కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్‌తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది.
వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్‌సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి.
ధరలు పైపైకి
జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్‌లెస్‌తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్‌లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది.
నష్టాలే కారణం
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment