గుడ్డు వెక్కిరిస్తోంది..!
* రిటైల్ కోడి గుడ్డు ధర రూ.5
* హోల్‌సేల్‌గా వంద గుడ్ల ధర రూ.400
సాక్షి, హైదరాబాద్: గుడ్డు వచ్చి కోడిని వెక్కిరించిందంటే ఇదేనేమో..! బుధవారం హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లు రూ.396 పలికాయి. రవాణా చార్జీగా రూ.4 వసూలు చేస్తుండటంతో 100 గుడ్ల ధర రూ.400కు చేరింది. అంటే.. హోల్‌సేల్‌గానే ఒక్కో గుడ్డు రూ.4. చికెన్‌షాపుల వద్దకు వచ్చేసరికి రూ.4.50కి విక్రయిస్తున్నారు. వీరి వద్ద కొనుగోలు చేసే చిల్లర వ్యాపారులు ఒక్కో గుడ్డుకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌గా డజను కోడిగుడ్లు కొనాలంటే రూ.60 వెచ్చించాల్సి వస్తోంది.
నిత్యం మెనూలో గుడ్డును వడ్డించే హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఇప్పుడు గుడ్డు భారంగా మారింది. ఇప్పటికిప్పుడు రేట్లు పెంచితే కస్టమర్లు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో తటపటాయిస్తున్నారు. దీంతో ప్రభు త్వ హాస్టళ్లు, ఆస్పత్రులు వంటివాటి మెనూలో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ధర పెరగడం వల్ల కోడి గుడ్ల విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు.
దాణా ధరల ప్రభావం..
కోళ్ల దాణా(ఫీడ్) ధర అనూహ్యంగా పెరగడం వ ల్లే కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. కోడిగుడ్లకు రాష్ట్రం ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతుల ఆర్డర్ల వల్ల కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.