Selfie Attempt: Three From Hyderabad Drown In Siddipet Lake - Sakshi
Sakshi News home page

Selfie Death: ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా..

Published Fri, May 5 2023 11:33 AM | Last Updated on Fri, May 5 2023 4:29 PM

Three From Hyderabad Died After Drown In Lake At Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్‌: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన షేక్‌ కైసర్‌ (28), అతని అన్నకొడుకు షేక్‌ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్‌ సోహెల్‌ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్‌లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్‌ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్‌ ఖైసర్, మమ్మద్‌ సోహెల్‌లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్‌లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు.

సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్‌ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్‌కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్‌ సోహెల్‌ ఇటీవలే టెన్త్‌ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement