండు గంటల్లోనే నో స్టాక్ బోర్డు వేలాడదీస్తూ వచ్చిన సరుకులో సగానిపైగా బయటకు తరలిస్తున్నారు. అయితే... సరుకు అయిపోయిందంటూ ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్ల నుంచి నిత్యం ఇంటెండ్ ఇస్తుండటం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఆయా రైతుబజార్లలో అక్రమాల తీరు ఎలా ఉందో అంచనా వేయవచ్చు. -
మందుల ధరలు తగ్గాయోచ్..
ఈడేపల్లి (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రెండేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రాహుల్‌కు నెలకు రూ.3 వేల వరకు మందులకు ఖర్చవుతోంది.. ఇప్పుడది రూ.2 వేలకు తగ్గింది.. మార్కెట్లో మందుల ధరలు తగ్గడమే దీనికి కారణం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల ధరలను నియంత్రించేలా ఔషధ ధరల నియంత్రణ చట్టాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ చట్టంతో మార్కెట్లో ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తాము తయారు చేస్తున్న ఔషధాలకు తామే ధర నిర్ణయించి విక్రయిస్తున్నాయి. ఆ ధరలకు తోడు మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు లాభాల కోసం అదనపు ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఈ పద్ధతికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అధిక ధరలకు మందుల్ని విక్రయిస్తున్న వ్యాపారులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, మందుల దుకాణ యజమానులు తాము నిర్ణయించిన ధరలకు ఔషధాల్ని విక్రయించే వీలు లేదు. పేరున్న, చిన్న పరిశ్రమల వ్యత్యాసం లేకుండా ఒక ఔషధాన్ని అందరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరకే విక్రయించాల్సి ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న అన్ని వర్గాల రోగులకూ ప్రయోజనం చేకూరనుంది. ఇకపై రోగులకు మందుల ఖర్చు తగ్గనుంది. 271 రకాల మందుల ధరలపై నియంత్రణ.. ప్రభుత్వం చేసిన చట్టంలో 271 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. దీంతో జిల్లా వాసులపై సుమారు రూ.65 లక్షల నుంచి 70 లక్షల మేర భారం తగ్గనుంది. జిల్లా వ్యాప్తంగా 1400 వరకు మెడికల్, 500 పైగా హోల్‌సేల్ (డిస్ట్రిబూటర్ ఏజెన్సీలు) షాపులు ఉన్నాయి. మొత్తం 1900 షాపుల ద్వారా నెలకు దాదాపు రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల మేర మందుల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఈ నెలాఖరు వరకు గడువిచ్చారు. ధరలు తగ్గిన మందులు ఇప్పటికే ఆయా షాపుల్లో అధిక ధరలతో ముద్రించి ఉంటే వాటిని కంపెనీలకు తిరిగి ఇచ్చి ధరలు తగ్గించి ముద్రించిన కొత్త సరకు తీసుకునేందుకు ఈ 45 రోజుల గడువును ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అంటే ఈ నెలాఖరు నుంచి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ప్రభుత్వం నిర్దేశించిన చట్టం ప్రకారం కొన్ని ఔషధాల ధరలు 25 నుంచి 35 శాతం వరకు తగ్గాయి. బీపీకి ఉపయోగించే ఎటెన్‌లాల్ (14 మాత్రలు) గతంలో రూ.51 ఉండగా ప్రస్తుతం రూ 30.43కు తగ్గించారు. ఫిట్స్‌కు వాడే ఎప్టైన్ (100 మాత్రలు) ధర రూ.232 నుంచి రూ.149కి తగ్గింది. కొలెస్ట్రాల్‌కు వాడే ఎటర్వాస్టాటిన్ (10 మాత్రలు) రూ.104 నుంచి రూ.62కి దిగి వచ్చింది. ఇన్ఫెక్షన్ నివారణకు వాడే ఎజిత్రాల్ (3 మాత్రలు) గత నెలలో రూ.95.55 ఉండగా ఈ నెల రూ.62.55కు లభిస్తుంది. ధరల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం ఔషధ ధరల నియంత్రణ చట్టం(డీపీసీ)ని 1995 నుంచి అమలు చేస్తున్నా పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి దీనిని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా ప్రారంభంలో 75 రకాల మందుల ధరలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం 271 రకాల మందుల ధరలకు డీపీసీని వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరికి మరో 348 రకాల మందుల ధరల్ని ఈ చట్టం కింద ఖరారు చేసి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో మందుల విక్రయాల్లో దోపిడీకి చెక్ పెట్టినట్టు అవుతుంది. మందుల షాపుల లాభాలకు కోత.. మారిన చట్టంతో మందుల షాపులు, హోల్‌సేల్ షాపుల నిర్వాహకుల లాభాలకు కోత పడనుంది. ఈ విధానం అమలుతో డిస్ట్రిబూటర్ స్థాయిలో 2 శాతం, రిటైల్ స్థాయిలో 6 శాతం లాభాలు తగ్గి రోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికితోడు అధిక ధరలు ఉన్న పాత సరకును వెనక్కి ఇచ్చి, తగ్గిన ధరలతో కొత్త సరకు తెచ్చుకోవడం కూడా సమస్యేనని మందుల షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. చట్టం కట్టుదిట్టంగా అమలైతే లెసైన్సులు లేకుండా అధిక ధరలకు విక్రయించడం, ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా తోచిన ధరలకు అమ్మే షాపుల నిర్వాహకులకు నిజంగా ఈ చట్టం వల్ల ఇబ్బందే. కట్టుదిట్టంగా అమలు రోగులకు తక్కువ ధరకు మందులు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టింది. సర్కారు నిర్దేశించిన ధరల కన్నా మంచి విక్రయాలు చేస్తే వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మెడికల్ దుకాణాలకూ మారిన రేట్లతో కూడిన మందుల వివరాల్ని పుస్తకాల రూపంలో అందించాం. - సి.రాజవర్థనాచారి, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్