Hen eggs
-
సోనాలి జాతి కోళ్ల పెంపకం.... పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ
-
మన గుడ్డు వైపు.. విదేశాల చూపు
సాక్షి, అమరావతి: భారత దేశ కోడి గుడ్లకు.. మరీ ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల గుడ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. పలు దేశాలు కోడి గుడ్ల కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మలేసియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజుకు 5.5 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం దేశీయ గుడ్ల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా సుమారు 20 శాతం ఉంది. ప్రస్తుత డిమాండ్‌తో ఇది మరింత పెరగనుంది. స్థానిక డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఫాం గేటు వద్ద గుడ్డు ధర రూ.4.20 నుంచి రూ.5.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్లో చాలా చోట్ల ధర రూ.7కు చేరింది. మలేసియా వంటి దేశాల్లో గుడ్డు ధర రూ.8.50 దాటడంతో ఎగుమతులపై రాష్ట్ర పౌల్ట్రీ రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ అరేబియా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు మలేషియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల మార్కెట్లలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ధరలు పెరగడానికి కారణమిదే బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి వైరస్లు వ్యాప్తి చెందడంతో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక్క అమెరికాలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 8 కోట్ల కోళ్లను చంపేశారు. జపాన్‌లో మరో కోటికిపైగా కోళ్లను చంపేశారు. దీంతో అంతర్జాతీయంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ చిట్టూరి ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయం భారీగా పెరగడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పెంపకనానికి విరామం ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఉత్పత్తిని కొంత మేర తగ్గించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 45 లక్షల వరకు కోళ్ల ఉత్పత్తి తగ్గగా, ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి 20 లక్షలకు పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకుండాపోయింది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు కోటికి పైగా గుడ్లకు కొరత ఉందని అధికారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోనూ భారీగా పెరుగుతున్న గుడ్డు వినియోగం దేశంలో తలసరి కోడి గుడ్డు వినియోగం పెరుగుతుండటం కూడా గుడ్ల ధరలు పెరగడానికి మరో కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దేశంలో గడిచిన 15 ఏళ్లలో కోడి గుడ్ల తలసరి వినియోగం మూడురెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2005లో దేశీయ తలసరి కోడిగుడ్డు వినియోగం 34 ఉండగా అది 2021కి 90 గుడ్లకు పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని సురేష్ తెలిపారు. కోవిడ్‌కు ముందు తలసరి గుడ్డు వినియోగం 70గా ఉంటే అది 90కి చేరినట్లు తెలిపారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశీయ తలసరి కోడిగుడ్ల వినియోగం 180కి చేరినప్పుడే పిల్లలు బలవర్థకంగా ఉంటారని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశీయంగా, విదేశాలకు ఎగుమతుల్లోనూ రాష్ట్ర రైతులు దూసుకుపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
కొండెక్కిన కోడి ధర.. నెల రోజుల్లో స్కిన్లెస్ చికెన్ రేట్ అంత పెరిగిందా!
కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్‌తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది. వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్‌సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి. ధరలు పైపైకి జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్లెస్తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది. నష్టాలే కారణం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కోడి గుడ్డు రూ.వెయ్యి.. కోడి పిల్లల జత 10 వేలు
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి.. ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. కోళ్ల కోసం ప్రత్యేక దాణా.. పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కోళ్లకు ఆహారం తినిపిస్తూ.. గుడ్డు రూ.1,000 ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు. ఏటా పెరుగుతున్న ఆదాయం తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఆశీల్.. భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. పావురాలు, కుక్కలు కూడా.. కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు. అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు అందాల పోటీల్లో బహుమతుల పంట కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. -
గుడ్డు వెక్కిరిస్తోంది..!
* రిటైల్ కోడి గుడ్డు ధర రూ.5 * హోల్‌సేల్‌గా వంద గుడ్ల ధర రూ.400 సాక్షి, హైదరాబాద్: గుడ్డు వచ్చి కోడిని వెక్కిరించిందంటే ఇదేనేమో..! బుధవారం హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లు రూ.396 పలికాయి. రవాణా చార్జీగా రూ.4 వసూలు చేస్తుండటంతో 100 గుడ్ల ధర రూ.400కు చేరింది. అంటే.. హోల్‌సేల్‌గానే ఒక్కో గుడ్డు రూ.4. చికెన్‌షాపుల వద్దకు వచ్చేసరికి రూ.4.50కి విక్రయిస్తున్నారు. వీరి వద్ద కొనుగోలు చేసే చిల్లర వ్యాపారులు ఒక్కో గుడ్డుకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌గా డజను కోడిగుడ్లు కొనాలంటే రూ.60 వెచ్చించాల్సి వస్తోంది. నిత్యం మెనూలో గుడ్డును వడ్డించే హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఇప్పుడు గుడ్డు భారంగా మారింది. ఇప్పటికిప్పుడు రేట్లు పెంచితే కస్టమర్లు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో తటపటాయిస్తున్నారు. దీంతో ప్రభు త్వ హాస్టళ్లు, ఆస్పత్రులు వంటివాటి మెనూలో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ధర పెరగడం వల్ల కోడి గుడ్ల విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. దాణా ధరల ప్రభావం.. కోళ్ల దాణా(ఫీడ్) ధర అనూహ్యంగా పెరగడం వ ల్లే కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. కోడిగుడ్లకు రాష్ట్రం ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతుల ఆర్డర్ల వల్ల కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.