ఈడేపల్లి (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రెండేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రాహుల్‌కు నెలకు రూ.3 వేల వరకు మందులకు ఖర్చవుతోంది.. ఇప్పుడది రూ.2 వేలకు తగ్గింది.. మార్కెట్లో మందుల ధరలు తగ్గడమే దీనికి కారణం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల ధరలను నియంత్రించేలా ఔషధ ధరల నియంత్రణ చట్టాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు 45 రోజులు గడువు ఇచ్చారు.
ఈ చట్టంతో మార్కెట్లో ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తాము తయారు చేస్తున్న ఔషధాలకు తామే ధర నిర్ణయించి విక్రయిస్తున్నాయి. ఆ ధరలకు తోడు మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు లాభాల కోసం అదనపు ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఈ పద్ధతికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అధిక ధరలకు మందుల్ని విక్రయిస్తున్న వ్యాపారులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
ఇకపై ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, మందుల దుకాణ యజమానులు తాము నిర్ణయించిన ధరలకు ఔషధాల్ని విక్రయించే వీలు లేదు. పేరున్న, చిన్న పరిశ్రమల వ్యత్యాసం లేకుండా ఒక ఔషధాన్ని అందరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరకే విక్రయించాల్సి ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న అన్ని వర్గాల రోగులకూ ప్రయోజనం చేకూరనుంది. ఇకపై రోగులకు మందుల ఖర్చు తగ్గనుంది.
271 రకాల మందుల ధరలపై నియంత్రణ..
ప్రభుత్వం చేసిన చట్టంలో 271 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. దీంతో జిల్లా వాసులపై సుమారు రూ.65 లక్షల నుంచి 70 లక్షల మేర భారం తగ్గనుంది. జిల్లా వ్యాప్తంగా 1400 వరకు మెడికల్, 500 పైగా హోల్‌సేల్ (డిస్ట్రిబూటర్ ఏజెన్సీలు) షాపులు ఉన్నాయి. మొత్తం 1900 షాపుల ద్వారా నెలకు దాదాపు రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల మేర మందుల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఈ నెలాఖరు వరకు గడువిచ్చారు. ధరలు తగ్గిన మందులు ఇప్పటికే ఆయా షాపుల్లో అధిక ధరలతో ముద్రించి ఉంటే వాటిని కంపెనీలకు తిరిగి ఇచ్చి ధరలు తగ్గించి ముద్రించిన కొత్త సరకు తీసుకునేందుకు ఈ 45 రోజుల గడువును ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
అంటే ఈ నెలాఖరు నుంచి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ప్రభుత్వం నిర్దేశించిన చట్టం ప్రకారం కొన్ని ఔషధాల ధరలు 25 నుంచి 35 శాతం వరకు తగ్గాయి. బీపీకి ఉపయోగించే ఎటెన్‌లాల్ (14 మాత్రలు) గతంలో రూ.51 ఉండగా ప్రస్తుతం రూ 30.43కు తగ్గించారు. ఫిట్స్‌కు వాడే ఎప్టైన్ (100 మాత్రలు) ధర రూ.232 నుంచి రూ.149కి తగ్గింది. కొలెస్ట్రాల్‌కు వాడే ఎటర్వాస్టాటిన్ (10 మాత్రలు) రూ.104 నుంచి రూ.62కి దిగి వచ్చింది. ఇన్‌ఫెక్షన్ నివారణకు వాడే ఎజిత్రాల్ (3 మాత్రలు) గత నెలలో రూ.95.55 ఉండగా ఈ నెల రూ.62.55కు లభిస్తుంది.
ధరల దోపిడీకి చెక్..
కేంద్ర ప్రభుత్వం ఔషధ ధరల నియంత్రణ చట్టం(డీపీసీ)ని 1995 నుంచి అమలు చేస్తున్నా పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి దీనిని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా ప్రారంభంలో 75 రకాల మందుల ధరలను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం 271 రకాల మందుల ధరలకు డీపీసీని వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరికి మరో 348 రకాల మందుల ధరల్ని ఈ చట్టం కింద ఖరారు చేసి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో మందుల విక్రయాల్లో దోపిడీకి చెక్ పెట్టినట్టు అవుతుంది.
మందుల షాపుల లాభాలకు కోత..
మారిన చట్టంతో మందుల షాపులు, హోల్‌సేల్ షాపుల నిర్వాహకుల లాభాలకు కోత పడనుంది. ఈ విధానం అమలుతో డిస్ట్రిబూటర్ స్థాయిలో 2 శాతం, రిటైల్ స్థాయిలో 6 శాతం లాభాలు తగ్గి రోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికితోడు అధిక ధరలు ఉన్న పాత సరకును వెనక్కి ఇచ్చి, తగ్గిన ధరలతో కొత్త సరకు తెచ్చుకోవడం కూడా సమస్యేనని మందుల షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. చట్టం కట్టుదిట్టంగా అమలైతే లెసైన్సులు లేకుండా అధిక ధరలకు విక్రయించడం, ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా తోచిన ధరలకు అమ్మే షాపుల నిర్వాహకులకు నిజంగా ఈ చట్టం వల్ల ఇబ్బందే.
కట్టుదిట్టంగా అమలు
రోగులకు తక్కువ ధరకు మందులు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టింది. సర్కారు నిర్దేశించిన ధరల కన్నా మంచి విక్రయాలు చేస్తే వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మెడికల్ దుకాణాలకూ మారిన రేట్లతో కూడిన మందుల వివరాల్ని పుస్తకాల రూపంలో అందించాం.
- సి.రాజవర్థనాచారి, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్
మందుల ధరలు తగ్గాయోచ్..
Published Tue, Sep 17 2013 1:19 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement