దివ్య హత్య కేసులో మరో కోణం.. | New Angle in Bank Employee Divya Murder Case | Sakshi
Sakshi News home page

దివ్య హత్య కేసులో మరో కోణం..

Published Wed, Feb 19 2020 11:01 AM | Last Updated on Wed, Feb 19 2020 6:13 PM

New Angle in Bank Employee Divya Murder Case - Sakshi

సాక్షి, గజ్వేల్‌ : దారుణ హత్యకు గురైన దివ్య కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు... హాస్టల్‌లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు  దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని...దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు భోగట్టా.  (గజ్వేల్లో యువతి దారుణ హత్య)

ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే..ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్‌తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయానట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లంటూ..
కాగా ఎల్లారెడ్డిపేటలో దివ్య నివాసం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎదిగిన బిడ్డ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న సమయంలో దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దివ్య తల్లి మణెమ్మ మాట్లాడుతూ.. వెంకటేషే తన బిడ్డను హతమార్చాడని, ఆరేళ్లుగా వెంటపడుతున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడని, చిన్నప్పుడు దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లి అయినట్లు ప్రచారం చేశాడని తెలిపారు. దివ్య జోలికి రావద్దని చెప్పినా వినలేదని, దీంతో 2018 అక్టోబర్ 9న ఎల్లారెడ్డి పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వెంకటేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ...మరోసారి దివ్య జోలికి రాను అని అతడు కాగితం రాసిచ్చాడని తెలిపారు. తన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement