సిద్దిపేట అర్బన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. ఆత్మీయ, అనుబంధాలకు ప్రతీతి.. రాఖీ. ఈ పండుగ రోజున ఆనందం అంబరమవుతుంది. ప్రతి ఇళ్లూ సంబరాలకు వేదికగా మారుతుంది. అందువల్లే పండుగకు రానురానూ ప్రాముఖ్యం ఏర్పడింది. అలాగే రాఖీలకూ డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చిన్న స్పాంజితో పాటు బంగారు రంగు కవర్‌పై ఓ ప్లాస్టిక్ బొమ్మ ఉండే రాఖీలు అందుబాటులో ఉండేవి.
కానీ మారుతున్న కాలానుగుణంగా రాఖీల్లోనూ ఎన్నో వెరైటీలు వచ్చేశాయి. మరెన్నో రకరకాల డిజైన్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. దారం, దూది రాఖీలు మొదలుకొని వెండి, బంగారు కోటింగ్ రాఖీల వరకు వచ్చేశాయి. సమారు ఆరువేల రకాల డిజైన్లు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. కొనుగోలు దారుల ఆసక్తి మేరకు సిద్దిపేట పట్టణ వ్యాపారులు సుమారు ఎనిమిది రాష్ట్రాల నుంచి రాఖీలను దిగుమతి చేసి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు.
రాఖీ డిజైన్‌లలోనూ మార్పులు
గతంలో నెమలి ఈకలు, పైసల, నోట్ల, దూది, స్వస్తి, హంస బిల్లలు, పొట్టి బొమ్మలు, కవర్ రాఖీలు తదితర వెరైటీలు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వెరైటీ రాఖీలు అమ్ముడుపోయేవి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంత మాత్రంగా ఉండడం వల్ల వెరైటీ రాఖీలు ఖరీదు చేసేవారు కాదు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాల క్రితం వెండికోటింగ్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారుల్లో ఆసక్తి మేరకు వ్యాపారులు ఐదు సంవత్సరాల నుంచి పలు డిజైన్‌లలో రాఖీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.
సిద్దిపేట కేంద్రంగా...
జిల్లాలో రాఖీల వ్యాపారం ఎక్కువగా సిద్దిపేట కేంద్రంగా సాగుతోంది. ప్రస్తుతం పట్టణంలో సుమారు ఆరు వేల రకాల డిజైన్లు అందుబాటులో ఉండి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. హోల్ సెల్ షాపులతో పాటు పట్టణంలో ప్రతి గల్లీలో రాఖీ విక్రయ కేంద్రాలు వెలిశాయి. రాఖీలతో పాటు ఫ్రెండ్‌షిప్ డే సందర్భాల్లో అవసరమయ్యే బ్యాండ్‌లను కూడా దుకాణాల్లో అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం రాఖీ డిజైన్లలో స్టోన్స్ ఐటెమ్స్‌కు ఆదరణ పెరిగింది. రకరకాల స్టోన్లతో పొందుపర్చిన రాఖీలు, వాటి అల్లికలు ఆకర్షిస్తున్నాయి.
ఢిల్లీ, రాజ్‌కోట్, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, బరోడా, ముంబై, రాజ్‌పుర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పలు రకాల వెరైటీలను దిగుమతి చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వాటి ధరల్లో మార్పు అంతగా లేకపోవడంతో రాఖీలకు భలే గిరాకీ ఏర్పడింది. పట్టణం నుంచి కరీంనగర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక, నిజమాబాద్ తదితర ప్రాంతాలకు రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. రూ.1 మొదలు రూ.1000 వరకు వివిధ రకాల రాఖీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం తయారు చేసిన చోటాభీమ్ రాఖీలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
భలే గిరాఖీలు
Published Fri, Aug 8 2014 12:32 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement