మాట్లాడుతున్న సీపీ ఎన్.శ్వేత
సిద్దిపేటకమాన్: జెడ్పీటీసీ శెట్టే మల్లేశం హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ’’ హత్య జరిగిన తర్వాత మంగళవారం చేర్యాల మండలం గుర్జకుంట ఉపసర్పంచ్ నంగి సత్యనారాయణ (32), అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్వరాజు సంపత్‌కుమార్ (24) పోలీస్ స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు.
తాము నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు. కుల సంఘం, గ్రామ రాజకీయంలో మల్లేశం తన ఎదుగుదలకు అడ్డు వస్తున్నాడన్న కక్షతో అడ్డు తొలగించుకోవాలని సత్యనారాయణ పథకం వేసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు కారులో గ్రామ శివారులో ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద వేచి ఉన్నారు. మల్లేశం ఉదయం వాకింగ్ చేసుకుంటూ నిందితులు ఉన్న కారు ముందు నుంచి వెళ్తుండగా.. సత్యనారాయణ కారును వేగంగా నడిపి మల్లేశంను వెనుక నుంచి ఢీకొట్టారు.
కిందపడిపోయిన మల్లేశం తలపై.. సత్యనారాయణ కత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు. అనంతరం ఇద్దరు నిందితులు కారులో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. నిందితుల నుంచి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని, కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాం’’ అని సీపీ తెలిపారు. కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్రనైనా ఉందా? అనే విషయాలపై విచారణ కొనసాగిస్తామని చెప్పారు. కేసు ట్రయల్ తొందరగా జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఎస్‌బి సీఐ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment