సాక్షి, అమరావతి: భారత దేశ కోడి గుడ్లకు.. మరీ ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల గుడ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. పలు దేశాలు కోడి గుడ్ల కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మలేసియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజుకు 5.5 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం దేశీయ గుడ్ల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా సుమారు 20 శాతం ఉంది. ప్రస్తుత డిమాండ్‌తో ఇది మరింత పెరగనుంది.
స్థానిక డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఫాం గేటు వద్ద గుడ్డు ధర రూ.4.20 నుంచి రూ.5.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్లో చాలా చోట్ల ధర రూ.7కు చేరింది. మలేసియా వంటి దేశాల్లో గుడ్డు ధర రూ.8.50 దాటడంతో ఎగుమతులపై రాష్ట్ర పౌల్ట్రీ రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ అరేబియా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు మలేషియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల మార్కెట్లలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
ధరలు పెరగడానికి కారణమిదే
బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందడంతో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక్క అమెరికాలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 8 కోట్ల కోళ్లను చంపేశారు. జపాన్‌లో మరో కోటికిపైగా కోళ్లను చంపేశారు. దీంతో అంతర్జాతీయంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ చిట్టూరి ‘సాక్షి’కి తెలిపారు.
ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయం భారీగా పెరగడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పెంపకనానికి విరామం ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఉత్పత్తిని కొంత మేర తగ్గించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 45 లక్షల వరకు కోళ్ల ఉత్పత్తి తగ్గగా, ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి 20 లక్షలకు పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకుండాపోయింది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు కోటికి పైగా గుడ్లకు కొరత ఉందని అధికారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోనూ భారీగా పెరుగుతున్న గుడ్డు వినియోగం
దేశంలో తలసరి కోడి గుడ్డు వినియోగం పెరుగుతుండటం కూడా గుడ్ల ధరలు పెరగడానికి మరో కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దేశంలో గడిచిన 15 ఏళ్లలో కోడి గుడ్ల తలసరి వినియోగం మూడురెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2005లో దేశీయ తలసరి కోడిగుడ్డు వినియోగం 34 ఉండగా అది 2021కి 90 గుడ్లకు పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని సురేష్ తెలిపారు.
కోవిడ్‌కు ముందు తలసరి గుడ్డు వినియోగం 70గా ఉంటే అది 90కి చేరినట్లు తెలిపారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశీయ తలసరి కోడిగుడ్ల వినియోగం 180కి చేరినప్పుడే పిల్లలు బలవర్థకంగా ఉంటారని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశీయంగా, విదేశాలకు ఎగుమతుల్లోనూ రాష్ట్ర రైతులు దూసుకుపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మన గుడ్డు వైపు.. విదేశాల చూపు
Published Thu, Jan 19 2023 2:14 AM | Last Updated on Thu, Jan 19 2023 9:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment